సోమవారం 10 ఆగస్టు 2020
Devotional - Jul 07, 2020 , 00:12:49

ఆత్మశక్తితో ఆరోగ్యం!

ఆత్మశక్తితో ఆరోగ్యం!

‘భగవద్గీత’లో శ్రీకృష్ణ భగవానుడు మానవాళికి అనేక సందేశాలు ఇచ్చాడు. వాటన్నిటి ముఖ్యోద్దేశ్యం ‘మనిషి మానసిక దుర్బల స్థితినుంచి బయటకు రావడమే’. అప్పుడు ఆత్మబలాన్ని పాదుకొల్పుకొని, బుద్ధితో కార్యాలను నిర్వర్తిస్తాడు. ఫలితంగా విపత్తులను అధిగమిస్తూ, విజయాన్ని సాధించడం తేలికవుతుంది. గీతోపదేశాన్ని మొదలుపెట్టడానికి ముందే కృష్ణుడు, అర్జునుని నిరాశను ఖండించాడు. ‘క్షుద్రం హృదయ దౌర్బల్యం’ అంటూ, పార్థునిలోని ఆత్మశక్తిని మేల్కొలిపే ప్రయత్నం చేశాడు. ఇప్పటి కరోనా మహమ్మారిని తరిమికొట్టడానికి ఈ గీతాసందేశాన్ని ఒక అద్భుత అస్త్రంగా ప్రయోగించవచ్చు.

ప్రపంచంలో ఎన్నో మహమ్మారులు వ్యాపించాయి. అప్పటికి, ఇప్పటికి మానవులు ఎంతో పురోగతిని సాధించారు. ఇలాంటి సంక్లిష్ట సమయంలోనే హృదయ దౌర్బల్యానికి మనం తావివ్వకూడదు. అదే జరిగితే, యుద్ధంలో సగం ఓటమిని అంగీకరించినట్లే అవుతుంది. బదులుగా గుండె బలం నింపుకొంటే, పోరాటంలో సగం విజయం సాధించినట్టే. భగవద్గీత సమస్త మానవుల కోసం ఉద్దేశించిన అద్భుత ప్రామాణిక గ్రంథమని మనకు తెలిసిందే. ఇందులోని మూడవ అధ్యాయం, చివరలో అతిరహస్యమైన మనిషి అసిత్తంలోని నాలుగు అంశాల (దేహం, మనసు, బుద్ధి, ఆత్మ లేదా చైతన్యం) విశేషాలున్నాయి. వీటన్నిటిలోకెల్లా మహోన్నతమైన స్థానంలో ఉన్నది ఆత్మ. దానికింద వరుసగా బుద్ధి, మనసు, శరీరం ఉంటాయి.

‘శరీర ఆరోగ్యానికి వైద్యం చేస్తున్నా దానిపైన ఉండే మనసు స్థిమితంగా లేకపోతే, చింతకు గురవుతాం. ఆ రోగం నుంచి అంత త్వరగా బయటపడలేం. మనసు నిలకడగా ఉండాలంటే, దాని పైనగల బుద్ధిని చక్కగా ఉపయోగించాలి. బుద్ధి చురుకుదనం కోసమే మనం ఆత్మను ఆశ్రయించాలి’. ఇదే గీతా సందేశం. ఎప్పుడైతే, మనిషి ఈ మేరకు శరీరం, మనసు, బుద్ధి, ఆత్మ.. నాలుగింటినీ సరిగ్గా వినియోగించుకుంటాడో అప్పుడు రోగనిరోధకశక్తిని నాలుగింతలు పెంచుకొని, సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా వర్ధిల్లుతాడు. ఆహారం, విహారం (మానసికోల్లాసం), పనుల అలవాట్లు, నిద్ర.. వీటిని క్రమపరచగలిగిన వారు యోగసాధన ద్వారా భౌతిక క్లేశాలను తగ్గించుకోగలరని ‘భగవద్గీత’లోని ఆరవ అధ్యాయం ఉద్బోధించింది.

మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు బుద్ధి చురుకుగా పనిచేస్తుంది. బుద్ధిని ఖాళీగా ఉంచకూడదు. దానికి అనేక సకారాత్మక (పాజిటివ్‌) పనులను పురమాయించాలి. యుక్తమైన కర్మలను అప్పగించడమే బుద్ధికి మనం చెప్పే యోచమైన పని. కరోనా వైరస్‌ను ఎదుర్కొనడానికి ప్రభుత్వాలు నిర్దేశించిన నియమాలను పాటించడం వంటివన్నీ బుద్ధియుతమైన కార్యాల కిందికే వస్తాయి. ఈ గీతా మార్గదర్శకత్వం ద్వారా ప్రస్తుతం మానవాళి తమను పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి నుంచి బయటపడటమేకాక జీవితాంతం ఆరోగ్యవంతంగా, వందేళ్లు వర్ధిల్లుతారని ఆధ్యాత్మిక సాధకులు విశ్వసిస్తున్నారు.

సూర్యుడు ఒక్కడే సమస్త లోకాల్ని ప్రకాశింపజేస్తున్నట్టుగానే దేహంలోని ఆత్మ (చైతన్యం) దేహాన్నంతా ప్రకాశింపజేస్తుంది. ఆత్మబలాన్ని జాగృత పరచుకొన్నవాడు సాధించలేనిదంటూ ఏదీ వుండదు. భగవద్గీతలో శ్రీకృష్ణభగవానుడు, ‘ప్రకృతి తన అధీనంలోనే పనిచేస్తున్నదని’ చెప్పాడు. కనుక, శ్రీకృష్ణ పరమాత్మను మనమంతా శరణాగతి చేయడం ద్వారా ప్రకృతి తిరిగి శాంతించి, మనల నుంచి కరోనా మహమ్మారిని దూరంగా తీసుకొనిపోయే శుభఘడియ నిశ్చయంగా వస్తుంది. ఒకవైపు శారీరక స్థాయిలో వైద్యంపైన, రక్షణ ఏర్పాట్లపైన ఆధారపడుతూనే.. మరోవైపు మనసు, బుద్ధి, ఆత్మలను అన్నింటినీ గీతాసందేశం మేరకు సరిగ్గా వినియోగించుకోగలుగుదాం. అలా సంపూర్ణ ఆరోగ్యంతో ప్రపంచానికే మనం ఆదర్శవంతులమవుదాం.


logo