మంగళవారం 04 ఆగస్టు 2020
Devotional - Jul 19, 2020 , 23:46:09

మంత్రోపాసన

మంత్రోపాసన

గృహప్రాప్తికి, గృహలోప నివారణలకు.. 

చింతామణి గృహాంతస్థా శ్రీమన్నగర నాయికా!

వాతావరణ ఇబ్బందుల (చలి, ఎండ, గాలి, వాన మొదలైనవి) నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి ఒక ఇల్లు అవసరం. అదీ స్వంత ఇల్లు అయితే ఎంతో మంచిది. మరొకరి అధీనంలో లేకుండా, సంతృప్తితో బతికే అవకాశం ఉంటుంది. తద్వారా సంతానం బాగా వృద్ధిలోకి వస్తుంది. సర్వసంపదలూ విస్తరించే ఆలోచనలు వస్తుంటాయి. 

ప్రస్తుత కాలంలో అవకాశం ఉండి నూతన గృహం కట్టుకోవాలన్నా, మంచి అద్దె ఇల్లు లభించాలన్నా, ఇంట్లో వాస్తు దోషాదులు నివారణ కావాలన్నా, ఇంట్లో ప్రశాంతత, ఇంట్లోవారి మధ్య అన్యోన్యత పెరగాలన్నా, ఆరోగ్యాది సంపదలు వృద్ధి చెందాలన్నా, ఇంట్లోని ప్రతివారూ నిత్యమూ జపించాల్సిన మంత్రరాజం ‘చింతామణి గృహాంతస్థా శ్రీమన్నగర నాయికా’. ఈ జపం వల్ల గృహ నిర్మాణ సంకల్పం నెరవేరుతుంది. మధ్యలో ఆగిన నిర్మాణాలు వెంటనే కొనసాగుతాయి. కొనుక్కోవడానికి మంచి గృహాలు లభిస్తాయి. అద్దెకు కావాలనుకున్న వారికికూడా మంచి ఇండ్లు దొరికే అవకాశం ఉంటుంది. ఉన్న ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది. దోష నివారణలు జరుగుతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా జ్ఞానం, శక్తి సమకూరుతాయి. 

మన శరీరమూ ఆత్మకు నివాసమైన ‘గృహమే’. శరీరం కదలడానికి మూలశక్తి దేహంలో ఉంటుంది. ఆ చైతన్యాన్ని ఆరాధిస్తే ఈ శరీరమనే గృహంలో సర్వసంపదలూ పెరుగుతాయి. శరీరాంతర్గతమైన శక్తి శరీరానికి దూరమైతే శరీరం శక్తి హీనమవుతుంది. ఇంట్లోని శక్తిని జపం ద్వారా పెంచుకుంటే ఇల్లు ఆనందాన్నిస్తుంది. అందుకే శరీరమనే గృహం, ఈ శరీరం ఉండే గృహం రెండూ నిరంతరం ఆరోగ్యంగా ఉండాలి. అలా ఈ లోకంలో తమకు ఉద్దేశించిన కర్మలను పూర్తి చేసుకోవాలంటే అందరూ తప్పనిసరిగా ‘చింతామణి గృహాంతస్థా శ్రీమన్నగర నాయికా’ అనే జపోపాసన చేస్తుండాల్సిందే. 


logo