బుధవారం 12 ఆగస్టు 2020
Devotional - Jul 18, 2020 , 00:46:00

రాజ కొలువులో సేవా ధర్మం!

రాజ కొలువులో సేవా ధర్మం!

రాజ కొలువులో సేవా ధర్మం!

ధర్మేచ అర్థేచ కామేచ 

మోక్షేచ భరతర్షభ

యది హాస్తి తదన్యత్ర 

యన్నేహాస్తి నతత్‌ క్వచిత్‌

- ఆదిపర్వం (అధ్యా॥ 62)

మహాభారతం ఎప్పుడో, ఎక్కడో జరిగిన కథ కాదు. ఇప్పటికీ మన కండ్లెదుట జరుగుతున్నదే. ఇది మన వారి కథ, మన ఊరి కథ, మన నట్టింటి కథ. అందులో కనిపించే పేర్లూ, సన్నివేశాలు ఈనాడు కనిపించకున్నా వ్యక్తిత్వాలూ, సంఘటనలు మాత్రం సర్వత్రా వ్యక్తమవుతూనే ఉంటాయి. ధర్మ, అర్థ, కామ, మోక్షాలనే చతుర్విధ పురుషార్థాలలో ఏవైనా సరే, మహాభారతంలో ఉన్నవే లోకంలో ఉంటాయి. దానిలో లేనివి మరెక్కడా ఉండవు. ఇది అతిశయం కాదు, వాస్తవం. 

పన్నెండేండ్ల అరణ్యవాసాన్ని ముగించుకొని, అజ్ఞాతవాసం కోసం విరాట నగరానికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు పాండవులు. పౌరోహితుడైన ధౌమ్యుని దగ్గరికి ఆశీస్సులకోసం వారు వెళ్ళారు. ధౌమ్యునికి పాండవుల పరిస్థితి తెలుసు. వారు రాజులుగా ఉన్నవారేగానీ సేవకులుగా ఎప్పుడూ లేరు. ఇప్పుడు విరాటుని కొలువులోకి సేవకులుగా వెళుతున్నారు. అది అంత సులువు కాదు. వారి వేషభాషలతో పాటుగా ప్రవర్తనను కూడా సేవా ధర్మానికి అనుగుణంగా మార్చుకోకుంటే మొదటికే మోసం వస్తుంది. అప్పుడు సేవావృత్తిలో పాటించాల్సిన జాగ్రత్తలను ధౌమ్యుడు వారికి సున్నితంగా బోధించాడు. పాండవులు వాటిని పాటించి గట్టెక్కారు. వాటిలో కొన్ని ఈనాటికీ శిరోధార్యాలే.

వేఱొక తెఱగున నొరులకు

మాటాడక యునికి లెస్స మనుజేంద్రు కడం

దీఱమి గల చోటుల దా

మీఱి కడగి వచ్చి పంపు మెయి కొన వలయున్‌ 

- విరాటపర్వం (1.28).

రాజుకు విరుద్ధంగా మాట్లాడటం ఎవరికీ తగదు. ఆయనకు అభిముఖంగా కానీ, వీపును చూపిస్తూ కానీ కూర్చోవడం సేవకులకు తగదు. భక్తిభావంతో, జంకుతో మాత్రమే వారి సన్నిధిలో మెలగాలి. ఏ పౌరుడు కూడా ఆయనకు సంబంధించిన రహస్యాలను బహిర్గతం చేయకూడదు. తనకు అనుకూలంగా ఉండే బయటి విషయాలను తన మనసుకు నచ్చినప్పుడు మాత్రమే విన్నవిస్తుండాలి. ప్రభువువద్ద సన్నిహితంగా మెలిగే పెద్దవాళ్ళతోనేకాదు, చిన్నవాళ్లతో కూడా ఎలాంటి పరిస్థితులలోనూ తగవులు పెట్టుకోవద్దు. తమకు మేలు జరగాలని కోరుకునేవారు మంత్రాంగంలోని ముఖ్యులతో ఏ మాత్రం విభేదాలకు తావివ్వకూడదు. వారితో సఖ్యతకోసం ప్రయత్నిస్తూ జాగ్రత్తగా మెలగాలి. రాజు సన్నిధిలో ఆయనకు అసౌకర్యం కలిగిస్తూ అటూ ఇటూ తిరగకూడదు. ఎదురు మాట్లాడవద్దు. వారి ఆదేశాలను మాత్రం తప్పక పాటిస్తుండాలి.

‘రాజ భవనాన్ని పోలిన గృహాన్ని కట్టుకోవడం, తనను అనుకరించే వేషాన్ని ధరించడం, వారిని అనుకరిస్తూ మాట్లాడటం, నడవడం మొదలైనవన్నీ ప్రమాదాలను తెచ్చి పెడుతాయని ధౌమ్యుడు పాండవులను హెచ్చరించాడు. తన ఆగ్రహానుగ్రహాలను రాజు  ఎవరిపైన చూపిస్తాడో ముందుగా తనకు తెలిసినా పొరపాటున కూడా ఆ విషయాన్ని బయటకు పొక్కనీయవద్దు. రాజ సంపదలను ‘పాము, ఎముకల’ను చూసినట్టుగా చూడాలి. వాటిని అస్సలు తాకకుండా జాగ్రత్త పడాలి. రాజ సన్నిధిలో ఉన్నపుడు శారీరక సహజ ధర్మాలైనప్పటికీ ‘ఆవులించడం, తుమ్మడం’ వంటి పనులుసైతం చేయవద్దు. పరిసరాలలో ఉన్నవాళ్ళకు కూడా అవి తెలియనీయవద్దు..’ ఇవన్నీ ధౌమ్యుడు, పాండవులకు బోధించిన జాగ్రత్తలు. ఐతే, రాచరికం పోయిన ప్రస్తుత ప్రజాస్వామ్య వ్యవస్థలోనూ ప్రభువుల కొలువుల్లో పదవులు నిర్వహించే వారికి ఇలాంటివి మార్గదర్శకంగా నిలుస్తాయనడంలో సందేహం లేదు.


logo