శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Devotional - Jul 08, 2020 , 22:41:35

వేదోక్త కర్మలే శ్రేయస్కరం!

వేదోక్త కర్మలే శ్రేయస్కరం!

వేదాలు ధర్మానికి, కర్మలకు పరమ ప్రమాణం. జీవుని ఉద్ధరించడానికి వేదాలలో రెండు మార్గాలున్నాయి. అవి: నివృత్తి, ప్రవృత్తి మార్గాలు. ఇహపర సుఖాల పట్ల ఆసక్తి లేనివారు (విరాగులు) జ్ఞానసాధనతో పరమాత్మను చేరుకోవడానికి అవలంబించేది ‘నివృత్తి’ మార్గం. ఇది అనేక జన్మల పుణ్య సంస్కారంతోనే లభిస్తుంది. ఈ మార్గం అందరికీ సాధ్యం కాకపోవడమే కాక కష్టతరమైంది కూడా. తపస్సు, శమం (అంతరింద్రియ నిగ్రహం), దమం (బాహ్యేంద్రియ నిగ్రహం) వంటివి ఇందులోని కర్మలు. ఇహపర సుఖాల పట్ల ఆసక్తి గలవారు తమ కోర్కెలను తీర్చుకోవడానికి పరమాత్మను ఆరాధించే పద్ధతి ‘ప్రవృత్తి’ మార్గం. యజ్ఞయాగాది కర్మలు, వ్రతాలు, దీక్షలు వంటివి దీనికి చెందినవి. సాధారణంగా అత్యధిక మానవులు ఆచరించే క్షేమతరమైన మార్గం ఇదే.

కర్మ ప్రవృత్తంచ నివృత్తమ ప్యృతం

వేదవివిచ్యోభయ లింగ మాశ్రితమ్‌

అని భాగవత వాక్యం. పుణ్యకర్మల వల్ల స్వర్గాది ఊర్ధలోకాలు, మోక్షం సంప్రాప్తిస్తాయి. పాపకర్మల వల్ల నరకం, పశుపక్షాది జన్మలు ఏర్పడుతాయి. పుణ్యపాప మిశ్రమ కర్మల వల్ల మానవజన్మ సిద్ధిస్తుంది. స్వర్గాదులతో మోక్షాన్ని సాధించడానికి గాని, నరకాన్ని, పశుపక్షాది జన్మలు పొందడానికి గాని లేదా మరలా మానవజన్మనే పొందడానికైనా మనిషి జన్మే కారణమవుతుంది. ఎందుకంటే, మనిషిలోనే శక్తి సామర్థ్యాలు, బుద్ధివికాసం, స్వేచ్ఛ వంటివి ఎక్కువ. వీటి కారణంగా మానవుడు సత్కర్మలతో తనకు శ్రేయస్సును కల్పించుకోగలడు. ప్రపంచ శాంతినీ సాధించగలడు. లేదా స్వార్థం, అహంకార మోహాలతో దుష్కర్మలకు పాల్పడటం వల్ల తనకు తానే హాని కలిగించుకొంటూనే ప్రపంచ వినాశానికీ కారణమవగలడు.

ఏ జంతువూ (ప్రాణీ) తన స్వాభావిక ధర్మాన్ని ఉల్లంఘించదు. ఒక్క మానవుడు మాత్రం స్వధర్మాన్ని ఉల్లంఘించే ప్రమాదం ఉంది. కనుకే, వేదాలు మనలను సరైన మార్గంలో నడిపించడానికి అనేక ధర్మాలను, విహిత-నిషిద్ధ కర్మలను సూచించాయి. 

వేదవిహిత కర్మల వల్ల పుణ్యాన్ని, నిషిద్ధ కర్మల వల్ల పాపాన్ని మూటగట్టుకోగలం. ‘కుర్వన్నే వేహ కర్మాణి జిజీవిషేచ్ఛ తగ్‌ం సమాః. లోకంలో కర్మలు చేస్తూ నూరేండ్లు (పూర్ణాయుష్షు) జీవించడం అన్నది కోరుకోవాలని ‘ఈశావాస్యోపనిషత్తు’ చెబుతున్నది. సత్తగుణ ప్రధాన కర్మలు జీవునికి ఉత్తమ గతిని కలిగిస్తాయి. కానీ, రజోగుణ, తమోగుణాలు మోహ పరవశుని చేస్తాయి. మోహితులైన మనుషులు ఇంద్రియ భోగాల పట్ల ఆసక్తితో ధనార్జనను, నిషిద్ధకర్మలను ఆశ్రయిస్తారు.

సంపద, ఇంద్రియ సుఖాల పట్ల నిరంతర వ్యామోహం మానవుని విచక్షణా జ్ఞానాన్ని కప్పివేస్తుంది. ‘నేను, నాది’ అనే స్వాభిమానంతో, ఈర్ష్యాద్వేషాలతో పాపకర్మలకు పాల్పడుతారు. దీంతో మానవజన్మ వృథా అయి, అన్యజన్మల బారిన పడతారు.

గుణాధికాన్ముదం లిప్సేదనుక్రోశం గుణమాధమాత్‌

మైత్రీం సమానాదన్వి చ్ఛేన్నతాపై రభి భూయతే॥

అని భాగవతం ప్రబోధిస్తున్నది. అందుకే, ‘తనకన్నా ఎక్కువ గుణాలు కలవారిపట్ల ప్రసన్నతను, తక్కువ గుణాలు కలవారిపట్ల దయను చూపాలి. సమాన గుణాలు కలవారితో మిత్రత్వం చేయాలి. ఈ రకంగా మానవుడు దుఃఖాలకు దూరమవుతాడు.’  

విధి నిర్ణయాన్నిబట్టి తాను చేసుకొన్న కర్మల ప్రారబ్ధవశంలో లభించిన దానితో సంతృప్తిని పొందాలి. అలా పొందక పోవడమే దుఃఖం, అశాంతికి ప్రధాన కారణం. కనుక, ఎవరు లభించిన దానితో సంతోషపడతారో, తృప్తితో జీవిస్తారో వారు సంసారచక్రం నుండి బయటపడగలరు. 

యస్య యైద్దెవ విహితం స తేన సుఖదుఃఖయోః

ఆత్మానం తోషయన్‌ దేహీ తమసః పారమృచ్ఛతి॥

అని ‘భాగవత’ ప్రమాణం. వారివారి అధికారాన్ని బట్టి, ఎవరైతే వేదవిహిత కర్మలు ఆచరిస్తారో, సత్కర్మలతో భగవంతుని సేవిస్తారో వారికి ‘కర్మబంధం’ అంటదు. క్రమక్రమంగా చిత్తశుద్ధి కలుగుతుంది. దానితో ప్రధాన పురుషార్థమైన మోక్షం కూడా లభిస్తుంది. కనుక, వేదవిహిత కర్మలే శ్రేయస్కరం.


logo