బుధవారం 12 ఆగస్టు 2020
Devotional - Jul 20, 2020 , 23:59:04

మాతృదేవోభవ!

మాతృదేవోభవ!

కరుణామయుడైన భగవంతుడు తన ప్రేమను లోకంలో చాటడానికి అవతరించిన స్త్రీ మూర్తి అమ్మ. అమ్మ అన్నా, మాత అన్నా, అంబ, జనని, తాయి, తల్లి.. ఇలా ఏ రకంగా పిలిచినా మన కుటుంబ జీవనంలో తల్లి పాత్ర విశిష్టమైంది. అమ్మంటే అమృతం. ప్రేమకు మానవరూపం అమ్మ. సేవకు ప్రతిరూపం అమ్మ. ఆకలేస్తే అన్నపూర్ణ అమ్మ. బ్రతుకు బడిలో తొలి గురువు అమ్మ. అక్షరాలు దిద్దించే అపర సరస్వతి అమ్మ.

అడుగులు తడబడితే ఆసరాగా నిలిచేది అమ్మ. చీకట్లో బాసట అమ్మ. చినుకు పడితే గొడుగవుతుంది అమ్మ. తీవ్ర వేదనకు దివ్యౌషధం అమ్మ. కుటుంబ హారంలో కనిపించని దారం అమ్మ. జీవనవీణపై రాగాలు పలికించేది అమ్మ. ఏ ఇంటికైనా వైభవం అమ్మే! ఆమె లేని కుటుంబం ఆత్మ లేని శరీరం. అమ్మ అంటే పలికే దైవం. కని, పెంచే అమ్మ- కనిపించే అమ్మ- కనిపించే దైవం. తెలుగువారు తల్లి పేరును జోడించి చెప్పడం సంప్రదాయంగా భావించే వారనడానికి ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ ఒక ఉదాహరణ. ఆచార వ్యవహారాల్లో కూడా తల్లికే ప్రథమ స్థానం. గాంగేయుడు భీష్ముడు. గాధేయుడు విశ్వామిత్రుడు. రాధేయుడు కర్ణుడు. వైన తేయుడే గరుత్మంతుడు. తల్లి సంబంధ తద్ధిత రూపాలు ఇవి. 

‘తల్లి నగలు కూతురికే’ అన్నది సాంఘిక నియమం. సన్యసించిన వ్యక్తి అందరినీ ఆశీర్వదించవచ్చు. కానీ, తల్లికి తప్పక నమస్కరించాలి. విద్యాబుద్ధులు నేర్పే వేళ అమ్మ సరస్వతి. పోషణ బాధ్యత వహించడంలో అమ్మే మహాలక్ష్మి. శుభాలను వర్షించడంలో ఆమె పార్వతి. శ్రీమద్రామాయణంలో తల్లిదండ్రుల పట్ల భక్తి ప్రపత్తులను, సేవానురక్తిని, శ్రద్ధాసక్తులను ప్రకటించిన శ్రవణ కుమార వృత్తాంతం మనందరికీ తెలిసిందే. మహాభారతంలో భీష్ముడు తల్లి మాటకు కట్టుబడి అంపశయ్యపై వాలేదాకా కౌరవుల పక్షమే వున్నాడు. తల్లి మాటలు విన్న పాండవులు బాగుపడ్డారు. తల్లి మాటలు పెడ చెవిన పెట్టిన కౌరవులు నశించారు. తెనాలి రామకృష్ణ కవి రచించిన ‘పాండురంగ మహాత్మ్యం’లోని పుండరీకుని తల్లిదండ్రుల సేవకు ఇటుకమీద నిలబడిన పరమాత్ముడు పాండురంగడే పరమసాక్ష్యం. ఆ పాండురంగడి పవిత్ర ధామమే ఈనాటి పండరీపురం.

సనాతన ధర్మానికి ప్రతీకలుగా వున్న రామాయణ, మహాభారత కథలను వినిపించి, హైందవవీరుడిగా ప్రతీతి పొందిన వీర శివాజీలో భవానీ భక్తిని, ధార్మిక రక్తిని చిన్ననాటనే పెంచి, సద్యస్ఫూర్తిని నింపి, సదాశయాల రాశిగా శివాజీని రూపొందించిన వీరమాత జిజియా బాయి. భారతీయ సంప్రదాయంలో భూమాత, నదీమాత, గోమాత, భాషామాత- కూడ తల్లి లాంటి వారే. జన్మకు కారకులైన వారే తల్లులు కారు. రాజపత్ని, గురుపత్ని, వదిన, ధర్మపత్ని తల్లి అంటే అత్త- వీరందరూ తల్లి లాంటి వారే. కుటుంబం కోసం కొవ్వొత్తిలా కరిగిపోయే అమ్మ.. అగరుబత్తిలా వాసనలు గుప్పిస్తూ, తుదకు తనంత తానే మరుగైపోయే అమ్మ- ఏనాటికైనా ప్రత్యక్ష దైవమే!

డాక్టర్‌ కె.వి.రమణ

 98480 98990logo