గురువారం 13 ఆగస్టు 2020
Devotional - Jul 26, 2020 , 23:02:44

సౌభాగ్య వర లక్ష్మి!

సౌభాగ్య వర లక్ష్మి!

  • 31వ తేది వరలక్ష్మీ వ్రతం

శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే  శుక్రవారం (31వ తేది) వరాలిచ్చే వరలక్ష్మిగా శ్రీమహాలక్ష్మిని అర్చిస్తాం. సౌభాగ్యాల సిరులను కురిపించే తల్లి శ్రావణ లక్ష్మి! మంగళకరమైన ఆ శుభదినాన ఆమె మన ఇంట్లోకి అడుగు పెట్టడమే జన్మజన్మల పుణ్యఫలం. భక్తిశ్రద్ధలతో ఆరాధించిన ప్రతి ఒక్కరికీ కోరిన వరాలిచ్చే చల్లని తల్లి ఆమె.

అష్టలక్ష్ములూ వరలక్ష్ములే. ‘వర’ అంటే ‘శ్రీహరి’. వరునితో కూడిన లక్ష్మి కనుకే, ఆమె వరలక్ష్మి, వరాల లక్ష్మికూడా. ఆమె శ్రీమన్నారాయణమూర్తితో కూడి ఉన్నప్పుడే మనకు వరాలు ఇస్తుంది. భార్యాభర్తలను విడదీసే సంస్కృతి కాదు, మనది. సీతారాములు, పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీనారాయణుడు.. ఇలా దేవీదేవుళ్లను జంటగా కొలవడం ఆనవాయితీ. ఐతే, ఇక్కడ మాత్రం ముందు స్వామి పేరు, ఆ తర్వాతే అమ్మవారు. 

నారాయణ సమావిష్టాం తత్‌ హృదయ పద్మ నివాసినీం మహాలక్ష్మీం, సదాలక్ష్మీం నమామి హరివల్లభా॥

అంటూ వరలక్ష్మీదేవిని స్తోత్రం చేస్తాం. ఈ స్తోత్రంతోనే వరలక్ష్మీ వ్రతం మొదలుపెట్టాలని ‘స్కాంద పురాణం’ చెపుతున్నది. ఈ వ్రతాన్ని ముందు పరమేశ్వరుని నుంచి పార్వతీదేవి ఉపదేశంగా పొందినట్లు పౌరాణిక గ్రంథాలనుబట్టి తెలుస్తున్నది. ఈ వ్రత ఫలితంగానే పార్వతి ‘షణ్ముఖస్వామి’ (కుమారస్వామి)ని సంతానంగా పొందినట్లు వేద పండితులు చెప్తారు. అలాగే, చరిత్రలో ప్రసిద్ధిగాంచిన నందుడు, విక్రమార్కుడు వంటివారు కూడా ఈ వ్రతాన్ని నిష్ఠగా చేసి, ‘సింహాసనాధికారం’ పొందినట్లు కూడా కథలు వున్నాయి.

ఒకసారి పార్వతి, పరమేశ్వరునితో ‘లోకంలో స్త్రీలు ఏ వ్రతాన్ని ఆచరిస్తే సకల సౌభాగ్యాలతో ఉండగలుగుతారు? అలాంటి వ్రతాన్ని వివరించమని’ కోరుతుంది. అప్పుడు శంకరుడు, ‘శ్రావణమాసంలో శుక్లపక్ష పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఆచరించే ‘వరలక్ష్మి’ పేరున గల వ్రతం అంతటి గొప్పదిగా’ వివరించాడు. దీనివల్ల ముత్తయిదువలకు సకల కోరికలూ సిద్ధిస్తాయన్నది ఈశ్వర వచనం. ఈ సందర్భంగా వ్రత మహత్తును తెలిపే ఒక కథను కూడా చెప్పాడు సదాశివుడు. 

పూర్వం మగధ దేశంలో కుండినంబు అనే పట్టణం ఉంది. అక్కడ ‘చారుమతి’ అనే ఇల్లాలు మహా పతివ్రత. తన భర్త, అత్తమామలను సేవిస్తూ గృహస్థు ధర్మాన్ని ఆదర్శవంతంగా నిర్వహిస్తున్నది. ఒకరోజు అమ్మవారు ఆమె స్వప్నంలోకి వచ్చి, ‘శ్రావణ శుక్లపక్ష పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు. నువు కోరిన వరాలన్నీ ఇస్తానని’ చెప్పిందిట. అదే విధంగా, చారుమతి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి అమ్మవారి కృపకు పాత్రురాలైంది. అది మొదలు, స్త్రీలంతా ఈ మహిమాన్వితమైన ‘వరలక్ష్మీ వ్రతాన్ని’ ఆచరిస్తూ ఆ తల్లి అనుగ్రహాన్ని పొందుతున్నారు.

సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి అభ్యంగన స్నానం చేయాలి. నూతన వస్త్రధారణతో పూజకై నిర్దేశించిన స్థలాన్ని గోమయంతో అలుకాలి. ముగ్గుతో రంగవల్లులు తీర్చిదిద్ది అక్కడ పసుపు రాయాలి. ముగ్గులు పెట్టిన పీటను ఉంచి, నూతన వస్త్రం పరిచి, బియ్యం పోయాలి. ఒక కొబ్బరికాయకు అమ్మవారి రూపు ప్రతిబింబించేలా పసుపు ముద్దతో కనులు, ముక్కు, చెవులు తీర్చిదిద్దాలి. నుదుట కుంకుమ, కనులకు కాటుక అద్దాలి. దానిని ఒక నీళ్లుగల కలశంలో అమర్చాలి.

కలశస్య ముఖే విష్ణుః 

కంఠే రుద్ర సమాశ్రితా

మూడేతు దేవతా సర్వే

కలశంబు సమాశ్రితాః

ఏ వ్రతానికైనా కలశం తప్పనిసరి. ‘కలశం’ అంటేనే త్రిమూర్తులకు ప్రతీక. త్రిలోకాలతోపాటు 33 కోట్ల దేవతలకు కలశమే ప్రతినిధి. ‘ఆపోవ ఇదవం సర్వం. విశ్వ భూతాన్ని ఆపః’. అంటే, ప్రపంచంలోని సకల ప్రాణులూ జలమే. ‘జగత్తంతా నీరే’ అని వేదం కూడా చెప్పింది. నీరు అంటే వరుణుడు. ఆ కలశంలోకి వరుణుణ్ని ఆవాహనం చేసి, అతనికి అంతర్యామిగా ఉన్న శ్రీమన్నారాయణుని ఆరాధిస్తాం.

ఈ కలశం (చెంబు) ఇనుము కాక మరే లోహానిదైనా శ్రేష్టమే. చదివే మంత్రాలను గ్రహించగలిగే శక్తి రాగి లోహానికి ఉంటుంది. వేద పండితుల మంత్రశక్తి రాగికి వుంటుంది. అందుకే, దేవాలయాలలో ఉద్ధరణి, పంచపాత్ర, శఠగోపం వంటివన్నీ (ఉత్సవ విగ్రహాలతోసహా) రాగివై ఉంటాయి. ముందు గణపతి పూజ, తర్వాత పుణ్యావాచనం, ఆపై రక్షాబంధనం తర్వాత ప్రధాన దేవతారాధన చేయాలి. ‘గృహిణే గృహమిచ్చతే’ అంటే, ‘ఇల్లు అంటే ఇల్లాలు’. ఇంటి గడపకు పసుపు కుంకుమలు అద్దడమంటే, ఇల్లాలు ముఖానికి పసుపు, నుదుట కుంకుమ దిద్దడమే. ద్వారానికి పూలమాలలు. ఇల్లాలు కొప్పులో పూలు. ముఖద్వారానికి తోరణాలు. ఇల్లాలు చేతికి తోరాలు. ఇలా, ఇల్లాలికి ప్రతినిధి ఇల్లే.

ఫలాల్లో అమ్మ వారికి కొబ్బరిబోండం ఇష్టం. గోక్షీరం, ఆవునెయ్యి, మారేడు ఆకులు.. ఇవి వరలక్ష్మికి ఇష్టం. ముందు అశ్వాలు వెనుక ఏనుగులు రాగా, మధ్యలో అమ్మవారు రథం మీద వస్తుంది. ఆ రూపాన్ని తలుచుకుంటూ, ఆమె మన ఇంటికి వస్తున్నట్టుగా భావిస్తూ, ఆరాధించాలి. అప్పుడు అమ్మవారు ఎంతగానో సంతోషిస్తుందంటారు వేద పండితులు. ఇంకా ఆమెకు పట్టువస్ర్తాలు ప్రీతిపాత్రం.  

ఆమె పుట్టిందే పుష్పంలో కాబట్టి, పుష్పాలు అన్నా చాలా ఇష్టం. ఆమెకు ఇష్టమని దోసిళ్ళతో పుష్పాలను ఆమెపై చల్లకూడదు. మంత్రపూర్వకంగా ఒక్కో పుష్పం ఆమెవద్ద పెట్టాలి. అప్పుడు పూలన్నీ మంత్రపుష్పాలుగా మారుతాయి. 

కోర్కెలు తీర్చే నైవేద్యాలు!

వరలక్ష్మికి అరటిపళ్లను నైవేద్యంగా సమర్పించాలి. అరటి ఆకులలో పంచాన్నాలు (దద్ధ్యోదనం, పాయసాన్నం, పులిహోర, పులగాన్నం, గుడాన్నం) పెట్టాలి. అమ్మవారికి ఈ నైవేద్యాల వల్ల భిన్నమైన ప్రయోజనాలు సమకూరుతాయి. పెరుగన్నంతో సంపదలు, ఆవుపాలు- బియ్యంతో చేసిన పాయసాన్నంతో కోరిన కోర్కెలు సిద్ధిస్తాయని పండితులు చెప్తారు. హరిద్రాన్నం (పసుపుతో చేసింది), పులిహోరల వల్ల భార్యాభర్తలమధ్య ఐకమత్యం, సంతానాభివృద్ధి కలుగుతుంది. బెల్లంతో చేసిన గు డాన్నంతో మనకు ఆరోగ్యం సిద్ధిస్తుంది. నానబెట్టిన శనగలు, దానిమ్మ పళ్ళు, అరటి పళ్ళను నైవేద్యంగా అమ్మవారికి అర్పించి, ముత్తయిదువలకు వాయినాలు ఇవ్వాలి. ఫలితంగా ఆ సువాసినులకు జీవితాలు సౌభాగ్యవంతమవుతాయి. మందారపూలతో అర్చన చేస్తే మనకు సుఖనిద్ర, గన్నేరు పూలతో పూజ చేస్తే సువర్ణాది ధాతువులు లభిస్తాయని అంటారు. మల్లెపూలతో పూజ చేస్తే సకల కోరికలు సిద్ధిస్తాయి. గడ్డిపూలు, నీలిరంగు పూలు ఈ వ్రతానికి పనికిరావనీ అంటున్నారు. మహిమాన్వితమైన ఈ వరలక్ష్మీ వ్రతం జరుపుకొని ఆ తల్లి కృపకు అందరం పాత్రులమవుదాం.


logo