శనివారం 15 ఆగస్టు 2020
Devotional - Jul 26, 2020 , 23:02:42

వారి సేవలో తరించడమే!

వారి సేవలో తరించడమే!

నాలుగు ఋణాలలో ఒక్క మాతృఋణం నుండే విముక్తి ఉండదంటారు. ఎందువల్ల?    

- బి.శ్రీనాథశర్మ, సిద్దిపేట

భారతీయ సంప్రదాయం ప్రకారం ప్రతి వ్యక్తీ ‘దేవ, ఋషి, పితృ, సామాజిక’ ఋణాలను తీర్చుకోవాలి. యజ్ఞయాగాదులవల్ల దేవఋణాన్ని, ఆధ్యయన- ఆధ్యాపకతలవల్ల ఋషిఋణాన్ని తీర్చే ప్రయత్నం చేస్తాం. మన అవసరాలను తీర్చే సమాజానికి ఉపయోగపడటం ద్వారా సామాజిక ఋణాన్ని తీర్చాలి. ఈ మూడింటినీ కొంత తీర్చగలిగినా ‘పితృఋణం’ తీర్చలేనిదని శాస్ర్తాలు చెబుతున్నాయి. 

‘పితృ’ శబ్దంలో ‘తల్లిదండ్రి’ ఇద్దరూ ఉంటారు. మన శరీరానికి కారణభూతులైన తల్లిదండ్రుల ఋణాన్ని తీర్చడం సాధ్యపడదు. తన ప్రాణాలను అడ్డు పెట్టి, నవమాసాలు మోసి, కని, పెంచి, మల మూత్రాదులు కడిగి, జీవనగతి నిర్మాణంలో ఆదిగురువై, వికాసాన్ని, విస్తరణను అందించే ‘తల్లి ఋణం’ తీర్చడం ఎలా సాధ్యం? అవతార పురుషులైనా తల్లి గర్భం నుండే రావాలి. అందుకే, ఆదిశంకరులు ‘కుపుత్రోజాయేత్‌ క్వచిదపి కుమాతా నభవతి’ (సంతానం చెడ్డవారు కావచ్చు కాని, తల్లి ఎప్పుడూ చెడ్డది కాదు) అన్నారు. ఆదిశక్తిని మాతృరూపంలో ఆరాధిస్తాం. ఆ శక్తికి శివుడే తన శరీరంలో సగభాగమిచ్చి గౌరవించాడంటే, స్త్రీ అందులోనూ తల్లి  సౌజన్యాన్నీ, సౌభాగ్యాన్నీ మనం గుర్తించడం, ఆమె ఋణం తీర్చుకోవడం అన్నది అసంభవం. 

మాతృభావనలో వాత్సల్యత ఉంది. అనురాగం ఉంది, ఆప్యాయత ఉంది, స్వచ్ఛత ఉన్నది. స్త్రీ ప్రతిదీ ఒక ఉత్సవం లాగా తీసుకునే స్వభావాన్ని కలిగి ఉంటుంది. తల్లి హృదయం అద్దం లాంటిది. అందులో మన ప్రతిబింబాన్ని చూసుకుంటూ ప్రవర్తనను సరిచేసుకోవలసి ఉంటుంది. ఇవాళ వ్యాపార దృక్పథంలో మాతృత్వమూ పునరుత్పత్తికి ప్రతీకగా మారింది. కాని, మాతృత్వపు ఉన్నతి, పరిణతి ఏ షరతులూ లేకుండా తన శరీరంలో మరొక జీవిని సహనంతో భరించడంలోనే ఉంది. వేరొకరి జీవితాన్ని తనలో భాగంగా చూసుకోవడంలోనూ ఉన్నది. భావితరాలను తయారుచేయడానికి సిద్ధపడటంలో ఉంది. ఆ బాధ్యతలో ఉంది.

 తండ్రి తెలివి కలిగిన సంతానాన్ని గుర్తిస్తాడు. కాని, తల్లి హృదయం బలహీనులవైపు మొగ్గుతుంది. బలహీనులను పోషిస్తుంది. ఆదరిస్తుంది, రక్షిస్తుంది. వారికి ఆసరా ఇస్తుంది. అలాంటి వారూ సాహసంతో జీవితంలో ఏదైనా సాధించేందుకు అవసరమైన ప్రేరణనిస్తుంది, తీర్చిదిద్దుతుంది. క్లిష్ట సమయాలలో చేయి అందించి నడిపిస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. కమ్మదనం కలిగిన అమ్మదనాన్ని ఆమె వృద్ధాప్యంలో వృద్ధాశ్రమాలకు అంకితం చేసే దుష్ట సంస్కృతి పాతుకు పోతున్నది. దీనికి చరమగీతం పాడుతూ, తల్లిదండ్రుల సేవలో తరించిపోవడం తప్ప, మనం మరేమీ చేయలేం.


logo