శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
Devotional - Jul 12, 2020 , 23:33:30

వివాహ సిద్ధికి, లోక కల్యాణానికి ..శ్రీ లోక కల్యాణ కామేశ్వరియై నమః

వివాహ సిద్ధికి, లోక కల్యాణానికి ..శ్రీ లోక కల్యాణ కామేశ్వరియై నమః

మన ఇంట్లో కల్యాణ కారకమైన జీవనం కావాలనే దృష్టితోనే భగవంతుని మూర్తి స్వరూపానికి ప్రతి సంవత్సరం వైభవంగా కల్యాణాలు చేస్తుంటాం. ఇల్లు అంటే కేవలం కుటుంబసభ్యులు మాత్రమే కాదు. ఈ భావనను పెంచుకుంటూ పోతే మన గ్రామం, మన జిల్లా, మన రాష్ట్రం, దేశం, ప్రపంచం, భూగోళమంతా కల్యాణ కారకమైన జీవనం కలగాలని, జీవులన్నీ సంతోషంగా జీవితం కొనసాగించాలని ప్రార్థన చేయడం భారతీయ జీవన లక్ష్యం. 

 వివాహం గొప్ప సంస్కారం. దొరికే తోడు సరైంది కాకపోయినా, సమయానికి దొరకక పోయినా, ఆయుష్షు, ఆరోగ్యం, సంతానాదుల్లో ఇబ్బందులు పడాల్సి వచ్చినా జీవితమంతా లోటుగానే భరించాల్సి వస్తుంది. అందుకే, మంచి తోడుకోసం ‘పుణ్యం’ చేసుకోవాలని, మంచి సంతానం కోసం ‘దానం’ చేసుకోవాలని మన పెద్దలు సామెతల రూపంలో సూచనలు చేస్తూనే ఉంటారు. తాము తపస్సు చేసిన తర్వాత లభించే వారు తమ జీవితానికి వినియోగపడేవారు అవుతారు. తమకు వారు ఎప్పటికీ ఆనందాన్నిస్తుంటారు. ప్రేమామృతాన్ని కురిపిస్తారు. తపస్సు చేయకుండా లభించే వారు కర్మలు పూర్తి చేయడానికి వచ్చిన వారవుతారు. బాధలు పెంచేవారు కూడా అవుతారు. తమ జీవితంలో కల్యాణానికి, లోక కల్యాణానికి మనం నిరంతరం జపం చేసుకోవడం మంచిది. వివాహం జరగడానికి మాత్రమే కాకుండా, జరిగిన వివాహం ఆనందాన్ని ఇవ్వడానికి కూడా మనం జపం చేసుకుంటుంటే కావలసిన కోరికలన్నీ తీరుతుంటాయి. 

మనకు లౌకికంగా, ఆధ్యాత్మికంగా ఉన్న కోరికలు తీర్చడానికి భారతీయ మంత్రశాస్త్ర రీత్యా నిర్దేశితమైన అధిదైవం ‘కామేశ్వరీ దేవి’. ప్రకృతి పురుషులను కామేశ్వరీ కామేశ్వర స్వరూపాలుగా చూడటం మన సంప్రదాయం. లలితాదేవి రూపంలో కామేశ్వరీ మాతను ‘లలితా కామేశ్వరీ దేవి’గా భావిస్తుంటాం. మన ఇంట్లో కల్యాణాన్ని అనుగ్రహించే దేవత కూడా కామేశ్వరీ దేవి మాత్రమే. అందుకే, అమ్మవారిని వివాహ సిద్ధికోసం, కల్యాణమయ జీవనం కోసం ‘కల్యాణ కామేశ్వరి’గా ఆరాధించాలి. అదే కల్యాణం లోకమంతా విస్తరించి, బాధామయ జీవనం తొలగాలంటే ఆ మాతను ‘లోక కల్యాణ కామేశ్వరి’గా పూజించాలి. మన గృహంలో వివాహం జరగాలన్నా, సంతోషాదులతో కూడుకున్న గృహజీవనం ఉండాలన్నా, భూమిమీద ఉన్న ప్రజలందరూ సంతృప్తితో కూడుకున్న జీవితాన్ని పొందాలన్నా కామేశ్వరీ దేవిని ఉపాసించాలి. ‘శ్రీ లోక కల్యాణ కామేశ్వరియై నమః’ అనే మంత్రాన్ని ఉపాసించడం వల్ల ఆ ఫలాల్ని పొందగలం.


logo