బుధవారం 05 ఆగస్టు 2020
Devotional - Jul 26, 2020 , 23:02:44

పరిణత వ్యక్తిత్వం

పరిణత వ్యక్తిత్వం

రావణ వధానంతరం ఆ వార్తను సీతకు చెప్పేందుకై  హనుమ వస్తాడు. ‘తల్లీ! నువు అనుమతిస్తే ఇంతకాలంగా నిన్ను హింసించిన ఈ రాక్షస స్త్రీలను సంహరిస్తాను’ అంటాడు. దానికి ఆమె ‘రాజాజ్ఞను పాలించిన వారికి ఏ దోషమూ లేదు. వారు నాకు అపకారం చేసినా సరే, క్షమించాల్సిందే’ అంటుంది.  అది మనిషిలో వుండవలసిన పరిణత వ్యక్తిత్వాన్ని  తెలుపుతుంది.

ఒక వేటగాడు ఓసారి అడవికి వెళ్ళాడు. దురదృష్టవశాత్తు ఆకలితో ఉన్న పెద్దపులి అతని వెంటబడటంతో అతడు దగ్గరలోని పెద్దచెట్టుపైకి ఎగబాకాడు. ఎత్తయిన కొమ్మపై కూర్చొని పైకి చూడగానే భయంకరమైన ఎలుగుబంటి కనిపించింది. ‘ముందు నుయ్యి- వెనుక గొయ్యి’ లాగా అయ్యింది పరిస్థితి.  ఎలాగో ధైర్యం తెచ్చుకొని, ఎలుగుబంటి వైపు చేతులు జోడించి, “నీ శరణు వేడుతున్నాను. ఈ పులి బారిన పడకుండా నాకు ప్రాణభిక్ష పెట్టు” అని వేడుకొన్నాడు. ఎలుగుబంటి అభయమిస్తూ, “నా శరణు కోరిన నీకు ప్రాణభయం లేదు. పై కొమ్మపై విశ్రాంతి తీసుకో” అంది. ఇది చూసిన ఒక కోతి, “మనుషులు నమ్మకస్థులు కారు. కష్టాలు కొని తెచ్చుకోకు” అని హితవు పలికింది. 

 అసహనంతో పులి, ఎలుగుబంటిని ఉద్దేశించి అంది- “మిత్రమా! జంతువులమైన మనల వేటాడే ఉమ్మడి శత్రువునకు ఆశ్రయ మివ్వడం బుద్ధిహీనత. వాడిని కిందికి తోసెయ్యి”. దానికి ఎలుగుబంటి, ‘నేను చెప్పిందే చేస్తాను. చేయగలిగిందే చెప్తాను. అతిథిని రక్షించడమే నా కర్తవ్యం. నువు వెళ్ళవచ్చు” అంది. పులి వెళ్ళకుండా ఆశగా, అక్కడే కూర్చుంది. కోతి ఇచ్చిన తేనె, పండ్లతో మనిషి ఆకలి తీర్చుకున్నాడు. ఎలుగుబంటి నిద్రలోకి జారుకుంది. అప్పుడు పులి, వేటగానితో “ఎలుగుబంటిని కిందికి తోసివేయి. నా ఆకలి తీర్చుకుంటాను. నిన్నేమీ అనను” అంది. 

కృతఘ్నుడైన వేటగాడు ఎలుగుబంటిని తోసివేస్తాడు. కానీ, అప్రమత్తంగా వున్న కోతి అప్పుడే అరవడంతో మేలుకొన్న ఎలుగుబంటి కొమ్మలను పట్టుకొని నిలదొక్కుకుంటుంది. అప్పుడు పులి, ఎలుగుతో “చూశావా, మనుషులెంత విశ్వాస ఘాతకులో! ఇప్పటికైనా వాడిని తోసేయి” అంది. ఎలుగుబంటి స్థిరమైన స్వరంతో, “మానవత్వానికి మచ్చ తెచ్చే ఈ మనిషి ప్రవర్తన గర్హణీయమే కావచ్చు. అయినా, ఉన్నత వ్యక్తిత్వం కలిగిన వారు అపకారం చేసిన వారినైనా క్షమిస్తారు. అదే ఉత్తమ ధర్మం. ఆ ధర్మాన్ని నేను వదలుకోను” అంది. “అంతేకాదు, ఇతనిని చంపకుండా దయ చూపడం ద్వారా ఇతనిలో పరివర్తన రావచ్చు. హింసామార్గాన్ని విడిచి పెట్టవచ్చు” అని కూడా అన్నది. 

వింటున్న వేటగానిలో నిజంగానే పరివర్తన కలిగింది. ‘ఇక నుండి వేటాడను’ అని ఒట్టు పెట్టుకున్నాడు. ఇంతలో జంతు కళేబరంతో అటుగా వచ్చిన చిరుత ఆ మాంసాన్ని పులికి అందించింది. ఆకలి తీరిన పులి, “నేను కూడా ఇకనుండి జీవించడానికే తింటాను, తినేందుకే బతుకను” అంది. భయం వీడిన మనిషి, ఎలుగుబంటి, కోతి కొందికి దిగి వచ్చి స్వేఛ్చగా ఎవరిదారిన వారు వెళ్లారు. 


logo