బుధవారం 12 ఆగస్టు 2020
Devotional - Jul 22, 2020 , 23:21:04

అమ్మవారే అనంత చైతన్యం!

అమ్మవారే అనంత చైతన్యం!

విశాలా కల్యాణీ స్ఫుటరుచి రయోధ్యా కువలయైః

కృపాధారా ధారా కిమపి మధురా భోగవతికా

అవంతీ దృష్టిస్తే బహునగర విస్తార విజయా

ధ్రువం తత్తన్నామ వ్యవహరణ యోగ్యా విజయతే!

- ఆదిశంకరాచార్యులు (సౌందర్య లహరి)

అఖండమూ, శాశ్వతమూ, మంగళప్రదమూ, సౌందర్యవంతమూ అయిన అనంత చైతన్యాన్ని భక్తులు మూర్తితత్వంతో ఆరాధిస్తుంటే, జ్ఞానులు నిర్గుణ భావనతో ఉపాసిస్తారు. ఆ చైతన్యమే ‘శివ’. మంగళకరుడు శంకరుడైతే, ‘శివా’ శుభంకరి అమ్మవారు. అనంత చైతన్యాన్ని ఆకారంగా ఆరాధిస్తే అది విగ్రహారాధన. ఆకార రహితంగా కొలుస్తే అది నిర్గుణోపాసన. ఏ ఉపాసన అయినా అనంత చైతన్యంలో లయమయ్యేందుకు మార్గం చూపేదే. భక్తులు పాడుకొనేందుకు, జ్ఞానులు తరించేందుకు అనువైనరీతిలో కవితాత్మకంగా అమ్మ స్వరూప స్వభావాలను ఆదిశంకరులు అలా అభివర్ణించారు.

అనంత చైతన్యాన్ని శంకరులు అమ్మగానే ఎందుకు భావించారు? అమ్మ అనే భావనే అమృతమయ రసరమ్య ఆనందహేల. అదొక ప్రణవనాద ప్రతిధ్వనిత దివ్యభూమిక. అదొక మహస్సు, తేజస్సు. భవ్య శక్తి క్షేత్రమది. అమ్మ వాత్సల్యత అపురూపం. ప్రేమ, లాలిత్యం ఆమెలో అణువణువునా నిండి బిడ్డ మాటలను, చేష్టలను ఉత్సవంగా భావించి, ఆనందిస్తుంది. కాబట్టే, శంకరులు మాతృభావనతోనే అనంత చైతన్యాన్ని దర్శించారు. కనులను సాధారణంగా పద్మాలతో పోలుస్తారు. పద్మాలు వికసిస్తాయి, విస్తరిస్తాయి. విస్తరణలో సమగ్ర షోడశ కళలూ ప్రకటితమవుతాయి. బిందువు నుంచి అనంతం దాకా విస్తరించిన చైతన్య హరులే షోడశకళా భరితమైన అమ్మ కనుచూపులు. వాటిలో వెల్లివిరిసే కృపాకారుణ్యాది భావనలలోని వైభవాన్ని, వైవిధ్యాన్ని మనతో పంచుకుంటున్నారు శంకరులు.

ఆమె చూపులు విశాలమైనవి, అపరిమితమైనవి, కల్యాణ ప్రదమైనవి. అవి లోకానికి శ్రేయస్సు నిచ్చేవి, తేజోపూర్ణమైనవి. తమ ప్రకాశంతో లోకాలను ప్రకటించేసేవి. ధారగా ప్రవహిస్తున్న కృపాపూర్ణమైనవి. వాత్సల్య భరితమైనవి. మాటలలో తెలుపలేని మాధుర్యాన్ని కలిగి ఉన్నవి. అభ్యుదయ కారకమైనవి. భాషాభేదాలు, సరిహద్దులూ లేనివి. మానవ సమష్టి, సమగ్రతలకు అద్దం పట్టేవి. అలాంటి, అమ్మ సౌకుమార్య లావణ్య దృక్కులు తనను తరింపజేయాలని కోరుకున్నాడు ఆదిశంకరులు. పై శ్లోకంలో విశేషంగా ఎనిమిది నగరాల లక్షణాలు కనిపిస్తాయి. ‘విశాల’ నగరంగా విశాలత్వాన్ని, ‘కల్యాణి’ నగరంగా కల్యాణత్వాన్ని, ‘అయోధ్య’గా అసాధ్యతను, ‘ధారా‘ నగరంగా ధారాపాతమైన కృపను, ‘మధుర’గా భావనా మాధుర్యాన్ని, ‘భోగవతి’గా పరిపూర్ణత్వాన్ని, ‘అవంతి’గా రక్షణను, ‘విజయ’గా విజయాన్ని!

సాధకుడు సాధనలో దృష్టి ‘విశాలత్వా’న్ని సంతరింపజేసుకోవాలి. లోక ‘కల్యాణాన్నే’ ధ్యేయంగా పెట్టుకోవాలి. అవరోధాలు దరిచేరని ‘స్థిరత్వాన్ని’ (అయోధ్య) సంతరించుకోవాలి. చేసే ధ్యానం అఖండితమైన ‘ధార’గా సాగాలి. అనుభూతుల రూపంలో వచ్చే ‘మధుర’ భావనలను ఆత్మీయం చేసుకోవాలి. ఎదురయ్యే ప్రేయస్సును, శ్రేయస్సును ‘భోగాలు’గా స్వీకరించాలి. అమ్మే రక్షణ (అవంతి) అనే సమర్పణా భావనతో సాధన చేసే వారికి ఆధ్యాత్మిక ‘విజయం’ తథ్యమనే విశేష భావన ఇందులోనిది.

తల్లి తనను గుండెలకు హాయిగా హత్తుకోవాలని సాధకుడు కోరుకుంటాడు. అందుకోసం, నవ్వుతాడు. ఏడుస్తాడు. తల్లిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తాడు. ఇదే మాతృభావనలోని ఆంతర్యం. అదే బిడ్డ ధర్మం. తల్లికీ ఒక ధర్మం ఉంది. పసిపాపను లాలించాలి, పోషించాలి. తప్పు చేస్తే దండించాలి. అదే అనుగ్రహం. కంటికి దగ్గరగా, కాలికి దూరంగా కనిపించే లక్ష్యసాధనలో సాధకుడు అసంబద్ధమైన దారుల వెంట పయనించడం, ఇంద్రియ ప్రాబల్యంతో అపజయం పాలవడం సహజం. దీన్ని అధిగమించేందుకే సరైన మార్గదర్శనం చేసే ‘గురువు’ అవసరం. ఆ మార్గదర్శకత్వంలో ఏ పని చేసినా స్పృహతో, సమర్పణా భావనతో చేసినప్పుడు ఆధ్యాత్మిక పరిపక్వత సిద్ధిస్తుంది.

- పాలకుర్తి రామమూర్తి 94416 66943


logo