గురువారం 13 ఆగస్టు 2020
Devotional - Jul 14, 2020 , 23:51:29

గృహస్థాశ్రమమే ఉత్తమ మార్గం!

గృహస్థాశ్రమమే ఉత్తమ మార్గం!

‘ధర్మబద్ధంగా ధనం సంపాదించేవాడు, సహనం కలిగి ఉన్నవాడు, ఇంద్రియాలను జయించినవాడు, వినయాన్ని తన స్వభావంలోను, నడవడికలోనూ కలిగి ఉన్నవాడు, భూతదయతో సమస్త ప్రాణులను హితదృష్టితో చూసేవాడు, అతిథులను సేవించేవాడు అయిన గృహస్థుడికి వేరే ఏ ఆశ్రమాలతోనూ పనిలేదని’ పరమేశ్వరుడు, పార్వతితో చెప్పినట్టుగా శ్రీ వ్యాసభారతంలోని ‘గృహస్థాశ్రమ ప్రాశస్త్యం’ చెబుతున్నది. అందులో పాటించాల్సిన నియమాలు, గృహస్థు ఔన్నత్యం గురించిన వివరణ రెండు, మూడు సన్నివేశాల్లో కనిపిస్తుంది.

కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తర్వాత ధర్మరాజులో కలిగిన వైరాగ్యంతో సన్యసించడానికి సిద్ధపడతాడు. అప్పుడు అర్జునుడు, వైరాగ్యభావంలో ఉన్న నలుగురు బ్రాహ్మణ బాలురకు ఇంద్రుడు పక్షిరూపంలో వచ్చి చెప్పిన బోధను గుర్తుచేస్తాడు. ‘వేద సమ్మతమైన కర్మలు ఆచరించడం మానవ ధర్మమని, అదే స్వర్గానికి చేరే ఉత్తమ మార్గమని’ చెప్పడం దాని సారాంశం. అప్పుడు నకులుడుకూడా గృహస్థాశ్రమ ధర్మం ఔన్నత్యాన్ని చెపుతాడు. ‘ధర్మమార్గంలో సంపాదించిన ధనాన్ని యజ్ఞాలకు ఉపయోగించే హృదయం ఉన్నవాడు, సాత్వికుడైన త్యాగి, గృహస్థాశ్రమ బాధ్యత నిర్వహించకుండా, వానప్రస్థ, సన్యాసాశ్రమం స్వీకరించేవారు తామస త్యాగులు’గా పెద్దలు చెపుతారని అంటాడు.

తాసులో ఒకవైపు గృహస్థాశ్రమం మరోవైపు బ్రహ్మచర్య, వానప్రస్థ, సన్యాసాశ్రమాలు తూకం వేస్తే, ‘గృహస్థాశ్రమంలోనే స్వర్గం ఉన్నట్టు, అదే సన్మార్గమని’ మహర్షులు నిర్ణయించారు. ‘గృహస్థధర్మంలో జీవించే వ్యక్తికి ఎప్పుడూ భ్రష్టత్వం కలగదు. పితరులకు, దేవతలకు, అతిథులకు చేసే సత్కారాలే లోకంలో ప్రశంసింపబడతాయని’ వ్యాసభారతం పేర్కొన్నది. అట్లాగే, ఒకానొక సందర్భంలో తన కుమారుడైన శుకునికి కూడా గృహస్థ ధర్మ ప్రాశస్త్యాన్ని వ్యాసుడు ఇలా వివరించాడు. ‘గృహస్థు అయిన మానవునికి తమ గురువులు, కుటుంబసభ్యులు, అతిథులు, ఋత్విక్కులు, జ్ఞాతులు, దగ్గరి బంధువులు, అందరూ సకల దేవతా స్వరూపులుగా భావింపబడతారు. పెద్దన్నను తండ్రిగా, భార్యాపుత్రులను తన దేహంతో సమానంగా, తమ సేవకులను నీడగా భావించాలి. కాబట్టి, ఎప్పుడైనా వీరి తిరస్కారానికి గురైనా, ఓపికతో భరిస్తూ గృహస్థు ధర్మబద్ధంగా ఉండాలి. కష్టాలను సహిస్తూ జీవించాలి. అప్పుడే ఆ మానవుడు మోక్షం పొందగలుగుతాడు’.

ఉపనిషత్తులలో కూడా చెప్పినట్లు గృహస్థుడు, దేవ పితృ యజ్ఞాలను ఆచరిస్తూ, అతిథులకు సేవిస్తూ, గృహ నిర్వహణ ద్వారా పశు, పక్షి, కీటకాదులకు ఆహారాన్ని సమకూరుస్తూ తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తాడు. తద్వారా, సమస్త భూతాలకు తాను ఉపకారం చేస్తున్నాడు. గృహస్థాశ్రమంలో గృహిణి పాత్ర గురించి కూడా వ్యాసభారతం వివరించింది. గృహంలో ఎందరున్నా గృహిణి లేకపోతే అది శూన్యమే. ఒక మానవుడు ధర్మార్థ కామాలను పాటించడంలో భార్య సహకారం ఎంతో ముఖ్యమైంది. పురుషుడు ఎటువంటి కష్టంలో ఉన్నా గానీ, అతడికి భార్య నుంచి వచ్చే సహకారం ఏ బంధువు నుంచీ రాదు. పురుషుడికి భార్య సహకారం ఉంటే చెట్టుకింద నివాసమైనా అది స్వర్గం వంటిదే. అనుకూలవతియైన భార్య 

లేకపోతే, రాజభవనమైనా అడవి లాంటిదే. అదీ భార్య స్థానం!

‘గృహస్థాశ్రమం నిష్ఠగా పాటించడం కష్టసాధ్యమే. కేవలం ఒక గృహస్థు మాత్రమే తన ధర్మపత్నీ సహాయంతో, యజ్ఞయాగాదులు, వ్రతాలు, పూజలు నిర్వహించగలడని ‘పద్మపురాణం’ కూడా ముక్తాయించింది. అందువల్ల, ‘స్వధర్మాచరణం చేస్తూ సత్యభాషణులుగా, ధర్మబద్ధంగా సంపాదించిన ధనంతో యజ్ఞాది వ్రతాలను ఆచరించే మానవులు, లోకంలో గురుతుల్యులవుతారు. ఇంద్రలోకార్హత పొందుతారు’ అన్నది వ్యాసభారత ప్రబోధం. దీనినే ప్రామాణికంగా స్వీకరించి మానవులంతా తమ గృహస్థ ధర్మాన్ని చక్కగా పాటించాలి. అప్పుడే వసుధైక కుటుంబం సాకారమవుతుంది!


logo