గురువారం 13 ఆగస్టు 2020
Devotional - Jul 12, 2020 , 23:33:21

రక్షణాయనం

రక్షణాయనం

దక్షిణాయనంలోని ఆరునెలల కాలమంతా దేవతా ఉపాసనలు, దీక్షలతోనే కొనసాగుతుంది. ఏకభుక్తం, బ్రహ్మచర్యం వంటి నియమాలూ మనకు మేలు చేసేవని సనాతన శాస్ర్తాలు చెబుతున్నాయి.ఫలితంగా అంటురోగాల బారినుండి గట్టెక్కుతాం. జపతపాలు, దానధర్మాలు వంటివి మనకు శారీరక, మానసిక ఆరోగ్యాన్నిస్తూనే అనిర్వచ నీయమైన ఆధ్యాత్మికానుభూతికి లోనుచేస్తాయి. 

మనకు ఏ కన్ను కావాలంటే ఏం చెప్తాం? కుడికన్నును ఎడమభాగం, ఎడమకన్నును కుడిభాగం నియంత్రిస్తాయి. అదే విధంగా రెండు అయనాలు కాల భ్రమణానికి అవసరమే. ఈనెల 16వ తేదిన కర్కాటక సంక్రమణంతో ‘దక్షిణాయనం’ ప్రారంభమవుతుంది. ఈ ఆరు నెలలు రాత్రి ఎక్కువగా ఉంటుంది కనుక బ్రాహ్మీముహూర్తంలోనే నిద్ర లేవడం, తలస్నానాలు చేయడం, పూజాది, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం ఎక్కువగా జరుగుతుంది. సంక్లిష్టమైన ఈ కరోనా నేపథ్యంలోనూ ఆయా నిబంధనలు పాటిస్తూనే భౌతికంగా ఆరోగ్యాన్ని కాపాడుకొంటూ, మానసికంగా భగవంతుని అనుగ్రహానికి పాత్రులమవుదాం. ఈ నేపథ్యంలో కాలం కథ, ప్రత్యేకించి దక్షిణాయనం విశేషాలు తెలుసుకొందాం.

మన ప్రాచీనులు సూర్యభగవానుని గమనం ప్రకారం కాలాన్ని యుగాలు, సంవత్సరాలు, మాసాలు, వారాలు, రోజులు, జాములు, ఘడియలుగా విభజించారు. ఏడాదిలోని రెండు భాగాలే అయనాలు. ఒక్కో అయనంలో మూడేసి రుతువులు, రుతువుకు రెండేసి మాసాలు. అసలు, మొత్తం కాలమే పరమాత్మ స్వరూపమే. విష్ణు సహస్ర నామావళి ప్రకారం ‘నిమిషః, సంవత్సరః, అయనః, ఋతుః’ అంటూ నామాలున్నాయి. అంటే, భగవంతుడు కాల స్వరూపుడు. కాలమంతా ఒకటే రూపమైనా, మనం గుర్తించడానికే ‘ఉత్తర, దక్షిణాయనాలు’. సూర్యగమనాన్నిబట్టి అయనాలు, చంద్రగమనాన్నిబట్టి మాసాలు ఏర్పడతాయి. ఉదా॥కు చంద్రుడు కృత్తికా నక్షత్రంలో ఉంటే కార్తీకమాసం, శ్రవణా నక్షత్రంలో ఉంటే శ్రావణమాసం.. ఏర్పడతాయి.

అంతా జ్యోతిషశాస్త్ర ప్రకారమే!

‘అయనం’ అంటే ‘మార్గం’. సూర్యుడు తన సంచార గమనానికి అనుగుణంగా ప్రయాణిస్తుంటాడు. సూర్యుడు కాలాన్ని శాసించేవాడేకాక కాలానికి అధిపతి కూడా. ఆ సూర్యుని చుట్టే మన భూమి తిరుగుతున్నది. ఈ క్రమంలో ప్రతి బిందువుకు 360 డిగ్రీల ప్రమాణం ఉంటుంది. దీనిని రెండుగా ఖగోళశాస్త్ర ప్రకారం జ్యోతిషశాస్త్రం విభజించింది. మాసాన్ని కృష్ణ-శుక్ల పక్షాలుగా, రోజును రాత్రి-పగలుగా, సంవత్సరాన్ని అయనాలుగా నిర్ణయించింది. దీనికంతా వేదమే ప్రమాణం. సూర్యకిరణాల మార్గాన్ని విభజించి ఒకవైపు ఉత్తరాయనం, మరొకవైపు దక్షిణాయనంగా పేర్కొన్నారు. సూర్యుడు ఓ రాశినుండి మరొక రాశిలోకి ప్రవేశించడం ‘సంక్రమణం’. మేషరాశిలోకి ప్రవేశించినప్పుడు మేష సంక్రమణంగా, వృషభ రాశిలోకి వచ్చినప్పుడు వృషభ సంక్రమణం. ఇలా అన్ని రాశులలో ఆయా సంక్రమణలు ఏర్పడతాయి. ‘కర్కాటక సంక్రమణా’న్నే ‘దక్షిణాయనం’ అంటున్నాం. 

ఆ 32 ఘడియలు పుణ్యకాలం

సూర్యుడు ప్రతి రోజు తూర్పున ఉదయించి పశ్చిమాన అస్తమిస్తాడన్నది అందరికీ తెలిసిందే. కానీ, ఏడాదిలో రెండు రోజులే ఇలా జరుగుతుంది. మార్చి 21, సెప్టెంబర్‌ 23. మిగతా రోజుల్లో ఉత్తరం వైపుగానీ, ఇటు దక్షిణం వైపుగాని కొంచెం-కొంచెం జరుగుతూ ఉదయిస్తుంటాడు. మేషరాశి, తులారాశిలో సూర్యుడు ప్రవేశించిన కాలాన్ని ‘విషవత్‌' అంటాం. సూర్యుడు వృషభ, సింహ, వృశ్చిక, కుంభరాశులలోకి ప్రవేశించినప్పుడు ‘విష్ణుపదాలు’ అంటాం. మిధునం, కన్య ,ధనస్సు, మీనరాశులలోకి వచ్చినప్పుడు ‘షడశీతి’. అలాగే, మేష, తులలోకి ప్రవేశించినప్పుడు ‘విషవోతు’. సూర్యుడు మకరరాశి నుండి కర్కాటక రాశికి రావడానికి ఆరు మాసాలు పడుతుంది. ఈ ఏర్పడుతున్న మార్పులను అనుసరించే ‘పంచాంగం’ రూపొందుతుంది. ఇక, ఘడియ అంటే 24 నిమిషాలు. సంక్రమణ సమయం 32 ఘడియలు. ఇది చాలా పుణ్యకాలం. ఈ 32 ఘడియల్లో 16 ఘడియలు సంక్రమణానికి ముందు, 16 ఘడియలు తర్వాత లెక్కించి పర్వదినంగా భావిస్తాం. ఈ సంధికాలంలో సముద్రస్నానం, ఉపవాసాలు, ప్రత్యేక పూజలు పుణ్యదాయకమని శాస్ర్తాలు చెబుతున్నాయి. ఒక్కొక్క సంక్రమణానికి ఒక్కొక్క దానం చేయాలని కూడా ఉంది. 

దేవతలతోపాటు పితృదేవతారాధన కూడా!

‘ఉత్తర దిక్కుగా సూర్యభగవానుని ప్రయాణం దేవతా సంబంధమైంది. దక్షిణ దిక్కుగా పితృదేవతలది. ఉత్తర దిక్కుకు అధిపతి కుబేరుడు. దక్షిణ దిక్కుకు యముడు. అందుకే, ఉత్తరం శుభప్రదమైంది. దక్షిణం ఇబ్బందికరమైందని’ జ్యోతిషవేత్తలు అంటారు. కానీ, పితృదేవతల పట్ల కృతజ్ఞతా పూర్వకంగా చేయవలసిన కార్యక్రమాలన్నీ ‘మహాలయ పక్షం’లో చేస్తారు. దీనితోపాటు దేవతలను ఆరాధించే కాలంగానూ దీనిని భావిస్తారు. అనేక పండుగలు ఈ అయనంలోనే రావడం గమనార్హం. వినాయక చవితి, శరన్నవరాత్రులు, దీపావళి మొదలైనవేకాక దక్షిణాయనం చివరి రోజైన భోగి పండుగ కూడా గోదాదేవి రంగనాయకుల వివాహం జరిగిన పవిత్రమైన రోజు. దక్షిణాయనంలో ’గోఘృతం’ అంటే ఆవు నెయ్యి దానం మంచిదంటారు. తెల్లని వస్త్రం, బియ్యం, ధాన్యమూ దానం చేయాలి. పిండ ప్రదానాలు, తర్పణాలు, దానాలు, నదీస్నానాలు ఎంతో పుణ్యప్రదమని అంటారు.

రోగాలనుండి గట్టెక్కడానికి!

దక్షిణాయనంలో సూర్యశక్తి భూమిమీద తక్కువగా ప్రసరిస్తుంది. దానివల్ల ప్రాణుల్లో రోగనిరోధక శక్తి నశిస్తుంది. రోగాల బారిన పడే అవకాశమూ ఉంటుంది. వీటిని అధిగమించడానికి ఈ సమయమంతా ఉపాసనలు, ఏకభుక్తం, బ్రహ్మచర్యం మొదలైన నియమాలు పాటించటం వల్ల రోగాల బారినుండి గట్టెక్కుతాం. ఇంకా, జపతపాలు, దానధర్మాలు ఆరోగ్యాన్ని అందిస్తూనే ఆధ్యాత్మికానుభూతినీ ప్రసాదిస్తాయి. దక్షిణాయనం అంతా దేవతలకు రాత్రి కనుక ఈ సమయంలో ఎవరైనా శరీరం విడిచిపెడితే స్వర్గద్వారాలు మూసి ఉంటాయని చెప్తారు. మళ్లీ ఉత్తరాయణంలో అవి తెరుచుకొంటాయనే భావనవల్ల కూడా దీనిని తక్కువగా చూడటం జరుగుతున్నది. కానీ, ఎవరైతే దక్షిణాయనంలో పరమేశ్వర ఉపాసన చేస్తారో వాళ్లు భగవంతునితో జ్ఞానాన్ని పొంది స్థిరంగా నిలబడగలిగే స్థితికి చేరుకొంటారనీ ఆధ్యాత్మిక వేత్తలు అంటారు.

శుభకార్యాలు నిషిద్ధం.. ఎందుకంటే?


మకరంలోకి సూర్యుడు రాబోయే నెలరోజుల ముందే (సంక్రాంతి రావడానికి) ఆ పండుగ ఏర్పాట్లలో ఉంటాం. అప్పుడు దాన్ని ‘శూన్యమాసం’గా పిలుస్తాం. దక్షిణాయన ప్రవేశమైన ఆషాడం, చివరిదైన పుష్యమాసాలు రెండూ ఏ శుభకార్యాలకూ పనికి రావు. కానీ, దేవతలకు ఇష్టమైన సంపూర్ణమైన కాలంగా దీనిని భావించాలి. మానవులకు దేవతలను పూజించే కర్తవ్య కాలం కూడా ఇదే. శుభకార్యాలు ఉండవు. మానవుడు తను చేసుకునే శుభకార్యాల (గృహప్రవేశాలు, ఉపనయనాలు, వివాహాలు)లో మునిగిపోతూ భగవదారాధనను నిర్లక్ష్యం చేయకుండా ఈ మాసాల్లో వాటిని నిషేధించినట్లు చెప్తారు. వాటికి బదులుగా దేవతా సంబంధమైన విశేష పండుగలు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. పితృదేవతల ఆరాధనకూడా మనలోని కృతజ్ఞతకు నిదర్శనం. ఏ చిన్న సాయం చేసినా మనం కృతజ్ఞతలు చెబుతాం. అలాంటిది శరీరంతో జీవితాన్ని అనుగ్రహించిన పితృదేవతలను స్మరిస్తూ, వారిపట్ల కృతజ్ఞతలు చూపడం మానవధర్మం. వారి ఆరాధనకు అనుకూలమైన కాలమే దక్షిణాయనం. ఈ రకంగా దీనినీ ‘పుణ్యకాలం’గానే భావించాలి. 


logo