గురువారం 06 ఆగస్టు 2020
Devotional - Jul 19, 2020 , 23:46:18

ఆరాధ్య దైవం నాగన్న

ఆరాధ్య దైవం నాగన్న

నాగపంచమి లేదా నాగులచవితి పండుగ రోజు నాగుపాముల ఆరాధన ఎంతో విశిష్టమని హైందవ శాస్ర్తాలు చెబుతున్నాయి. శ్రావణ, భాద్రపద మాసాలు మంచి వర్షాకాలం. సర్పాలకు చల్లదనమన్నా ఎంతో ఇష్టం. ఇలాంటి శీతల సమయాల్లోనే అవి బయటకి వస్తాయి. అప్పుడే రైతులు పొలాలకు వెళుతుంటారు. కనుక, వారికి పాములు ఏ హానీ చేయకూడదని కోరుకొంటూ ఆడవాళ్లు వాటిని దేవతలుగా కొలుస్తారు. నాగపంచమికి ‘గరుడ పంచమి’ అనే పేరుకూడా ఉంది. 

మన దేవతలందరూ చాలావరకూ నాగులను ఆభరణాలుగా ధరించడం విశేషం. శివుని మెడలో హారంగా, వినాయకునికి వడ్డానంగా, యజ్ఞోపవీతంగా ధరిస్తాడు. శ్రీ మహావిష్ణువు ఆదిశేషువు శయ్యమీద నిద్రపోతుంటాడు. శ్రీవిల్లిపుత్తూరులో శ్రీమన్నారాయణుడు, శ్రీ కృష్ణుని పక్కన శేషుడు ఉంటాడు. మిగిలిన పూజలకు దీనికి ఉన్న భేదం ఏమిటంటే, ఏ దేవదేవతలనైనా చిత్రరూపాలలో పూజిస్తాం. కానీ, ఇక్కడ సాక్షాత్తు పాములనే పూజిస్తాం. వాటికి నివేదించేవన్నీ కడుపు చలువవే. వండిన పదార్థాలు కాకుండా చలిమిడి, చిమ్మిడి, వడపప్పు, అరటిపళ్ళు, సీతాఫలాలు, కొబ్బరికాయలు ఈ నివేదనలన్నీ వేడి చేయనివే. మహిళలు ఆ రోజంతా ఉపవాసం వుండటమేగాక, వండిన పదార్థాలు తినరు. కత్తితో కూరగాయలు వంటివేవీ కోయరు.

చలిమిడివల్ల ఆడపిల్లలకు గైనిక్‌ సిస్టమ్‌ బాగుపడుతుందని ఆయుర్వేదశాస్త్రం చెప్తున్నది. సంతానం గలవారికి నాగసేవవల్ల పిల్లల రక్షణ, సంతానం లేనివారికి ఆ భాగ్యం కలుగుతుందని ప్రజల ప్రగాఢ విశ్వాసం. అర్జునుడు నాగజాతి కన్య ఉలూచిని వివాహమాడిన తర్వాత ఒక కుమారుడు కూడా కలిగినట్టు మహాభారతం చెబుతున్నది. తెలుగువారి చరిత్రలో మొదటివాడైన శాతవాహనుడు నాగ కుమారుడే. ఆంధ్రులు నాగజాతికి చెందిన వాళ్లని కూడా పురాణాలు చెబుతున్నాయి. ఈ విధంగా ప్రాచీనకాలం నుండి తెలుగుజాతికి- నాగజాతికి అవినాభావ సంబంధం వున్నట్టు తెలుస్తున్నది. చాలామంది తెలుగువారి వ్యావహారిక నామాల్లో నాగశబ్దం ఉంటుంది.

భారతీయ మహర్షులు అందించిన సర్పశాస్త్రం ప్రకారం పాములకు సొంత ఆలోచన ఉండదు. ఎదుటివారి ఆలోచనలు దాని మనసులో అద్దం లాగ ప్రతిబింబిస్తాయంటారు. ‘ఈ పాము నన్ను చంపుతుందేమో’ అన్న ఆలోచన మనకు కలిగితే, దాని మనసులో ‘వీడు నన్ను చంపుతాడేమోనన్న’ భావన వస్తుందట. మన అరచేయిని పైకెత్తితే పాము పడగలాగా ఉంటుంది. అలా కాక, రెండు చేతులెత్తి నమస్కారం పెడితే దానికి అది జంట పాముల్లాగా కనపడతాయి. దాంతో అది మనసులో మనకూ నమస్కారం చేసుకుంటూ పక్కకి తొలగిపోతుంది. అందుకే, మనం పాములని చంపే ఆలోచన మానుకొని, బదులుగా వాటిని ఆరాధించాలని భారతీయ ఋషులు ప్రబోధించారు. ప్రకృతిలోని ప్రతి జంతువును, వస్తువును గౌరవంగా, ఆరాధనాభావంతో చూడాలని మన ధర్మశాస్త్రం బోధించింది. అందుకే, కాటు వేసి ప్రాణాలు తీసే పామునూ ‘అమోఘ ప్రాణి’గా ఆరాధిస్తున్నాం.

పుట్టలో పాలు ఎందుకు పోయాలి?

నిజానికి మనం పుట్టలో పాలు పోసినా, నివేదనలు అర్పించిన అవేవీ పాములు తాగవు, తినవు. పుట్ట మట్టిలో సర్పం శరీరం నుండి వెలువడే చెమట, వీర్యం ఓజస్సుగా ఉంటుంది. ఆ శక్తి పనితనం అద్భుతం. అలాంటి మట్టిలో మనం ఆవుపాలు కలపడం వల్ల వచ్చే ‘ఎమాల్గమ్‌'తో రసాయనిక చర్య జరిగాక, ఆ పదార్థానికి సంతానాన్ని కలిగించే శక్తి ఉంటుందని మన ప్రాచీనులు గుర్తించారు. అందుకే, పుట్టలో పాలు పోయాలన్నారు. మానవ శరీరంలో ప్రత్యుత్పత్తి కారకాలైన శుక్రధాతువులు కదులుతూ పాముల కదలికను పోలి ఉంటాయి. వాటిని ఎలాగూ మనం పూజించటం కుదరదు కనుక, సత్సంతానం కలగాలని వాటికి ప్రతీకలుగా పాములను ఆరాధిస్తాం. 


logo