శుక్రవారం 07 ఆగస్టు 2020
Devotional - Jul 08, 2020 , 09:16:40

ఇంద్రియాలలో పరమాత్మ ఉన్నాడా?

ఇంద్రియాలలో పరమాత్మ ఉన్నాడా?

‘అగ్నిర్య థైకో భువనం ప్రవిష్టో

రూపం రూపం ప్రతిరూపో బభూవ

ఏకస్త థీ సర్వభూతాంతరరాత్మా

రూపం రూపం ప్రతిరూపో బహిశ్చ’

- కఠోపనిషత్తు, (5-9)

సర్వవ్యాపకత్వమే పరమాత్మ ముఖ్య లక్షణంగా ఉపనిషత్తులు చెబుతున్నాయి. నచికేతునికి పరమాత్మ స్వరూపాన్ని తెలియజేస్తూ ఆచార్యుడు చెప్పిన మాటలు గమనింపదగినవి. ఇక్కడ అగ్ని అంటే విద్యుత్తు. అది స్థూల వస్తువులన్నిటిలో చేరి, ప్రతి వస్తువునకు గల రూపానికి అనుగుణంగా రూపాన్ని పొందుతుంది. అలాగే, పరమాత్మ కూడా ఒక్కడే ప్రపంచ పదార్థాలన్నింటిలో ప్రవేశించి ఉండటమే గాక వాటి రూపానికి అనుగుణమైన రూపాన్ని కలిగి ఉన్నాడు. అంటే, వస్తువులన్నిటిలో వ్యాపకుడై ఉన్నాడు. అయితే, పరమాత్మ కేవలం వస్తువుల లోపల మాత్రమే ఉన్నాడా? అంటే, కాదు. వెలుపల కూడా ఉన్నాడు. విద్యుత్తు వస్తుగతమైందే కానీ, వస్తువులకు అతీతమైంది కాదు. విద్యుత్తు ప్రపంచమంతటా ఉంటుంది.

కానీ, పరమాత్మ ప్రపంచానికి బయట కూడా ఉన్నాడు. ప్రపంచం లేని చోట కూడా ఉన్నాడు. అతడు లేనిచోటు లేదు. అగ్ని నుంచి పుట్టిందే విద్యుత్తు. అది జడ పదార్థమే కాని చైతన్యం (జ్ఞానం కలిగింది) కాదు. కానీ, పరమాత్మ పరమ చైతన్యం. ఒకవిధంగా రూపం గుణంగా కలిగిన అగ్ని ఎందులో ఉంటుందో దానికి రూపం ఉంటుంది. రూపం కలిగిన వస్తువులను మాత్రమే మనం చూడగలుగుతున్నామంటే, మన నేత్రేంద్రియం అగ్ని వల్ల తయారైంది కావడమే. మన నేత్రం (కన్ను) ఒక ఇంద్రియ గోళం మాత్రమే. అందులోని ఇంద్రియం అగ్ని. నేత్రేంద్రియంతో పాటు ఇతర శ్రవణేంద్రియం, ఘ్రాణేంద్రియం, రసనేంద్రియం, త్వగింద్రియం పరమాత్మతో నిర్మితమైనవే. ఒకదాని పని మరొకటి చేయదు. కన్ను చేసే పని చెవి చేయదు. అలాంటి కట్టడి సృష్టిలో ఉన్నది. దానికి కారణం పరమాత్మ అసమాన నైపుణ్యమే, లీలా విలాసమే.

మరి, తాను ఇంత నైపుణ్యంతో నిర్మించిన ‘ఇంద్రియాలలో పరమాత్మ ఉంటాడా?’ అంటే, ‘ఉంటాడనే’ సమాధానం. అంతేకాదు, ఆయన ఇంద్రియాలకు అతీతుడు, ఇంద్రియాలకు అగోచరుడు. పరమాత్మ మనస్సు కాడు. వేదాంతుల అభిప్రాయం ప్రకారం మనసుకు విషయమే కాడు. మనసుకు కూడా అందడు. అటువంటి వాడు వస్తువుల ఆకారాన్ని విద్యుత్తులాగా ధరిస్తాడని ఎలా చెప్పగలం? అంతటా, లోపలా, బయటా పరమాత్మ వ్యాపించి ఉంటాడని చెప్పడమే ఉపదేశకర్త ఉద్దేశ్యం. అందుకే, ఆచార్యుడు నచికేతునికి పరమాత్మ వ్యాపకత్వాన్ని సవివరంగా తెలిపాడు.

‘ఏకోవశీ సర్వభూతాంతరాత్మా 

ఏకం రూపం బహుధాయః కరోతి 

తమాత్మస్థం యే అనుపశ్యంతి ధీరా 

తేషాసుఖం శాశ్వతం నేతరేషామ్‌’

పరమాత్మ ఒక్కడే. అతనికీ ప్రపంచమంతా వశమై ఉంటుంది. అతడే నిర్మించాడు. కనుక, అంతటా అతడే వ్యాపించి ఉన్నాడు. అన్ని వస్తువులలో, అణువణువునా ఆయనే ఉన్నాడు. అణువులతో కూడి ఒక ముద్దగా ఉన్న ప్రకృతి ద్రవ్యంతో అనేక రూపాలు గల ప్రపంచాన్ని సృష్టించింది పరమాత్మనే. ఆ పరమాత్మను ధీరుడు (ధ్యానశీలుడు) తన ఆత్మలోనే దర్శించి ఆనందాన్ని పొందగలుగుతాడు. కేవలం రూపజగత్తును ఆశ్రయించడు. పరమాత్మ రూపజగత్తును నిర్మించినవాడే కానీ, రూపం గల వస్తువు కాడు కదా.

రూపరహితుడైన పరమాత్మ గురించే నాలుగు వేదాలు, సర్వశాస్ర్తాలు, తపశ్చర్యలు చెప్తున్నాయని, అతణ్ని ప్రసన్నం చేసుకోవడానికే బ్రహ్మచర్య వ్రతం పాటింపబడుతుందని, అతని పేరు ‘ఓమ్‌' అని కఠోపనిషత్తు వివరిస్తున్నది. ‘ఎవరు సూక్ష్మంలోకెల్లా సూక్ష్మమో, స్వయంగా ప్రకాశిస్తుంటాడో, యోగులకు సమాధి స్థితిలో తెలుసుకోదగినవాడో అతడే సర్వవ్యాపకుడు, రూపరహితుడైన పరమాత్మ’ అని మనుస్మృతి పేర్కొన్నది. భగవద్గీత ‘ఓమిత్యే కాక్షరం బ్రహ్మ’ (8-13) అని ‘సృష్టి స్థితి లయకారుడైన, ఓం కార స్వరూపుడే పరమాత్మ’ అని వర్ణించింది.


logo