మంగళవారం 04 ఆగస్టు 2020
Devotional - Jul 21, 2020 , 22:58:15

దీపం భగవంతుని రూపం!

దీపం భగవంతుని రూపం!

దీపం జ్యోతిః పరబ్రహ్మా, దీపం జ్యోతి జనార్దనః

దీపేన హరతే పాపం, సంధ్యాదీప నమోస్తుతే॥

దీపాన్ని జ్యోతిగా, పరబ్రహ్మ స్వరూపంగా ఆరాధించడం మనకు అనూచానంగా వస్తున్న సంప్రదాయం. దీపజ్యోతిని పరంజ్యోతిగా, ఒక దివ్య జ్ఞానజ్యోతిగా సంభావించి ఆరాధిస్తాం. ఈ సదాచారం వెనుక ఆధ్యాత్మిక భావనేకాక లోకానికి అంతటికీ వెలుగును, చైతన్యాన్ని, విజ్ఞానాన్ని ప్రసాదించిన పరమాత్మపట్ల చూపించే కృతజ్ఞతా భావమూ ఇమిడి ఉంది. దీప ప్రజ్వలన సకల శుభాలకు హేతువు. దీపారాధన జ్ఞానానికి సంకేతం. అవిద్యను (అజ్ఞానాన్ని) పోగొట్టి విజ్ఞానం దిశగా నడిపించే గొప్ప వెలుగే జ్యోతి. తమసోమా జ్యోతిర్గమయ. మన సంప్రదాయంలో జన్మదిన వేడుకలలో దీపాన్ని వెలిగిస్తాం. కానీ, ఆర్పివేయం. పండుగలకు, అన్ని పూజలకు దీపాలను వెలిగిస్తాం. పెండ్లి పేరంటాలకు, ఉత్సవాలకు దీపావళులతో అలంకరించుకుంటాం. దీపం జ్యోతిరూపంగా మన జీవితాల్లో ఒక భాగం. జననం నుంచి మరణం దాకా దీపం లేని సందర్భమే ఉండదు. దీపం ఆరిందంటే అదొక అశుభ సూచన. ‘భగవంతుడు ఎక్కడున్నాడు? ఎలా ఉంటాడు? అతని తేజస్సు ఎలా ఉంటుంది?’ వంటి ప్రశ్నలకు తక్షణ సమాధానంగా ‘ఆదిత్య- చంద్రాగ్నుల’ను చూపించవచ్చు.

‘బృహదారణ్యకోపనిషత్తు’లో యాజ్ఞవల్క్యుడనే మహర్షితో జనక రాజర్షి ప్రశ్నోత్తరాలు ఆలోచనీయం. ‘ఆర్యా! లోకంలో గల గొప్ప జ్యోతి ఏది?’ అన్న జనకుని ప్రశ్నకు ‘ఆదిత్యుడే జ్యోతి’ అని సమాధాన మిచ్చాడు యాజ్ఞవల్క్యుడు. ‘మరి, సూర్యుడు అస్తమిస్తే?’ మళ్లీ ప్రశ్న. ‘చంద్రుడు జ్యోతి.’ ‘చంద్రుడు అస్తమిస్తే?’, ‘అగ్ని జ్యోతి’, ‘అగ్ని శాంతించినపుడు.. ఏది జ్యోతి?’ అంటే ‘వాక్కే జ్యోతి’ అని బదులిస్తాడు ముని. ‘వాక్కుకూడా మానేసినపుడు ఏది జ్యోతి?’ అని జనకుడు తిరిగి అడిగితే.. ‘అన్నీ ఆగిపోయినప్పటికీ ఆత్మయే జ్యోతిగా ఉంటుంది’ అంటాడు ముని. దీన్నిబట్టి సూర్యచంద్రులు, అగ్ని, వాక్కు కూడా లోకానికి వెలుగులు పంచుతాయని మనం అర్థం చేసుకోవాలి.

జ్యోతి స్వరూపంగా సూర్యచంద్రులు, అగ్ని వాక్కు బయట ప్రపంచానికి ప్రకాశాన్ని ఇస్తే, ఆత్మ శరీరంలోనే ఉండి వెలుగునిస్తుంది. ‘ఆత్మ ప్రకాశమే.. స్వయం ప్రకాశం’ అని మన ప్రాచీన మహర్షులు తేల్చి చెప్పారు. ఆదిత్యునికి మరో పేరు భానుడు. ‘భా’ అంటే ‘కాంతి’. ‘నుః’ అంటే ‘కాలం’. కాలాన్ని తేజోమయం చేసే సూర్యుడే దివాధిపతిగా ఉదయం నుంచి సాయంత్రం వరకు వెలుగులను, వేడిని పంచి లోకాన్ని రక్షిస్తుంటాడు. అందుకే, ఉభయ సంధ్యలలో అర్ఘ్యాలు, తర్పణాలు ఇస్తూ సూర్యుడిని మనమంతా ఆరాధిస్తుంటాం.

చంద్రుడు వెన్నెల వెలుగులను ఇచ్చి రాత్రి వేళల్లో విశ్రాంతి కలిగిస్తాడు. పగలంతా పనీ పాటలతో అలసిన జీవజాలానికి రాత్రి విశ్రాంతి కాలం కదా! అందుకే, ‘రాత్రి సైతం పరమాత్మ స్వరూపమే’ అంటున్నది వైదిక ధర్మం. ‘అహో రాత్రే పార్శ్వే నక్షత్రాణి రూపం’. పగలు, రాత్రికూడా పరమాత్మకు నక్షత్రాల రూపంలో ఇరువైపులా వెలుగొందుతుంటాయి. జ్యోతి స్వరూపంగా ప్రకాశించే అగ్ని త్రేతాగ్నులుగా మనకు వెలుగులను, శక్తిని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని పంచుతూ హవిస్సులతో దేవతలకు ఆహారాన్ని అందిస్తుంది. యాగాగ్నికి ప్రతీక దీపజ్యోతి. ఈ జ్యోతినే చిజ్జ్యోతి (చిత్‌-జ్ఞానం, జ్యోతి-ప్రకాశం)గా హృదయంలో నిలుపుకొన్నవాడే జ్ఞాని అవుతాడు. ప్రాణాగ్నిగా, జఠరాగ్నిగా మనలో ఉండేదికూడా పరమాత్మ రూపమే. ఒకవేళ వాక్కు (మాట) అనే జ్యోతి లేకుంటే ఈ లోకమే అంధకార బంధురమై పోయేదని అంటాడు దండి అనే మహాకవి. శబ్దం శక్తి అంత గొప్పది. సమస్త వాఙ్మయానికీ అదే మూలం కూడా. ఇలా దీపరూపంలోని భగవంతుడిని అంతటా దర్శిద్దాం. మన జీవితాల్ని సార్థకం చేసుకొందాం.

- మరుమాముల 

దత్తాత్రేయ శర్మ 944103914logo