శుక్రవారం 14 ఆగస్టు 2020
Devotional - Jul 12, 2020 , 23:39:15

అఖిల రసామృత సింధువు!

అఖిల రసామృత సింధువు!

మనమంతా నిత్యం పలు సంబంధ బాంధవ్యాలను పెంపొందించుకోవాలనీ భావిస్తాం. ఎందుకంటే, అవి ప్రేమ, ఆప్యాయత, అనురాగాలనే రసంతో కూడి వున్నవి కాబట్టి. ఈ లౌకిక ప్రపంచంలోని సంబంధ రస మధురిమలన్నీ అశాశ్వతమైనవేగాక ఒక్కోసారి విసుగు పుట్టించి, నిరుత్సాహ పరిచేవై కూడా వుంటాయి. కానీ, దేవాదిదేవుడైన శ్రీకృష్ణునితో మనకుగల సనాతన బంధం మాత్రం నిత్యం, శాశ్వతం, సహజమైందేగాక పరిపూర్ణ సంతృప్తిని ప్రసాదిస్తుంది. వైదిక శాస్ర్తాలు శ్రీకృష్ణపరమాత్మను ‘అఖిల రసామృత సింధువు’గా కొనియాడాయి. 

అనంతమైన ఆనందానికి నిలయమైన రస విగ్రహమూర్తి ఆయనే. అంతేగాక, సకల సంబంధాలనూ ఆస్వాదించే రసిక శేఖరుడు కూడా. ‘భగవంతుడు సకల జీవరాశులకు తండ్రి’ అని తెలుసుకోవడం మన ఆధ్యాత్మిక ప్రయాణానికి ఆరంభం మాత్రమే. ఒక జీవాత్మ భగవంతునితో ఏర్పరచుకోగలిగే 12 రకాల రసాత్మక బంధాల (రౌద్రం, అద్భుత, శృంగార, హాస్య, వీర్య, దయ, దాస్య, శక్య, భయానక, భీభత్స, శాంత, వాత్సల్య)ను వైదిక శాస్ర్తాలు తెలిపాయి. వీటి అంతర్వాహినే ప్రేమ! శాంతం, శక్యం, దాస్యం, వాత్సల్యం, శృంగార భావాలు ప్రధాన రస మధురిమలు కాగా, రౌద్రం, అద్భుతం, హాస్యం, భీభత్సం, భయానకం, వీర్యం వంటివి జీవుడు భగవంతునితో పరోక్షంగా ఏర్పరచుకునే రసభావిత సంబంధాలు. 

‘రసో వై సః’ అంటే ‘దేవాదిదేవుడు సకల రసాస్వాదనలకు నిలయుడు’. వేదశాస్ర్తాలు, పురాణాలు, ఉపనిషత్తులు, వేదాంత సూత్రాలు అన్నీ జీవుడు-భగవంతుని మధ్య నెలకొనే ఆ రసభావిత సంబంధాలను తెలిపేవే. ‘శ్రీమద్భాగవతం’ వీటిని గురించి విపులంగా వివరించింది. ‘దశమ స్కందం’లోని ఒక సంఘటన ఇక్కడ సందర్భోచితం. ‘కృష్ణ-బలరాములు స్నేహితులతో కలిసి మల్లయుద్ధాలు జరిగే రంగస్థలంలోకి ప్రవేశించారు. అక్కడున్న వారిలో ఎవరు శ్రీకృష్ణునితో ఏ విధమైన సంబంధాన్ని (రస) ఏర్పరచుకొన్నారో అందుకు అనుగుణంగా, ఒక్కొక్కరికి ఆ స్వామి ఒక్కోలా దర్శనమివ్వడం అతిగొప్ప విశేషం. మల్లయోధులకు చిచ్చరపిడుగై, సామాన్యులకు సుమనోహర సుందరమూర్తియై, స్త్రీలకు ముగ్ధకోమలాంగ మన్మధుడై దర్శనమిస్తూ వచ్చాడు. గోపబాలలు మాత్రం శ్రీకృష్ణుడిని తమలో ఒకడైన గొల్లవాడిలా, తమ తోటి బృందావన వాసిలానే చూశారు. అక్కడున్న దుర్మార్గులైన క్షత్రియ రాజులంతా స్వామిని ఒక పరిపాలనా యోధుడిగా, తమను శిక్షించే సుక్షత్రియుడిగానే భావించారు. నంద-యశోదలైతే తమ ముద్దుల కుమారుని దర్శించారు. భోజవంశానికి రాజైన కంసునికి ‘ముంగిట నిలిచిన మృత్యుదేవత’ వలె శ్రీకృష్ణపరమాత్మ దర్శనమిచ్చాడు. వైష్ణవ సంప్రదాయానికి చెందిన ప్రామాణిక ఆధ్యాత్మిక గురువును ఆశ్రయించినపుడు మాత్రమే శ్రీకృష్ణునితో మనకుగల ఈ సనాతన సంబంధాన్ని చక్కగా నెలకొల్పుకోగలుగుతాం. 

అటువంటి ఆచార్యులు చూపిన మార్గాన్ని అనుసరించిన వారు ‘ఆనందమనే శాశ్వతనిధి’ని సొంతం చేసుకోగలుగుతారు. ‘హరేకృష్ణ’ ఉద్యమ సంస్థాపనాచార్యులైన శ్రీల ప్రభుపాదుల వారి బోధనల్లోని ముఖ్యమైన మార్గనిర్దేశకాలు ఇవే. నిత్యం హరినామాన్ని జపించడం, జీవితంలో వేసే ప్రతి అడుగులో ‘కృష్ణ చైతన్యవంతులు’గా వుండటం. ఈ బంధం మనిషికి భయాందోళనలు, ఆవేదనలు, ఒత్తిడులనుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. దేవాదిదేవుడైన శ్రీకృష్ణునికి మనమంతా నిత్యదాసులమనే భక్తి రసభావనతో జీవించడమే ఇక తరువాయి. హరే కృష్ణ!logo