శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
Devotional - Jul 12, 2020 , 00:01:02

జీవితాన్ని మలిచిన నవల

జీవితాన్ని మలిచిన నవల

విశ్వనాథ వేయిపడగల గురించి ఎన్నో పరిశోధనలు ఆలోచనలు అభిప్రాయాలు వెలువడ్డాయి. ఇప్పటికీ ఇంకా ఆలోచించాల్సిన అంశాలు ఎన్నో ఈ నవలలో కనిపిస్తాయి. ఇదొక బృహన్నవల కనుక అనేక విషయాలు ఇమిడి ఉన్నాయి. అయితే, నవలలో విశ్వనాథ మౌలికంగా చెప్పదలచుకున్న అంశం ఏమిటి? అని ఆలోచించినపుడు ఈ విషయాలు స్పష్టమవుతాయి.

ఈ నవలకు ప్రధాన భూమిక సుబ్బన్నపేట గ్రామీణ జీవితం. రామేశ్వర శాస్త్రి తరంతో మొదలయి అతని కొడుకు ధర్మారావు కాలంలో సాగుతుంది. ధర్మారావు అరుంధతిల వివాహం, వారికి కొడుకు పుట్టడం, అరుంధతి మరణం.. ఇక్కడితో ప్రధాన కథ పూర్తవుతుంది. ఈ కథ చుట్టూ గ్రామీణ, దేశీయ వాతావరణం అల్లుకొని క్రమంగా ఎటువంటి మార్పులకు అదీ ఆశించదగని మార్పులకు గురయిందని విశ్వనాథ తపించారు. అది వేయివిధాలు కావచ్చు.

రామేశ్వర శాస్త్రి ఉదారస్వభావం, కృష్ణమనాయుడు మరియు అతని కుమారుడైన రంగారావులది జమీందారీ కుటుంబ వ్యవస్థ. సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయం, వేణుగోపాల స్వామి దేవాలయం... వాటిలో జరిగే కల్యాణ మహోత్సవాలు, వీధినాటకాలు, చెరువులు, పచ్చని పైర్లు, పంటలు, పండుగలు, దేవదాసి సంప్రదాయము, మునసబు కరణపు వ్యవస్థదైవభక్తి, పెద్దలను గౌరవించడం, కుల వ్యవస్థ, కులభేదాలు లేకుండా వావివరుసలతో పిలుకుచుకునే ఆత్మీయతలు మొదలైన స్వయం సమృద్ధమైన సర్వమానవీయమైన విలువలకు ప్రతీక సుబ్బన్నపేట. . జీవితం అంటే కదలిక. జీవితం అంటే ప్రవాహం. రామేశ్వరశాస్త్రి బాల్యం నుంచి ధర్మారావు భార్య అరుంధతి మరణం వరకు సుబ్బన్నపేటలో జరిగిన గ్రామీణ జీవితం ఒక ప్రవాహం. ఈ ప్రవాహం సుబ్బన్నపేట చరిత్రను క్రమంగా మార్చివేసింది. వ్యాపార నిమిత్తం పరిసర ప్రాంతాల నుండి వచ్చి స్థిర నివాసం ఏర్పరుచుకున్న జనాభాతో ఒక పట్టణంగా మారింది. భూముల ధరలు పెరిగాయి. దైవభక్తి తగ్గిపోయింది. ఆధునిక విద్య పేరిట క్రైస్తవ మిషినరీ పాఠశాలలు, వాటిలో ఇంగ్లీషు భాష ప్రవేశపెట్టబడ్డాయి.

దేశీయమైన కళారూపాలు, మత విశ్వాసాలలో మార్పులు వచ్చి కొత్త రూపాలు, సిద్ధాంతాలు పరిచయమయ్యాయి. వ్యవసాయరంగంలో పెనుమార్పులు జరిగి బలంగా కాక బలుపుగా కనిపించే స్థితికి వచ్చింది. జమీందారు రంగారావు మొదటి భార్య చనిపోయిన తరువాత ఇంగ్లండు దేశపు వనిత సుసానీని పెళ్ళి చేసుకున్నాడు. ప్రజలకు పాలకులకు మధ్య సంబంధాలు తెగిపోయాయి. స్వార్థం, లాభ నష్టాలే మనుషుల మధ్యసంబధాలకు మూలకారణాలయినాయి. స్నేహితుల మధ్య పూర్వపు అనురాగాలు, ఆప్యాయతలకు బదులు అభ్యుదయ భావాలు, అభివృద్ధి వంటి భావాలే సంతరించుకున్నాయి. ప్రేమ, దయ, మంచితనం, అన్ని అంతరించి పోయాయి. ధనార్జన, అధికార దాహం ఇవీ జీవితంలో ప్రధాన లక్ష్యాలయ్యాయి. వీటిని సాధించడానికి మనుషుల్లో స్వార్థం, మోసం, ఈర్ష్య, ద్వేషం ప్రబలిపోయాయి. ప్రధాన పాత్ర అయిన ధర్మారావు జీవితమంతా కటిక దారిద్య్రాన్ని అనుభవించాడు. ఆయన జీవితమంతా దుఃఖం,విషాదమయం. త్యాగం, పరోపకారం ఆయన నిత్యకృత్యాలుగా జీవితమంతా నీతిగా, నిజాయితీగా ధర్మాన్ని తూచా తప్పకుండా పాటించాడు. కాల ప్రవాహానికి సాక్షీభూతుడు. కాలాన్ని ఎదిరించే సాహసం చేయలేదు. కనుక ధర్మారావు కాల ప్రవాహానికి ప్రేక్షకుడుగానే మిగిలిపోయాడు.

వేయిపడగలు నవలలో సారాంశం చెప్పాలంటే కాలమే జయించింది. ప్రాచీన జీవన స్రవంతిలో ప్రేమ, ఆప్యాయత, విశ్వాసము  పునాదులుగా ఏర్పడి ఇవే ఆధారంగా మానవతా సంబంధాలు కొనసాగుతూ సమాజం నిలబడింది. కాల క్రమేణ మానవతా సంబంధాలు అదృశ్యమైపోయాయి. జీవితంలో విలక్షణమైన విలువలు, పద్ధతులు, సంప్రదాయలు, సంస్కృతి చూస్తుండగానే కాలప్రవాహంలో ధ్వంసమయిపోయాయి. ఇదంతా నవలా రచయిత విశ్వనాథ కళ్ళముందు జరిగిన మార్పు. ఒక అర్థశతాబ్దం కాలంలో ఎంత మార్పు? చూసి భరించలేని ఆవేదన వేయిపడగలుగా రూపొందింది.

ఈ విధ్వంసాలను అనేక పాత్రలు, సన్నివేశాలు, సందర్భాల ద్వారా విశ్వనాథ కథనాత్మకం చేశాడు. ఒక సామాజిక చరిత్రను నవలగా మలచడంలో విశ్వనాథ ప్రతిభ అపూర్వమైంది. ఈ మార్పులను యథాతథంగా చిత్రించిన వేయిపడగలు గొప్ప సామాజిక నవల. చివరకు, అరుంధతితో ధర్మారావు ఏమి మిగిలింది? నువ్వు మిగిలావు. అంటాడు. కేవలం పవిత్ర దాంపత్య ధర్మం మిగిలి ఉంది అని విశ్వనాథ ముగింపు. భారతీయ విలువలన్నిటిలో కుటుంబవ్యవస్థకు మూలాధారమైన దాంపత్యధర్మం మిగిలింది. ఇది నా జాతి శక్తి. అని జాతీయ మూలాలు మిగిలే ఉంటాయి అనే అంశాన్ని నొక్కిచెపుతాడు. స్థూలంగా ఇది వేయిపడగల సారాంశం.

ఈ దృష్టితో వేయిపడగలు చదివితే ఈ తరం ఏం కోల్పోయిందో తెలుస్తుంది.

- డా.బి.నరేందర్‌ రావు

9866834717


logo