మంగళవారం 04 ఆగస్టు 2020
Devotional - Jul 19, 2020 , 23:46:00

సామాజిక ధర్మమే మిన్న

సామాజిక ధర్మమే మిన్న

ధర్మేచ అర్థేచ.. ఈ విధంగా ‘ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటా’ అని అగ్నిసాక్షిగా ప్రమాణం చేసిన శ్రీరాముడు, సీతమ్మను అడవిలో విడిచి పెట్టడం ధర్మమేనా? ఒక్కడే ధర్మాన్ని, అర్థాన్ని అనుభవించాడు కదా?

- శ్రీలత.బీ. కొండాపూర్‌, హైదరాబాద్‌

రాముడు తన పాలనపట్ల ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునే క్రమంలో, భద్రుడనే గూఢచారి, “రావణుడి ఆధీనంలో ఉండిన సీతను తిరిగి ఏలుతున్న సీతా వ్యామోహి మనకెలా ఆదర్శప్రాయుడవుతాడు?” అని ప్రజలు అనుకుంటున్నారని చెప్తాడు. రాముడు ఈ విషయాన్ని తమ్ములతో చర్చిస్తూ, ‘సీతా పరిత్యాగానికి నిర్ణయించుకున్నట్లు’గా చెప్తాడు. “నిరాధార ఆరోపణ కోసం ధర్మపత్నిని విడువడం సమంజసం కాదన్న” సోదరులతో “అంతరాత్మాచమేవేత్తి సీతాం శుద్ధాం యశస్వినీం’. సీత శుద్ధురాలని నా అంతరాత్మకు తెలుసు. సీత నా ప్రాణం కంటే ఎక్కువ. అయినా, ప్రజలు వేసిన అపనిందను తొలగించుకోవడం కోసం సోదరులను, భార్యను చివరకు నన్ను నేనైనా త్యాగం చేసుకుంటా” అని అంటాడు. ‘దీపో నేత్రా తురస్యేవ ప్రతికూలా సి మే ధృడమ్‌'. 

కంటిరోగికి దీపం ఎలాగైతే ప్రతికూలంగా కనిపిస్తుందో, అలాగే అపవాదువల్ల సీత నాకలాగే కనిపిస్తున్నదనీ అంటాడు. ఋష్యాశ్రమాన్ని దర్శించాలన్న సీత కోరికను అడ్డం పెట్టుకొని ‘ఆమెను అడవిలో వదలి రమ్మని’ లక్ష్మణుడిని పంపిస్తాడు. 

సామాజిక స్థాయిలో ఏకత్వాన్ని, స్థిరత్వాన్ని ప్రసాదించే ధర్మం ప్రాతిపదికగా అర్థకామాలను సాధించాలి. ధర్మానికి విఘాతం కలిగితే వాటిని విడిచివేయాలి. సాధారణమైంది కుటుంబ ధర్మం. విశేషమైంది సామాజిక ధర్మం. కుటుంబ ధర్మం సామాజిక ధర్మానికి అవరోధం కాకూడదు. దేనికోసం దేనిని విడవాలో తెలుసుకోవడమే విజ్ఞత. ధర్మానుసరణలో నాయకులకు, వారి కుటుంబసభ్యులకూ వ్యక్తిగత జీవితాలకన్నా సామాజిక నియమాలే అనుసరణీయాలు. సీత లక్ష్మణుడితో తన మాటలుగా రామునితో చెప్పమంటూ, “ధర్మదృష్టిని తొలగించుకోవద్దని, నిందవేసిన ప్రజలను క్షమించమని, లోకాపవాదుకై తనను విడువడం సమంజసమేనని’ చెబుతుంది. ఈ రకంగాశ్రీరాముడు చేసింది ధర్మమే.

రామాయణంలో దుర్వాసుడు, దశరథునికి చెప్పినట్లుగా చిన్నకథ ఉంది. దేవదానవుల యుద్ధంలో ఓడి, శరణు కోరిన రాక్షసులకు భృగువు భార్య అభయమివ్వగా విష్ణువు ఆమెను సంహరిస్తాడు. దానికి కోపించిన భృగువు, ‘మానవుడివై పత్నీ వియోగంతో కుమిలి పొమ్మని’ విష్ణువును శపిస్తాడు. విష్ణువు ఋషివాక్కును ఆదరించి రామావతారంలో ఆ శాపాన్ని స్వీకరిస్తాడు. అలాగే, ‘పద్మపురాణం’లో, పక్షుల జంటనుండి గర్భిణి అయిన పక్షిని చిన్నతనంలో సీత విడదీసినట్లు, దాంతో ఆ ఆడపక్షి ఆమెకు ‘పతీ వియోగంతో బాధ పడుమని’ శపించింది. పై ప్రశ్నకు ఇదీ అసలు మూలం.logo