సోమవారం 10 ఆగస్టు 2020
Devotional - Jul 12, 2020 , 23:33:32

వినయశీలత

వినయశీలత

హస్తినాపురాధీశునిగా అభిషిక్తుడైన పిదప ధర్మరాజు అశ్వమేధ యాగాన్ని భక్తిశ్రద్ధలతో శౌచం, దానం ఉప్పతిల్లునట్లుగా (ఉప్పొంగేలా) నిర్వహించాడు. యాగాన్ని చూడవచ్చిన బ్రాహ్మణులకు షడ్రసోపేతమైన భోజనం పెట్టడంతోపాటు ఎవరూ ఊహించని స్థాయిలో గో, సువర్ణ దానాలు చేశాడు. వేయిమంది బ్రాహ్మణులు భోజనం చేశారనడానికి సంకేతంగా ఒక ఘంటారావాన్ని ఏర్పాటు చేశారు. యాగం జరిగినన్నాళ్లు ఆ గంట నిర్విరామంగా మోగుతూనే ఉన్నది.

భోజనానంతరం చేతులు కడుక్కొంటూ బ్రాహ్మణులు ‘ఇటువంటి యాగాన్ని భూమండలంలో ఇదివరకెవరూ చేసి ఉండరు’ అంటూ ధర్మరాజును మెచ్చుకొన్నారు. వీరు చేతులు కడుక్కొనే చోట ఒకింత గడ్డి పెరిగి ఉన్నది. ఆ గడ్డిలో పారాడుతూ వుండిన ఒక ముంగిస బ్రాహ్మణుల మాటలను విని మానవభాషలో ఇలా అంది- “ఇదీ ఒక యాగమేనా? సక్తుప్రస్థుడు చేసిన యాగంతో పోలిస్తే ఇది గడ్డిపోచతో సమానం.” వారు నివ్వెర పోయారు. విషయం ఆ నోటా, ఈ నోటా ధర్మజుని చేరింది. హుటాహుటిన అక్కడకు వచ్చిన ధర్మరాజు, “లక్షలాదిమంది బ్రాహ్మణులకు చేతికి ఎముక లేకుండా దానం చేస్తుంటే ఇది దానమే కాదంటావా?” అనడిగాడు ముంగిసను. “అవును ధర్మరాజా! చెప్తాను విను..” అంటూ ముంగిస ఇలా చెప్పసాగింది.

చాలా ఏండ్ల క్రితం ఒకానొక గ్రామంలో సక్తుప్రస్థుడనే పేద బ్రాహ్మణుడుండేవాడు. భార్య, కొడుకు, కోడలు అతడి కుటుంబం. అతడు ఉంఛవృత్తితో జీవించేవాడు. ఉంఛవృత్తి అంటే కాయకష్టం చేసి జీవించడం కాదు. భిక్షాటనం అంతకన్నా కాదు. చెట్లనుండి మొక్కలనుండి రాలిపడిన కాయలు, పండ్లు, ధాన్యపు గింజలను సేకరించి వాటితో కడుపు నింపుకోవడం. కాయలను, పండ్లను చెట్లనుండి కోసుకోవడం కాని, దులుపుకోవడం గాని చేయకూడదు. అవి ప్రకృతి సిద్ధంగానే రాలి పడాలి. గృహస్థాశ్రమ జీవితంలో సర్వోత్కృష్ట వైరాగ్య జీవన విధానమే ఈ ఉంఛవృత్తి.

ఒకసారి ఏమైందంటే- అప్పటికే వారం రోజులుగా వారు పస్తులున్నారు. ఎనిమిదవ రోజున సక్తుప్రస్థునికి కొన్ని యవలు దొరికాయి. వాటిని పిండిగా కొట్టుకొన్నారు. ఆ పేలపిండిని నాలుగు సమభాగాలుగా చేసికొని తినడానికి ఉద్యుక్తులైనారు. ఈలోగా ఇంటి ముందు ఏదో అలికిడైంది. వెళ్లి చూస్తే అతిథి! ఆకలి మీద వున్నాడు. మనం పిలువకుండా, ఊహించకుండా వచ్చేవాడు అతిథి. ఆకలితో అన్నం కోసం వచ్చేవాడు అభ్యాగతుడు. మన ఆహ్వానాన్ని అందుకొని వచ్చేవారు బంధుమిత్రులవుతారు తప్ప, అతిథులు కారు. ఆ అతిథిని ఇంట్లోకి ఆహ్వానించి తన వంతు పేలపిండిని అతనికి భోజనంగా పెట్టాడు సక్తుప్రస్థుడు. పేలపిండిని ఇష్టపూర్తిగా ఆస్వాదించిన అతిథి కడుపు నిండలేదన్నట్లుగా చూశాడు గృహస్థు వంక. 

సక్తుప్రస్థుడు భార్యవంక సాభిప్రాయంగా చూశాడు. ఆవిడ తన వంతు పేలపిండిని అతిథికి వడ్డించింది. దాన్ని కూడా ఆరగించిన అతిథి ఇంకా తన ఆకలి తీరలేదన్నట్లుగా చూశాడు. తలవంచుకొన్నాడు సక్తుప్రస్థుడు. కొడుకు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తన వంతు పేలపిండిని అతిథి విస్తట్లో వడ్డించాడు. అదీ అయిపోయింది. అతిథికి ఆకలి తీరలేదని గ్రహించిన కోడలు తనంత తానుగా తన వంతు పేలపిండినీ అతిథికి సమర్పించింది. దాన్నికూడా తిన్నాక అతిథి తృప్తిగా త్రేన్చి లేచి చేతులు కడుక్కున్నాడు. ఎట్టకేలకు అతిథి కడుపు నింపగలిగినందుకు సంతోషపడ్డారా కుటుంబ సభ్యులు. ఇంతకూ అతిథిగా వచ్చింది ధర్మదేవత. వారిని పరీక్షించడానికే వచ్చింది. ఆ పుణ్యఫలంతోనే వారు స్వర్గలోకానికి వెళ్లారు.

“నేనప్పుడు ఆ ఇంటివెనుక పారాడుతున్నాను. ఆ అతిథి చేతులు కడుగుకొన్నప్పుడు కొన్ని నీటి తుంపరలు, కొంత పేలపిండి నా శరీరమ్మీద పడ్డాయి. నీటితో తడిసిన నా మేని భాగం స్వర్ణమయమైంది. అప్పటినుండి ఎక్కడ యజ్ఞయాగాదులైనా, దానధర్మాలు జరిగినా అతిథులు చేతులు కడుక్కొనే చోట పారాడుతూ, ఆ తడిలో పొర్లాడుతున్నాను. ఇక్కడ కూడా ఆ పనిచేశాను. కాని, మిగిలిన నా ఒడలు స్వర్ణమయం కాలేదు. కనుక, నీ యాగం తక్కువదని చెప్పాను” అన్నది ముంగిస. “ఎందుకంటావు?” అడిగాడు ధర్మరాజు.

“సక్తుప్రస్థుడి కుటుంబసభ్యులలో పేలపిండిలో అనుపానం నిమిత్తం ఏ ఆదరువునూ వడ్డించలేకపోతున్నామే అన్న మనోవేదన వున్నది. కోడలి వాటా పేలపిండితో అతిథి కడుపు నిండకపోతే ఏం చేయాలో వారికి తెలియదు. వారం రోజులుగా వారు మంచినీళ్లమీదే బతుకుతున్న సంగతిని వారెప్పుడో మరిచిపోయారు... ఇక్కడ యజ్ఞయాగాలు, దానధర్మాలు అన్నీ యథావిధిగా శాస్ర్తోక్తంగా జరుగుతునే వున్నా, అంతర్లీనంగా వున్న కీర్తికాంక్ష విషయ ప్రాధాన్యాన్ని దెబ్బతీసింది.” ఈ మాటలంటున్న ముంగిస ఉన్నట్టుండి అందరూ చూస్తుండగానే జమదగ్ని మహర్షిగా మారిపోయింది. “ధన్యవాదాలు ధర్మరాజా! నీ దర్శన భాగ్యంతో నాకు శాపవిముక్తి కలిగింది” అంటూ నింగిలోకి వెళ్లిపోయాడు జమదగ్ని.

కుటుంబ యజమాని స్వీకరించిన ధర్మాన్ని నిండుమనసుతో ఆచరించి, సహకరించిన సక్తుప్రస్థుని ఇల్లాలి వంటి ఇల్లాలు, తల్లిదండ్రులు ఆచరించిన ధర్మాన్ని ముందుకు నడిపించాలనుకొన్న ఆ కొడుకు వంటి కొడుకు, అత్తమామలను దైవంగా భావిస్తూ భర్త మనసును అర్థం చేసుకొని కుటుంబాన్ని నడిపింపబూనుకొన్న ఆ కోడలి వంటి కోడలూ.. వున్న ఇల్లు ధన్యం. భారతీయ సంప్రదాయంలో ఋషులు ప్రతిపాదించిన గార్హస్థ్య ధర్మమిదే సుమా!


logo