శుక్రవారం 14 ఆగస్టు 2020
Devotional - Jul 24, 2020 , 23:57:13

నీరూ పరబ్రహ్మ స్వరూపమే!

నీరూ పరబ్రహ్మ స్వరూపమే!

నమస్తే విశ్వరూపాయై వైష్వానరస మూర్తయే

నమస్తే జలరూపాయై సూత్రాత్మవ పుషేనమః

యస్మిన్‌ సర్వేలింగదేహా ఓతప్రోతా వ్యవస్థితా

నమః ప్రాజ్ఞ స్వరూపాయ నమోవ్యాకృత మూర్తయే.

విశ్వరూపిణి, జలస్వరూపిని అయిన భవానికి నమస్కరిద్దాం. ‘దుర్గ’ అన్న పేరు ఒక విశిష్ట మహామంత్రం. దుర్గా తత్త్వం అనేక పురాణాలలోనూ ఉన్నది. ‘దుర్గాం దేవీ శరణమహం పపద్యే/ సుతరసితరసే నమః’ అని వేదం అమ్మవారిని శరణ్యశక్తిగా వర్ణించింది. ప్రకృతిలోని పంచభూతాలలో శక్తి అమ్మవారే. నీటితో దాహాన్ని పోగొట్టి ప్రాణాన్ని నిలిపేది ఆమెయే. ‘భవ’ పేరుతో ఉన్న నీరే శివుడు. ఆ నీటిలో అమ్మరూపంగా ఆమె అనుష్ఠితమైంది. 

భగవంతుని ఊపిరైన వేదమే దీనిని మనకు ప్రమాణంగా చెప్పింది. మన నాగరికత అంతా నదీతీరాల్లోనే మొదలైంది. నదీనాదం మనసుకు ప్రశాంతతతో పాటు ఏకాగ్రతను అందిస్తున్నది. అందుకే, తపస్సుకు అనుకూలమైన నదీతీరాల్లోనే ఋషులు, జ్ఞానులు నివాసం వుండేవారు. పోయే ప్రాణాన్ని వెనక్కి తెచ్చేది సృష్టిలో నీరు మాత్రమే. ప్రతి నీటి బిందువులో అనుష్ఠాన దేవత ఉంటుంది. నదిలో వుండే ఒక్కొక్క అనుష్ఠాన దేవత ప్రజలను ఒక్కొక్క విధంగా సంరక్షిస్తుంది. నీరు లేకపోతే ధర్మం లేదు. ప్రాణులు వుండవు. సృష్టి చక్రమే ఆగిపోతుంది. 

భవాని ఎంత శక్తివంతురాలో అంత కరుణామయురాలు. నీటితో స్నానం చేస్తే మనకు ఆ తల్లి పది రకాల ఉత్తేజాలనిస్తుంది. నీటిపట్ల గౌరవంతో స్నానం చేసేవారికి తేజస్సు కలుగుతుంది. స్నానం వల్ల శరీరానికి  బలం చేకూరుతుంది. ఏదైనా మంచి కార్యం చేయడానికి అర్హత స్నానంతోనే కలుగుతుంది. నియమబద్ధంగా, శుభ్రంగా స్నానం చేసేవారికి ఆయుర్దాయమూ నిలబడుతుంది. రోజూ తలస్నానం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యం కలుగుతుంది. ఇంద్రియ నిగ్రహం, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి.. ఇవన్నీ మనకు స్నానం వల్లనే లభిస్తాయి. దుస్వప్నాలను నశింపచేసే శక్తికూడా స్నానానికి ఉన్నది. 

నీటిలోని అధిదేవత అయిన భవాని వీటన్నిటినీ మనకు ప్రసాదిస్తుంది. అందుకే, స్నానం చేసేటప్పుడు, ఏదైనా పూజ చేసేప్పుడు సమస్త నదులను ఆవాహన చేయడం మన జాతి లక్షణం. వినాయక చవితి పూజ తర్వాత ఆ మట్టి ప్రతిమలను, పత్రిని నీటిలో నిమజ్జనం చేస్తాం. దీనివల్ల ఔషధీ తత్తాన్ని నీరు పొందుతుంది. కాళింది మడుగులో కాళీయుడు విడిచిన విషం యమునా నదిలో కలిసి ఎన్నో గోవులు చనిపోయిన పురాణ కథ మనకు తెలుసు. ఆ విషపు గాలి పైకి లేచి ఆకాశంలో విహరించే పక్షులూ నేలకూలి పోయాయి. అప్పుడు శ్రీకృష్ణ భగవానుని కాళీయ మర్దనం ఒక అద్భుత ఘట్టం.

గజేంద్రమోక్షంలో ఏనుగు నీళ్ళు తాగి వెళ్లిపోక, తొండంతో నీటిని పీల్చి ఆకాశం వైపు చిమ్మడం, బలాన్నంతా ప్రదర్శిస్తూ నీటినంతా అతలాకుతలం చేయడం.. వంటివాటివల్లే మొసలి దాని కాలును పట్టేసింది. నీటిని పవిత్రంగా చూడటమంటే భగవతిపట్ల, ప్రకృతిపట్ల భక్తిని ప్రదర్శించడమే. నీటితోనే సమస్త లోకాలు నిలబడుతున్నందున నీరూ పరబహ్మ స్వరూపమని గుర్తించాలి. గుక్కెడు నీళ్ళు ఇవ్వటమూ ఎంతో పుణ్యం. ఇంత పవిత్రమైన నీటిని కాళ్లతో తన్నడం, దానిలో ఉమ్మడం, మలమూత్రాలు విసర్జించడం.. వంటివి మహాపాపాలు. ప్రాణశక్తినిచ్చే నీరే మానవాళికి అమృతతుల్యం.


logo