బుధవారం 12 ఆగస్టు 2020
Devotional - Jul 24, 2020 , 00:06:33

గోదా ప్రబోధం అనుసరణీయం

గోదా ప్రబోధం అనుసరణీయం

కర్కటే పూర్వఫల్గున్యాం తులసీ కాననోద్భవామ్‌

పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీమ్‌

సౌరమానం ప్రకారం కర్కాటక మాసంలో పూర్వఫల్గునీ (పుబ్బ) నక్షత్రంలో తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూర్‌ పట్టణంలోని తులసీవనంలో తనకు లభించిన బిడ్డకు విష్ణుచిత్తులు ‘గోదా’ అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచారు. పూల తోటను పెంచుతూ, పూల దండలను ప్రతిరోజూ భగవంతునికి సమర్పిస్తూ భగవత్సేవలో జీవనయానాన్ని కొనసాగించే విష్ణుచిత్తులు రోజూ సాయంత్రం గోదాదేవికి ‘భాగవతం’లోని శ్రీకృష్ణ చరితాన్ని ప్రబోధిస్తుండగా, ఆమెలో వయసుతోపాటు శ్రీకృష్ణభక్తి కూడా దినదిన ప్రవర్ధమానమైంది.

‘రేపల్లెలో గోపికలు కాత్యాయనీ వ్రతాన్ని ఆచరించి శ్రీకృష్ణుని పొందారని’ తండ్రి ద్వారా గోదాదేవి తెలుసుకొంది. తనను ఒక గోపికగా, శ్రీవిల్లిపుత్తూరును రేపల్లెగా భావిస్తూ భక్తిభావం కల స్నేహితురాళ్లందరినీ ఒక్కచోటకు చేర్చింది. ‘మాసానాం మార్గశీర్షోస్మి’. ‘మాసాలలో నేను మార్గశీర్షాన్ని’ అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో అన్నాడు కనుక, మార్గశీర్ష (ధనుర్మాస) నెలలో ఆ వ్రతాన్ని ముప్ఫై రోజుల పాటు ఆచరించాలని ఆమె నిశ్చయించుకుంది. ఈ ధనుర్మాస వ్రతం ఒక ప్రాంతానికో, కాలానికో, వర్గానికో పరిమితం కాకుండా, స్త్రీ పురుష వయోభేదం లేకుండా అందరికీ శ్రేయస్కరం కావాలని కోరుకున్నది. వ్రతాచరణను ‘తిరుప్పావై’ పేర గ్రంథంగానూ సిద్ధపరిచింది. విష్ణుభక్తులు నిత్యారాధనలో, శ్రీ వ్రతాచరణలో, దైనందిన జీవితంలో ఎట్లా ప్రవర్తించాలో, ఏమేం చేయాలో, ఏవేవి చేయకూడదో అన్నిటినీ కూడా గోదాదేవి ఇందులో మనోజ్ఞంగా ప్రబోధించింది.

‘నోరారా భగవన్నామాన్ని పలుకుతూ, మనసారా పరమాత్మను ధ్యానిస్తూ, పరమ పవిత్రమైన భక్తిభావనతో సుగంధ భరితమైన పుష్పాలను శ్రీకృష్ణ పరమాత్మ పాదాల వద్ద సమర్పిస్తే.. మోక్షప్రాప్తికి అడ్డుగా నిలిచే పాపరాశి అంతా ‘అగ్నిలో పడిన దూదివలె భస్మమైపోతుంది’ అని ఆమె ఉపదేశించింది. రుచికరమైన పదార్థాన్ని అందరూ ఆస్వాదించినట్టుగానే, ఈ ‘ధనుర్మాస వ్రతాన్ని’ కూడా భక్తులంతా కలిసి ఆచరించాలని ఆచరణపూర్వకంగా నిరూపించింది. భగవంతునికి, భక్తులకు నడుమ ఉండే నవవిధ బంధుత్వం స్థిరమైందని, ఇది ఎప్పటికీ వదిలిపోయేది కాదని, అందుకే మనం ఏడేడు జన్మలకైనా, ఏనాటికైనా పరమాత్మతోనే దీర్ఘబంధుత్వాన్ని కలిగి ఉండాలని ఉద్బోధించింది. పరమాత్మకు అంతరంగదాసులమై, భక్తి ప్రపత్తులతో భగవత్సేవలో నిమగ్నమవ్వటమే లక్ష్యంగా జీవించాలని, చిన్న చిన్న కోరికలను కోరవద్దనీ ఆమె అందులో తెలిపింది.

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన పరమాత్మ భక్తసులభుడై రేపల్లెకు చేరి, 7 రోజుల పాటు చిటికెన వేలుపై గోవర్ధన పర్వతాన్ని ధరించాడు. గోవులను, గోపికలను, గోపకులను రక్షించి ఇంద్రుని గర్వం అణచి, గోవింద పట్టాభిషేకాన్ని పొందాడు. కనుక, గోవింద నామాన్ని పాడితే తాను సులభంగా అనుగ్రహిస్తాడనీ గోదాతల్లి హితవు పలికింది. గోదాదేవి శ్రీకృష్ణ పరమాత్మను తప్ప వేరొక మానవమాత్రుణ్ణి వివాహమాడననీ భీష్మించింది. భగవంతుని పొందాలనే తపనతో అనేక ప్రార్థనలు చేస్తూ, ఎన్నో సందేశాలను పంపుతూ 143 తమిళ పాటల (పాశురాలు)తో ‘నాచ్చియార్‌ తిరుమొంజి’ అనే గ్రంథాన్ని ఆమె రచించింది. చిట్టచివరకు శ్రీరంగనాథుని భర్తగా పొందింది.

ఆళ్వార్ల కోవకు చెందిన గోదాదేవి అలా భగవంతుని భార్యాగణంలో చేరి, భక్తులతో పూజలు అందుకుంటున్నది. ‘భూదేవి అంశతో జన్మించిన గోదాదేవికి సమానురాలైన వారు ఈ భూలోకంలోనే లేరని, ఆమె అవతరించిన రోజుకు సాటి రాగల మరొక రోజు కూడా లేదని’ వరవర మునులు అనే ఆచార్యులు ‘ఉపదేశ రత్నమాల’లో పేర్కొన్నారు. నేడు గోదా జయంతి (తిరు నక్షత్రం) సందర్భంగా లోకాన్ని ఉద్ధరించడానికై అవతరించిన గోదాదేవి ఉపదేశాలను, ఆమె ఆచరణను మనమంతా ఆదర్శంగా గ్రహిద్దాం. తద్వారా మన జీవితానికి సార్థకతను కలిగించుకొనే ప్రయత్నం చేద్దాం.

- సముద్రాల శఠగోపాలాచార్యులు

98483 73067


logo