మంగళవారం 04 ఆగస్టు 2020
Devotional - Jul 19, 2020 , 23:20:44

ఆత్మజ్ఞానమే అసలైన విజ్ఞానం!

ఆత్మజ్ఞానమే అసలైన విజ్ఞానం!

‘నేనెవరు?’ అన్న ప్రశ్నతో విచారణ ప్రారంభిస్తే ముక్తిమార్గ ప్రయాణం మొదలైనట్టే. దీనిని మనోహరంగా వివరిస్తూ ‘ఆత్మే సాధకుని మనసును విచారణ వైపు మరలిస్తుందని’ తెలిపే కథనం ఒకటి ‘బృహదారణ్యక’ ఉపనిషత్తులో ఉన్నది. యాజ్ఞవల్క్యుడు గొప్ప తత్తవేత్త. తన విద్యా నైపుణ్యంతో చాలా ధనం సంపాదించాడు. ఆ మహర్షికి ఇద్దరు భార్యలు. కాత్యాయని, మైత్రేయి. గృహస్థాశ్రమ నిర్వహణపట్ల విరక్తుడై సన్యాసాశ్రమం స్వీకరించాలని నిశ్చయించుకొన్నాడు. అందుకు ఆయనకు భార్యల అనుమతి అవసరమైంది.

అప్పుడు తాను సంపాదించిన సంపదను ఇద్దరు భార్యలకు సమంగా పంచాడు. తర్వాత వారి అనుమతిని కోరాడు. కాత్యాయని సామాన్య గృహిణి కనుక, ఆమె భర్త ఆజ్ఞను అంగీకరించింది. మైత్రేయి ఆధ్యాత్మిక దృష్టిగల స్త్రీ. కనుక, భర్తతో ‘స్వామీ! మీరు ఇచ్చిన ఈ ధనంతో నాకు అమృతత్తం లభిస్తుందా?’ అనడిగింది. దానికి యాజ్ఞవల్క్యుడు, ‘సంపదతో ఐహిక సుఖాలు పొందవచ్చు. కానీ, అమృతత్తం దొరుకదు’ అన్నాడు. ‘ఐతే, నాకా ధనంతో పని లేదు. అమృతత్త సిద్ధిని పొందే విద్యను ఉపదేశించండి’ అన్నది. అందుకాయన ప్రసన్నుడై, ఆమెకు తత్తోపదేశం చేసిన విధం చాలా రమణీయం. ‘మైత్రేయీ! లోకంలో భార్య భర్తనెందుకు ప్రేమిస్తుంది? తన ప్రయోజనాలు నెరవేర్చుకోవడం కోసమేనా? ఆలోచించు’ అన్నాడు.

మైత్రేయి యాజ్ఞవల్క్యుడిని భర్తగా కోరి, వరించింది. ఎందుకు? ఆయనకు అంతకుముందు భార్య (కాత్యాయని) ఉన్నది. యాజ్ఞవల్క్యుడు భర్త అయితే ఆయనతో ఆధ్యాత్మిక విద్యను పొందవచ్చుననే స్వార్థంతోనే ఆమె అతణ్ణి ఆశ్రయించి భార్య అయ్యింది. కనుక, మైత్రేయి ‘పతి ప్రేమ’ స్వార్థం కోసమే కదా. మైత్రేయి దీన్ని బాగా అర్థం చేసుకొంది. ‘నవా అరే జాయాయై కామాయ జాయా ప్రియా భవతి. ఆత్మవస్తు కామాయ జాయా ప్రయాభవతి’. ‘భార్య ప్రయోజనం కోసం భర్తకు ఆమె ప్రియురాలు కాదు. తన ప్రయోజనం కోసమే భర్తకు భార్య ప్రియురాలు అవుతుంది’ అని భార్య-భర్తృ సంబంధాన్ని ఉన్నదున్నట్లుగా కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పాడు యాజ్ఞవల్క్యుడు.

‘అన్ని సంబంధాల్లో ‘ఆత్మనః కామాయ’ అనే వ్యవహారమే నడుస్తున్నది. మరిప్పుడు, ఈ విధంగా వ్యవహరించే ఈ ఆత్మ అంటే ‘తాను ఎవరు?’ అనే విషయాన్ని తెలుసుకోవడమే అమృతత్తాన్ని ప్రసాదించే సాధనం’ అన్నాడు. ‘మైత్రేయీ! చూడదగింది, వినదగింది, మనకు యోగ్యమైందీ ఆత్మయే. కనుక, దాన్ని గురించి నిరంతర ధ్యానం సాగాలె. ఈ ఆత్మజ్ఞానమే అసలైన విజ్ఞానం. దానితో సర్వమూ జ్ఞాతమవుతుంది’. యాజ్ఞవల్క్యుడు ఇంకా ఇలా అన్నాడు- ‘ఆత్మ దర్శనం చక్షురింద్రియాలకు సాధ్యం కాదు. అది బుద్ధి గమ్యం, అతీంద్రియ జ్ఞానం. మనసును వెలుపలి విషయాల నుండి విముక్తం చేసి అంతర్‌ దృష్టిని (బుద్ధిని) ఆత్మ మీద నిబద్ధం చేయడంతోనే ఆత్మ దర్శనం అవుతుంది. దీనికి నిరంతర సాధనం అవసరం’.

రమణ మహర్షి ఉపదేశం ఇక్కడ గమనార్హం. ‘ఆత్మజ్ఞానమే బ్రహ్మజ్ఞానం. తానెవరో తెలుసుకోవడం ముఖ్యం. తాను ఆ ఆత్మయే కాని, తద్భిన్నం కాదనే జ్ఞానంతో ఆత్మనిష్ఠతో అపారమైన ఆనందాన్ని అనుభవించాలి. అదే అసలైన మోక్షం (ముక్తి)’. ఇది అన్ని మార్గాల కంటే సులభమనీ రమణులన్నారు. ‘ఆ సాధనే నిధి ధ్యాస’ అన్నది ఉపనిషద్వాక్యం. సామాన్యులు శరీరమే ‘నేను’ అనుకొంటారు. ఇది అజ్ఞానం. శరీరం పాంచభౌతికం, జడం. ‘నేనంటే శరీరం, ఇంద్రియాలు కావని, వాటికి అతీతమైన అంతశ్చేతనే తానని’ గుర్తించాలి. ఆ తరువాత నిరంతర సాధనతో ఆత్మదర్శన సాధనకు పూనుకోవాలి.

ప్రాచార్య అమరేశం రాజేశ్వరశర్మ

94407 84614


logo