మంగళవారం 11 ఆగస్టు 2020
Devotional - Jul 16, 2020 , 23:47:34

శివుని సిగలో చందమామ!

శివుని సిగలో చందమామ!

చంద్రునికి ‘సోముడు’ అని, ‘గ్లౌ’ అని పేర్లున్నాయి. ‘సూయత ఇతి వా సోమః’. ‘ప్రతి పక్షంలోనూ పుట్టేవాడు’ అని అర్థం. ప్రతి మాసం ‘గ్లాయతి క్షమ తీతిగ్లౌ’. ప్రతి మాసమూ క్షయించేవాడు, కనుక అతడు ‘గ్లౌ’. అమావాస్య రాత్రి చంద్రుడు మనకు కనిపించడు. శుద్ధ ప్రతిపద నాడు నెలవంకగా ఉదయిస్తాడు. దీన్ని ‘మరణించి మళ్లీ పుట్టడం’గా పేర్కొన్నారు మహర్షులు. ఇందుకు సంబంధించిన కథ ఒకటి ఉంది. దక్ష ప్రజాపతికి అసిక్ని ద్వారా 60 మంది కుమార్తెలు కలిగారు. వారిలో అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి ఇత్యాది పేర్లు గల ఇరవైయ్యేడుగురు ‘మేము చంద్రుడిని తప్ప వేరొకరిని పెండ్లాడం’ అని భీష్మించారు. వీరిని ‘తారకలనీ’ అంటారు.

దక్షుడు తప్పనిసరై వారిని చంద్రునికిచ్చి పెండ్లి చేశాడు. వారిలో రోహిణి సౌందర్యం చంద్రుడిని ఆకట్టుకుంది. ఆమె మొగుణ్ణి కొంగున ముడి వేసుకొంది. మిగిలిన ఇరవైయ్యారుగురు, ‘భర్త తమను పట్టించుకోవడం లేదని’ తండ్రికి మొరపెట్టుకున్నారు. దక్షుడు అల్లుడికి సర్ది చెప్పాడు. ‘ఇరవయ్యేడుగురు నీ భార్యలైనప్పుడు నువు సమధర్మాన్ని పాటించాలి కదా’ అని బుద్ధి చెప్పాడు. కొంతకాలం బాగానే వుండింది. తర్వాత కథ మళ్లీ మొదటికొచ్చింది. కుమార్తెలు న్యాయం కోసం తండ్రి వద్దకు వచ్చారు. ఈసారి దక్షుడికి కోపం వచ్చింది. ‘నువు క్షయించి పోదువు గాక’ అని చంద్రుడిని శపించాడు.

చంద్రుడు రోజురోజుకీ క్షీణించిపోతున్నాడు. ప్రాణభయంతో చంద్రుడు బ్రహ్మదేవుని సలహా మేరకు సరస్వతి నది, సింధు (అరేబియా సముద్రం) సంగమస్థానమైన ప్రభాసతీర్థంలో శివుని గురించి ఘోర తపస్సు చేశాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమై చంద్రుని పట్ల కలిగిన దయ కారణంగా అతడిని తన నుదుటను ధరించాడు. చంద్రపత్నుల పని పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్టయ్యింది. ఇదివరలో కాపురం చేయకపోయినా కంటికి కనపడేవాడు. ఇప్పుడు దర్శన భాగ్యం కూడా లేకుండాపోయింది. ఈసారి ఇరవైయ్యేడు మందీ కలిసి తండ్రితో మొరపెట్టుకొన్నారు.

దక్షుడు పరమశివుని కలిసి చంద్రుడిని వదిలిపెట్టమన్నాడు. ‘ఆశ్రయమిచ్చిన వారిని వదిలే ప్రసక్తే లేద’న్నాడు శివుడు. దక్షుడు శివుడిని సైతం శపించబోయాడు. ఈ ఉపద్రవాన్ని నివారించడానికి విష్ణుమూర్తి తక్షణమే అక్కడకు చేరుకొన్నాడు. ఇరువురికీ సంధి చేసి చంద్రుడిని రెండు భాగాలుగా విభజించేందుకు అంగీకరింపజేశాడు. బ్రహ్మ చంద్రబింబాన్ని రెండు ముక్కలు చేసి, ఒక భాగాన్ని శివునికిచ్చాడు. దానిని తలపైన అలంకారంగా ధరించిన శివుడు ‘చంద్రమౌళి’ అయ్యాడు. బ్రహ్మదేవుడు తారలకిచ్చిన రెండవభాగం దక్షుని శాపాన్ని అనుసరించి క్షీణించిపోసాగింది. తారలు బెంబేలెత్తిపోయారు. బ్రహ్మ వారిని సంతోషపెట్టే నిమిత్తం దక్షుని శాపంలో చిన్న మార్పు చేశాడు. ‘చంద్రుడు ఇక నుంచి రోజుకింత చొప్పున 15 రోజుల పాటు క్షీణిస్తూ అమావాస్య నాడు అంతర్ధానమవుతాడు. ఆ తెల్లవారి పునర్జన్మతో 15 రోజులపాటు వృద్ధిని పొందుతూ పౌర్ణమినాడు పూర్ణచంద్రుడౌతాడు’.

సూర్యకాంతిలో కనపడని నక్షత్రాలు చంద్రకాంతిలో కనపడుతాయి. భర్త సమక్షంలో భార్య అందం ఇనుమడిస్తుంది కదా. ఏడాదిలో ఆర్నెల్లకు పైబడి చంద్రుడు వృషభరాశిలోని రోహిణి నక్షత్రానికి సమీపంలోనే ఉదయిస్తాడు లేదా ఉంటాడు. మొత్తం మీద పై వృత్తాంతాన్ని బట్టి రోహిణికీ-చంద్రునికీ ఏర్పడిన అన్యోన్యత కారణంగానే చంద్రునిలో వృద్ధి క్షీణతలు ఏర్పడినట్లు అర్థమవుతున్నది. శివుని శిగలోకి నెలవంక చేరిన వైనం ఇదీ.


logo