శనివారం 15 ఆగస్టు 2020
Devotional - Jul 12, 2020 , 23:33:32

పాండవులకు ఆ పాపం తగల్లేదా?

పాండవులకు ఆ పాపం తగల్లేదా?

బ్రాహ్మణుడైన ద్రోణాచార్యుణ్ణి చంపడం వల్ల పాండ వులకు బ్రహ్మ హత్యాపాపం రాలేదా? వస్తే, దాని నివారణకు వారేం చేశారు?

- ఆత్రేయశర్మ బ్రహ్మాభట్ల, సిద్దిపేట టౌన్‌

మహాభారతాన్ని పరిశీలిస్తే ద్రోణుడిని పాండవులు ‘చంపలేదు’. ‘అశ్వత్థామ’ అనే ఏనుగును భీముడు చంపిన కారణంగా ధర్మరాజు ‘అశ్వత్థామ హతః‘ అని ఎలుగెత్తి చాటాడు. అదే సమయంలో పాండవసేన తూర్యనాదాలు చేసింది. ఆ శబ్దాలలో ధర్మరాజు నెమ్మదిగా పలికిన పై మాట వినిపించినా, తర్వాత మెల్లగా పలికిన మాట ‘కుంజరః’ అన్నది మాత్రం ద్రోణునకు వినిపించలేదు. దాంతో ద్రోణుడు తన కొడుకు అశ్వత్థామే చనిపోయాడని అనుకొన్నాడు. పుత్ర వాత్సల్యంతో వెంటనే అస్త్ర సన్యాసం చేసి, యోగమార్గంలో ప్రాణాలను విడిచాడు. మృతుడైన ద్రోణుని శిరస్సును దృష్టద్యుమ్నుడు ఖండించినట్లు ద్రోణపర్వంలో ఉంది. కాబట్టి, పాండవులకుగాని, దృష్టద్యుమ్నునికిగాని ‘బ్రహ్మహత్యా పాపం‘ అంటుకొనే అవకాశమే లేదు. ద్రోణుడి పార్థివదేహానికి చెందిన తలను ఖండించిన దోషానికి దృష్టద్యుమ్నుడు అశ్వత్థామ చేతిలో హతుడవడంతో ఆ పాపం నుండీ విముక్తుడవుతాడు. అబద్ధమాడిన దోషానికి ధర్మరాజు నరకాన్ని చూశాడు.

జన్మతః బ్రాహ్మణుడైన ద్రోణుడు హస్తినాపురం చేరాక క్షాత్రధర్మాన్నే అనుసరించాడు. పాండవులపట్ల, ముఖ్యంగా ద్రౌపదిపట్ల కౌరవుల అధర్మ కృత్యాలను సహించడమేకాక అధర్మ యుద్ధాలలో వారి పక్షాన పాల్గొన్నాడు. అభిమన్యుని వధలోనూ అధర్మానికి పాల్పడ్డాడు. ఇలా బ్రాహ్మణ ధర్మానికి దూరమైన ద్రోణుడిని శిక్షించడం పాండవులకు ధర్మమే. అది గురువధ అందామన్నా, గురువు అనుమతితోనే ఆరంభమైన యుద్ధం కదా! వైరిపక్షాన యుద్ధం చేస్తున్న సర్వసైన్యాధిపతిని చంపడం క్షత్రియ ధర్మమే. 

‘ధర్మయుద్ధంలో అధర్మాన్ని జయించడం అసాధ్యమైనప్పుడు ధర్మాన్ని విడిచైనా శత్రువును జయించాలని’ అంటాడు కృష్ణుడు ధర్మరాజుతో. ద్రోణ వధకై యజ్ఞప్రసాదంగా వచ్చినవాడు దృష్టద్యుమ్నుడు. ద్రోణుని చేతిలో ధనువు ఉన్నంత వరకు అతనిని చంపడం దృష్టద్యుమ్నునికే కాదు, ఎవరికీ సాధ్యపడదు. ద్రోణుడు విల్లును విడవకపోతే దృష్టద్యుమ్నుని జన్మ సార్థకం కాదు. కనుక, పాండవులకు బ్రహ్మహత్యా దోషం అంట లేదు. దోషమే లేనప్పుడు దాని నివారణ గురించిన ప్రస్తావనే ఉండదు. 

తాజావార్తలు


logo