బుధవారం 05 ఆగస్టు 2020
Devotional - Jul 19, 2020 , 23:46:19

కోర్కెల సాధనకు బ్రహ్మాస్త్ర విద్య

కోర్కెల సాధనకు బ్రహ్మాస్త్ర విద్య

బగలాముఖి.. నమోస్తుతే!

ఎవరైతే తదేక మనస్సుతో శ్రీ బగలాముఖి అమ్మవారిని అనుష్ఠిస్తారో వారికి సిద్ధించని కోరికలంటూ ఉండవు. ఆమె శత్రువులనూ మిత్రులుగా మారుస్తుంది. నిష్కాముకులై ఆరాధించిన వారికి పరమోత్కృష్టమైన మోక్షాన్నీ ప్రసాదిస్తుంది. అంతేకాదు, బగలాముఖి ఉపాసకులకు కష్టం కలిగించే సాహసం కూడా ఎవ్వరూ చేయజాలరని ఆధ్యాత్మిక వేత్తలు అంటారు.

మనిషి సహజంగానే తాను ఏదో సాధించాలని, అందరికన్నా తానే ఉన్నతంగా ఉండాలని, అందరిలో తన మాటే నెగ్గాలనీ, తాను కోరుకున్నదల్లా జరగాలని ఆశిస్తూ ఉంటాడు. అందుకోసం శక్తిమేరకు తనకు నచ్చిన పద్ధతిలో ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో అనేక (దైవిక) మార్గాలను అన్వేషిస్తుంటాడు. భారతీయుల పుణ్య విశేషంతో మన మహర్షులు అనేక విధాలైన అనుష్ఠానాలను ఉపదేశించారు. వాటిలో ఒకటే శ్రీ బగలాముఖి మహావిద్య! సంకల్పసిద్ధికి తిరుగులేని ఉపాసనగా ఆధ్యాత్మిక వేత్తలు దీనిని అభివర్ణిస్తున్నారు. ఈ అమ్మవారి విశేషాలే ఇక్కడ.

‘కాలీ తారా చ లోకేశీ కమలా భువనేశ్వరీ

చిన్నమస్తా షోడశీ చ సుందరీ బగలాముఖీ

ధూమావతీ చ మాతంగీ నామాన్యాసామిమానివై‘

శాక్త సంప్రదాయంలో దశ మహావిద్యల ప్రస్తావన ఉన్నది. ఇందులోనిదే శ్రీ బగలాముఖి మహావిద్య. ‘విద్యయా అమృత మశ్నుతే’. అన్ని విద్యలూ ఆత్మసాక్షాత్కార రూపమైన మోక్షకారకాలే అని ఆధ్యాత్మిక వేత్తలు అంటారు. ‘మహాభోగప్రదాత్రీచ మహామోక్ష ప్రదాయినీ’ అని మనిషికి అత్యంత ప్రీతిపాత్రాలైన అర్థకామాలకు (ధర్మ సమ్మతాలైతేనే) కూడా ఇది కారణమవడం మానవుని అదృష్టంగా చెప్పాలి.

‘బగలేతి మహామంత్రం సర్వేషాం సర్వకామదం’ అని ‘వహ్నిపురాణం’లో ఉన్నది. ఎవరైతే తదేక మనస్సుతో శ్రీ బగలాముఖి అనుష్టానం చేస్తారో వారికి సిద్ధించని కోరికలంటూ ఉండవు. అంతేకాదు, నిష్కాముకులై ఆరాధించినవారు ఆ అమ్మ అనుగ్రహంతో (అంతఃకరణ శుద్ధిద్వారా) పరమోత్కృష్టమైన మోక్షాన్ని కూడా పొందగలుగుతారు.

అథ వక్ష్యామి దేవేశి బగలోత్పత్తి కారణం

పురాకృతయుగే దేవి వాతక్షోభ ఉపస్థితే 

- సాంఖ్య తంత్రంలోని శ్లోకం. 

కృతయుగంలో ఒకసారి భయంకరమైన వాయు బీభత్సం ఏర్పడింది. అప్పుడు ముల్లోకాలూ అల్లకల్లోలాలై అతలా కుతలమైనాయి. ఈ జగద్వినాశనానికి స్థితికారకుడైన శ్రీ మహావిష్ణువు హృదయం ద్రవించింది. ‘ఈ ఉపద్రవం నుండి జగత్తును కాపాడే శక్తి ఆ పరాశక్తి మాత్రమే’ అని భావించాడు. సౌరాష్ట్రలోని ఒక హరిద్రాహ్రదం (పసుపు కొలను) సమీపంలో శ్రీ మహా త్రిపురసుందరీ దేవిని గురించి ఘోర తపస్సు చేశాడు. ఆ తల్లి శ్రీ మహావిష్ణువు తపస్సుకు మెచ్చి, సాక్షాత్కరించింది. తన దివ్య తేజస్సును ఆ కొలనులోకి ప్రసరింపజేసింది. 

సరిగ్గా అప్పుడే శ్రీ మహావిష్ణువు తేజస్సుతో సమ్మిళితమై, దివ్యతేజో రూపంగా, అక్కడ శ్రీ బగలాముఖి దేవత పసుపు వర్ణంలో అవతరించింది. బ్రహ్మాస్త్ర విద్యా సంజాతా త్రైలోక్యస్తంభినీ పరా. ఆమె బ్రహ్మాస్త్ర రూపిణి, త్రైలోక్య స్తంభన దేవత! ఆ మహోపద్రవాన్ని తక్షణమే స్తంభింపజేసింది. జగతును ప్రశాంత స్థితికి తెచ్చింది. కనుకే, శ్రీ బగలాముఖీ దేవత ‘స్తంభన శక్తి స్వరూపం’గా ప్రసిద్ధినొందింది. హరిద్రాహ్రదంలో ఆవిర్భవించినందువల్ల శ్రీ బగలాముఖి దేవతా స్వరూపమంతా ‘పీత (పసుపు) వర్ణమే’.

పీతాంబా పీతపుష్పాచ పీతవస్త్ర ప్రియా శుభా

పీతగంధ ప్రియరామా పీతరత్నార్చితా శివా

పసుపు పచ్చని పుష్పాలు, పసుపు పచ్చని వస్త్రం, పసుపు పచ్చని గంధం, పసుపు పచ్చని రత్నాలు బగలాముఖి దేవతకు అత్యంత ఇష్టమైనవి. అందుకే, ఆమెను ‘పీతాంబా’ అని కూడా పిలుస్తారు. ‘వలగాన్‌ హన్తీతి వలగహా’. శత్రువులు మనకు కష్టం కలిగించడానికి చేసే ప్రయత్నాలను తుత్తునియలు చేసే మహాశక్తిశాలిని ఆమె. ‘వలగహా’నే వర్ణ వ్యత్యాసం వల్ల ‘బగలా’గా రూపాంతరం చెందినట్లు ఆధ్యాత్మిక వేత్తలు చెప్తారు. ‘వలగాన్‌ ఖనతి విదారయతి ఇతి బగలాముఖీ’. శత్రువులు మన వినాశనం కోసం చేసే ప్రయత్నాలను తొలగించి, మనకు శ్రేయస్సును ప్రసాదిస్తుంది. కాబట్టే, ఆమెను ‘బగలాముఖి’ అని వ్యవహరిస్తున్నాం. ఈ రెండు శబ్దార్థాలలో ‘శత్రువులు చేసే దుష్ట ప్రయోగాలను నివారించి, శ్రేయస్సును ప్రసాదించేది’గా ఆమె వ్యక్తమవుతుంది.

‘బగలా ఉపాసకులను శత్రువులు ఏమీ చేయజాలరు. ఒకవేళ ఏమైనా చేయాలని అనుకుంటే వారు తమకుగా తాము వినాశనాన్ని కోరి తెచ్చుకున్నట్టే’ అని దేవీ ఉపాసకులు విశ్వసిస్తారు. అందుకే, న తస్య శత్రవః కోపి సఖాయః సర్వ ఏవ చ బలేనాకృష్య శత్రుం స్యాత్‌ సోపి మిత్రత్వమాప్నుయాత్‌ (దక్షిణామూర్తి సంహిత). ‘బగలా జాపినాం దృష్ట్వా సర్వే భీతిమవాప్నుయుః’ అన్నారు. బగలాంబ శత్రువులనుకూడా మిత్రులుగా మారుస్తుంది. అందుకే, బగలాముఖి ఉపాసకులకు కష్టం కలిగించే సాహసం కూడా ఎవ్వరూ చేయజాలరు.బగలా శబ్దానికి మరొక అర్థంగా ‘బగం వాచం లాతీతి బగలా’ను చెబుతున్నారు. వాచా అలతి భూషయతీతి అనే ఈ రెండు వ్యుత్పత్తులతో ఉపాసకులకు వాక్‌ ప్రదాయినియై, శత్రువులకు వాక్‌స్తంభనగా అమ్మవారు దర్శనమిస్తున్నది. దీని పరమార్థం ఇంతేకాదు, ‘బగలా ఉపాసకుల మాటలకు ఎదురు చెప్పే వారు ఎవరూ ఉండరని, ఒకవేళ ఎవరైనా దానికి ప్రయత్నించినా అది విఫలయత్నమే అవుతుందని’ శాస్త్రప్రమాణం ఉన్నది.

కవితాలహరీ తస్య భవేత్‌ గంగాప్రవాహవత్‌ 

గద్యపద్యమయీ వాణీ భవేత్‌ దేవీ ప్రసాదతః  

బగలా ఉపాసకులకు అమ్మ గంగా ప్రవాహం వంటి గద్య పద్యాత్మకమైన కవితాధారను ప్రసాదిస్తుంది. రామాయణ, మహాభారత కాలాల్లోకూడా ఎందరో రాజులు తదితరులు ఈ విద్యను ఉపాసించి బగలాముఖి అనుగ్రహాన్ని పొందినట్లు వేద విజ్ఞానులు చెబుతున్నారు. ముఖ్యంగా శ్రీకృష్ణ పరమాత్మ, సైంధవ సంహార సమయంలో స్తంభన దేవత అయిన బగలాముఖి అనుగ్రహంతోనే సూర్యుడిని స్తంభింపచేశాడు.

 శంకర భగవత్పాదుల వారు వారి గురువు  గోవింద భగవత్పాదుల వారి సమాధిని రేవానది ముంచేస్తుంటే త్రైలోక్య స్తంభన (బగలాముఖి) దేవతోపాసన, అనుగ్రహంతో దానిని స్తంభింపజేయడం చారిత్రక సత్యం. ఈ విధంగా ధార్మిక సంకల్పాలను శీఘ్రంగా సిద్ధింపజేస్తూ విశ్వకళ్యాణ దాయకమవుతున్నదీ బ్రహ్మాస్త్ర విద్య. 

సృష్టి క్రియతోనే మొదలు!

బగలాముఖి బ్రహ్మాస్త్ర విద్యను అనాదిగా ఎందరో దేవతలు, ఋషులు ఉపాసించినట్లు పలు ప్రామాణిక కథనాలు వున్నాయి. తత్ఫలితంగా వారు తమ కార్యకలాపాలను అద్భుతంగా నిర్వహించుకున్నట్లు పురాణేతిహాసాలు తెలియజేస్తున్నాయి. మొదట బ్రహ్మదేవుడు ఈ బ్రహ్మాస్త్ర విద్యను ఉపాసించి దిగ్విజయంగా సృష్టిక్రియను ఆరంభించాడు. ఆ తర్వాత దీనిని సనత్కుమారులకు ఉపదేశించాడు. వీరు నారదునికి, నారదుడు సాంఖ్యాయనునికి ఉపదేశించినట్లు తెలుస్తున్నది. వారు దానిని దర్శించి, ప్రపంచానికి ‘సాంఖ్యాయన తంత్రం’తోపాటు అందించారు. ఆ తర్వాత విష్ణువు, శివుడు ఈ బ్రహ్మాస్త్ర ఉపాసన చేసినట్టుగా పురాణేతిహాసాల ద్వారా తెలుస్తున్నది.logo