శనివారం 08 ఆగస్టు 2020
Devotional - Jul 09, 2020 , 23:38:53

ఏది పుణ్యం? ఏది పాపం?

ఏది పుణ్యం? ఏది పాపం?

భారతీయ ధర్మంలో ప్రతి విషయాన్ని పుణ్యపాపాలతో ముడిపెట్టి చూస్తుంటాం. ఇతరులకు ఉపకరించడం పుణ్యం. ఇతరులను ఇబ్బంది పెట్టడం పాపం. ప్రస్తుతం మనం పొందే అన్ని ఆనందాలకు మనం చేసిన మంచి పనులు కారణమైతే, మనకు కలిగే ఇబ్బందులన్నింటికీ ఇతరులకు మనం చేసే ఇబ్బందికరమైన పనులే కారణమవుతుంటాయి. మనం ఒక చెట్టు నాటితే దాని స్వభావాన్ని బట్టి ఫలితాలూ మారుతుంటాయి. అదేలా మనం చేసే పనుల ప్రభావాలు కూడా వెంటనే ఫలితాలను ఇవ్వకపోవచ్చు. ఇవి ఒకరకంగా మనం బ్యాంకులో డిపాజిట్‌ చేసే ధనం వంటివి. వాటి మెచ్యూరిటీ టైమ్‌ను బట్టి ఫలితాలు వస్తుంటాయి. అందుకే, మన ఆలోచనలు ఎప్పటికీ అందరికీ మేలు కలిగించేలా ఉండాలి. అంతిమంగా లోక క్షేమమే మన లక్ష్యం కావాలి.

పుణ్యం పెరగాలంటే మూడు కర్మలను విధిగా నిర్వహించాలి. 1. పరోపకారం 2. దానం 3. ధ్యానం. మనల్ని కాపాడే ప్రకృతికి, మనచుట్టూ ఉండే సంఘానికి, పశుపక్షులకు మనం బాధ్యులుగా ఉండాలి. వాటన్నిటి నుంచి మనం సహకారం స్వీకరిస్తున్నప్పుడు తప్పనిసరిగా మనం వాటికి వినియోగపడుతుండాలి. ఇంతే కాకుండా వాటి క్షేమం కోసమూ మనం సహకరిస్తుండాలి. భగవంతుడు మనకు మంచి శరీరాన్ని ఇచ్చినపుడు మనం దానితో ‘సేవ’ చేసుకోవాల్సిందే. చేయకపోతే మన శరీరం ద్వారా మనం పొందే సౌఖ్యాలకు మనం తప్పనిసరిగా ‘రెంట్‌' కట్టుకోవాలి. ఒకవేళ సేవకు ఖాళీ లేదనే వారు తాము ఎక్కడైనా పని చేస్తున్నప్పుడు, దానివల్ల వచ్చే ధనం లోకార్పణ కోసం అన్నట్టుగా ఒక 20 శాతం విధిగా కేటాయించాల్సిందే. మనం పొందే గాలి, నీరు, వెలుతురులకు దీనిని టాక్స్‌ వంటిదిగా భావించాలి. ఇవన్నీ మనం చేయకపోతేనే పెద్ద సమస్య. అప్పుడు కలిగే ఇబ్బందులు ఏ రూపంలోనైనా ఉండవచ్చు. అనారోగ్య సమస్యలు, వైవాహిక, సంతాన, ఉద్యోగ, వ్యాపార, సంతోష జీవనానికి ఏర్పడే ఇబ్బందుల వంటివన్నీ సదరు రెంట్‌, టాక్స్‌లకు మనం పొందుతున్న పర్యవసానాలుగా గుర్తించాలి. అందుకే ‘సేవ, పరోపకారం, దానం’ వంటి సత్కార్యాలు చేస్తూ ఉండమని పెద్దలు చెప్పేది.

పుణ్యం అంటే మన గురించి మనం లేని సమయంలో వినిపించే పాజిటివ్‌ మాటలు. మన భావనలను సకారాత్మకంగా వ్యాపనం చేసే విధానమిది. మన ఎదురుగా మన గురించి మాట్లాడే మాటలు పొగడ్తలు. వారి అవసరాల కోసం ఎదుట ఒకరకంగా, వెనుక మరో రకంగా మాట్లాడటం కొందరికి సహజం. ఇవి లెక్కలోకి రావు. కేవలం పరోక్షంగా వినవచ్చే మాటలు, ఇచ్చే ఆశీస్సులే మన పుణ్యవృద్ధికి కారణమవుతుంటాయి. భగవంతుడూ పరోక్ష ప్రియుడు. ‘పరోక్ష ప్రియా ఇవహి దేవా:’ అంటున్నది వేదం. అదేవిధంగా మనం చేసిన పనుల వల్ల పరోక్షంగా మనల్ని అందరూ వ్యతిరేకిస్తే అది మనకు ‘పాపం’ అవుతుంది. ఇది పెరగకుండా చూసుకోవాలి. సంఘాన్ని, ప్రకృతినీ, పశుపక్షులను కేవలం స్వార్థంతో తమ అవసరాల కోసం వినియోగించుకుంటే పాపం పెంచుకుంటున్నట్లే. లోకం కోసం, ప్రకృతి కోసం వినియోగపడుతూ పరమార్థ భావనతో ఉంటేనే పుణ్యం మన ఖాతాలో పెంచుకుంటున్నట్లు.

పుణ్యం తగ్గితే మళ్లీ ఇబ్బందికరమైన జీవితం మొదలవుతుంది. క్షీణే పుణ్యే మర్త్యలోకే విశంతి. పరోపకారమే పుణ్యవృద్ధికి కారణమవుతుంది. పుణ్యం పెరుగుతుంటే పనిలో నైపుణ్యమూ అధికమవుతుంది. ఈ శరీరంతో చేయదగిన పుణ్యకార్యాలన్నీ చేసేద్దాం. పరోపకారార్థ మిదం శరీరం. పూర్వకర్మలకు సంబంధించిన దోషాలనూ నివారించుకుందాం. మళ్లీ ఇబ్బంది పడనటువంటి ఉత్తమ, ఉన్నతమైన జీవనం వైపు ప్రయాణిద్దాం.


logo