గురువారం 13 ఆగస్టు 2020
Devotional - Jul 06, 2020 , 02:13:41

అటు జ్ఞానసాధన, ఇటు మోక్షమార్గం చాతుర్మాస్య దీక్ష!

అటు జ్ఞానసాధన, ఇటు మోక్షమార్గం చాతుర్మాస్య దీక్ష!

ఆషాఢశుద్ధ ఏకాదశి (తొలి ఏకాదశి) నుండి కార్తీకశుద్ధ ఏకాదశి (తెల్లవారితే క్షీరాబ్ధి ద్వాదశి) వరకుగల నాలుగు నెలల కాలంలో అనుసరించే వ్రతదీక్షను ‘చాతుర్మాస్య’ వ్రతదీక్షగా వ్యవహరిస్తారు. ప్రాచీనకాలం నుండి పరిపూర్ణత్వ సాధన, జీవశ్రేయస్సు లక్ష్యంగా యతులు, అవధూతలూ, అనుష్ఠాన పరులైన గృహస్థులు పవిత్రంగా, త్రికరణశుద్ధితో దీనిని ఆచరిస్తున్నారు. ఈ క్రమంలో వారు సకల విఘ్న నివారణకై శ్రీకృష్ణ పంచకం, గణేశ, క్షేత్రపాలక, దుర్గ, సరస్వతి, అష్టదిక్పాలకులను పూజించి దీక్ష ప్రారంభిస్తారు. సన్యాసులు 4 నెలల కాలం ఆచరించే ఈ దీక్షను, గృహస్థులు మాత్రం భాద్రపద బహుళ పాడ్యమినుండి ఆరంభమయ్యే పితృపక్షాలలో శ్రాద్ధాదులు ఆచరించవలసిన కారణంగా ‘పక్షా వై శ్రుతి చోదనాత్‌' అనే ఆధారంతో నాలుగు పక్షాలకే పరిమితమవడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ వ్రతదీక్ష అభ్యుదయంతో కూడిన సంపదను పొందేందుకు, జ్ఞానసాధనకు, మోక్షమార్గానికి ఉపకరిస్తుందని శాస్ర్తాలు చెబుతున్నాయి. 

‘ఇతి తేన ఆషాఢశుద్ధ ఏకాదశ్యాం, పౌర్ణమాస్యాం వా ఆరంభః’ అన్న నిర్ణయసింధు సూక్తి ప్రకారం, ఆషాఢశుద్ధ ఏకాదశి లేదా పౌర్ణమినాడు చాతుర్మాస్య దీక్షను ఆరంభించవచ్చు. కానీ, ఎప్పుడు ఆరంభించినా కార్తీక శుద్ధద్వాదశి నాడే సమాప్తి చేయాల్సి ఉంటుంది.

‘ఆషాడే తు సితే ఏకాదశ్యా ముషోషితః

చాతుర్మాస్య వ్రతం కుర్యా ద్యత్కించి న్నియతో  నరః

వార్షికాం శ్చతురో మాసాన్వాహ యేత్కేనచి న్నరః

ప్రవతేన నోచే దాప్నోతి కిల్బిషం వత్సరోద్భ వమ్‌"

స్కాంధ, భవిష్యత్‌ పురాణాలలో పై శ్లోకరూపంలో చూపిన ప్రమాణం ప్రకారం.. ఎవరైతే చాతుర్మాస్య దీక్షను పాటించి విష్ణుమూర్తిని అర్చిస్తూ ఆయన విభూతులను, లీలలను స్మరిస్తూ, పురాణ పఠన శ్రవణాదులతో నిష్కామ వ్రతాన్ని ఆచరిస్తారో.. వారికి అష్టకష్టాలు తొలగిపోయి, ప్రగతి సుగతులు లభిస్తాయి. ‘ఈ వ్రతాన్ని ఎవరైతే తాము చేస్తూ, ఇతరులతో చేయిస్తారో వారంతా నా సన్నిధికి చేరుకుంటారని’ విష్ణుమూర్తి జ్ఞానసిద్ధునికి చెప్పినట్లుగా ఒక కథ ప్రచారంలో ఉన్నది.

తొలి ఏకాదశి నుంచి ఉత్థాన ద్వాదశి వరకు..

మనమిప్పుడు ఆరు ఋతువులుగా చెబుతున్న వాటి స్థానంలో ఒకప్పుడు వర్ష, హేమంత, వసంత ఋతువులు (మూడు) మాత్రమే వుండేవి. సంవత్సరంలో ప్రతి ఋతువూ 4 నెలలు ఉండేది. వర్షఋతువుతో మొదలయ్యే సంవత్సరంలో ఆషాఢం మొదటి నెలగా వచ్చేది. ప్రతి ఋతువు ఆరంభంలోనూ ఋతు లక్షణాన్నిబట్టి యజ్ఞయాగాదులు, వ్రతాదులూ ఆచరించేవారు. వర్షఋతువు ఆరంభంలో వాతావరణం కారణంగా ప్రజలకు అంటువ్యాధులు సోకే ప్రమాదం ఎక్కువ. కాబట్టి, ఈ చాతుర్మాస్య దీక్ష వేళ.. ‘కాలు బయట పెట్టవద్దనే’ నియమాన్ని విధించారు. అలాగే, తొలి ఏకాదశి (ఆషాఢశుద్ధ ఏకాదశి) నాడు మహావిష్ణువు క్షీరసాగరంలో యోగనిద్రకు ఉపక్రమించి కార్తీకశుద్ధ ద్వాదశి రోజున మేల్కొంటాడు. కనుకే, ఆషాఢశుద్ధ ఏకాదశిని ‘దేవశయన ఏకాదశి’గా, కార్తీకశుద్ధ ద్వాదశిని ‘దేవఉత్థాన ద్వాదశి’గా వ్యవహరిస్తారు. 

నాలుగు నెలలు ఆషాఢశుద్ధ ఏకాదశినుండి ఆరంభమైనా, ఆషాఢ పౌర్ణమిని ‘గురుపౌర్ణమి’గా జరుపుకుంటాం. గురుపౌర్ణిమకు చాలా ప్రాధాన్యం ఉంది. గురువును ‘యతి‘గానే భావిస్తాం. ‘యతి’ అంటే నిత్యమూ చరించేవాడు. ఒక్కరాత్రికి మించి ఎక్కడా విశ్రమించని వాడు. శాస్త్రంలో పేర్కొన్నట్లు వీరు సంచార మాధ్యమంగా ధర్మప్రచారం చేస్తుంటారు. సన్యాసాశ్రమం తీసుకునే సమయంలోనే ‘పుత్రేషణా, విత్తేషణా, లోకేషణా, సర్వేషణా మయా త్యక్తా, అభయం సర్వభూతేభ్యో మత్తస్వాహా’ అని ప్రతిన పూనుతారు. ‘సంతానంపైనా, ధనంపైనా, లౌకిక వ్యవహారాలన్నింటిపైనా నా కోరికలను వదిలివేసాను. ఏ ప్రాణినీ హింసించను. వాటికి అభయం ఇస్తున్నాను’ అన్నది దాని భావం.

సంపూర్ణ జీవన వికాసానికి మార్గం

భగవంతునిపైన మనసును లగ్నం చేయటమే చాతుర్మాస్య వ్రతంలోని ముఖ్యోద్దేశ్యం. కాబట్టి, ఈ కాలంలో సన్యాసులు, యతులు, పీఠాధిపతులు వంటి వారు తమ పర్యటనలను నిలిపిపేసి, ఒకచోటనే దీక్షతో అనుష్ఠానాలను కొనసాగిస్తారు. అక్కడే ధ్యానాదుల సాధనలతో కాలాన్ని జపతపాలకు, శిష్యులకు బోధించడానికి వినియోగిస్తారు. ‘నిజానికి 40 రోజులు ఏ విధానాన్ని పాటిస్తే, అది అలవాటుగా మారుతుందని’ మానసిక శాస్త్రజ్ఞులు చెప్తారు. అలాంటిది 4 నెలల కాలం నియమనిష్ఠలతో భగవద్ధ్యానంలో గడపడం వల్ల ఆధ్యాత్మికోన్నత భావాలు, ముక్తిదాయక లక్ష్యాలు స్థిరపడతాయి. ఈ రకంగా సాధకులకు సమగ్ర, సంపూర్ణ జీవన వికాసం కలుగుతుందని ఆధ్యాత్మిక వేత్తలు సూచిస్తున్నారు. సత్యం, ధర్మం తప్పని హరిశ్చంద్రుడు, తన భార్యకు, కుమారునికీ దూరమైనా... మరెన్ని అవాంతరాలు ఎదురైనా, చాతుర్మాస్య వ్రతాన్ని మరువలేదు. ఈ మహాత్మ్యం వల్లే ఆయన తిరిగి తన సామ్రాజ్యాన్ని, ప్రేయస్సు (ఇష్టమైన దానిని)ను, శ్రేయస్సును పొందినట్లు పురాణాలు వెల్లడించాయి. 

చాతుర్మాస్య దీక్షలో భాగంగా గురువు తన అనుష్ఠానాదులు పూర్తయ్యాక సత్సంగం నిర్వహిస్తారు. జిజ్ఞాసువులైన భక్తులకు భాగవత కథలనేకాక ప్రస్థాన త్రయంగా చెప్పే ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీతలను బోధిస్తారు. ‘ఆషాఢమాసంలో వర్షాలు పడుతవి. బావులు, నదులలో కొత్త నీరు చేరుతుంది. వాతావరణంలో పెద్ద మార్పు వస్తుంది. ప్రజల ఆరోగ్యానికి హాని కలగవచ్చు. క్రిమి కీటకాదుల సంచారం ఎక్కువవుతుంది. యతుల సంచారం వల్ల క్రిమి కీటకాదులకు, కీటకాదుల వల్ల యతులకు ప్రమాదం కలగవచ్చు. అలాంటి ప్రమాదాలను నివారించేందుకే వారు ఒకేచోట నిలకడగా వుండిపోయి, దీక్షగా ఈ నాలుగు నెలలూ గడపడం అన్నది నియమంగా మారింది.

పక్షిణాం బల మాకాశం, మత్స్యానా ముదకం బలం దుర్బలస్య బలం రాజా, బాలానాం రోదనం బలమ్‌ పక్షులకు ఆకాశంలోనే బలం. చేపలకు నీటిలోనే బలం. బలహీనులకు ప్రభువే బలం. శిశువులకు రోదనమే కార్యసాధనం.

నమోక్షో నభసః పృష్టే, పాతాళే నచ భూతలే తృష్ణా నాశేన ‘మనసః శాంతిః’ ‘మోక్ష’ ఇతి స్మృతః॥

మోక్షము ఆకాశంలో లేదు. పాతాళంలో లేదు. భూమి మీద కూడా లేదు. ఆశలు అంతరించడం ద్వారా  మనసుకు శాంతి లభించడమే మోక్షం.

గురువు అనుగ్రహంతోనే..


నిరీహులై (కోరికలు లేనివారై) ధ్యానమార్గంలో ఈశ్వరోపాసనలో కాలం సద్వినియోగ పరచుకొనే గురువును శిష్యుడు తన ఇంట్లో ‘చాతుర్మాస్య దీక్షను ఆచరించండి’ అని ప్రార్థిస్తాడు. అప్పుడు గురువు అనుగ్రహించి ఆ గృహస్థు ఇంట్లో తన వ్రతదీక్షను సమాచరించడం ఆనవాయితీగా వస్తున్నది. యతిధర్మం ప్రకారం దీక్షాపరుడు తనంతట తాను ఎక్కడా ఎక్కువ కాలం ఉండకూడదు. అందుకే, ‘శిష్యుడు అడగడం, గురువు ఆమోదించడం’ అంతవరకే. జ్ఞానానంద స్వరూపుడై దివ్యమైన వెలుగుగా తనలో ఆత్మరూపంలో ప్రకాశిస్తున్న పరమాత్మ సముద్రం వంటివాడు. అది అపారమైన జలనిధియే కాని, తాగే యోగ్యత ఎవరికీ ఉండదు. అదే నీరు ఆవిరిగా మారి మేఘరూపంలో వర్షిస్తే ఆ నీరు ఉపయుక్తమవుతుంది. అలాగే, భగవంతుడు అపారమైన వాడు. అతనిని ఉపయోగించుకునే యోగ్యతను సాధించాలి. దానికి ఎంతటివారికైనా గురువును ఆశ్రయించడం ఒక్కటే శరణ్యం.

భారతీయ ఆర్షసంస్కృతిలో గురువును ‘త్రిమూర్తుల సమష్టితత్త్వం’గా భావిస్తాం. అర్హత మేరకే మంత్రోపదేశం. ఈ రకంగా గురువు పునర్జన్మ నిస్తాడు, అప్పుడతడు బ్రహ్మ. మంత్రసాధనలో స్థితిగతులు కల్పిస్తాడు కనుక, విష్ణువు. ముందుకు సాగే క్రమంలో కలిగే విపత్తులను హరిస్తాడు కాబట్టి, హరుడు. శోధన, సాధన, బోధనలు లక్షణాలుగా కలిగిన గురువు.. పాత్రుడైన తన శిష్యునికి జ్ఞానధనాన్ని ‘ప్రదానం‘ (అనుగ్రహించడం) చేస్తాడు. శిష్యుడు అత్యంత భక్తిశ్రద్ధలతో దానిని పొందుతాడు (ఆదానం). ఈ ‘ప్రదాన-ఆదానాలు’ భారతీయ సంస్కృతిలో గురుశిష్య ధర్మాలుగా ఉన్నాయి 

కఠిన నియమ-నిష్ఠలు:

ఆధ్యాత్మిక చింతనతో ఆచరించే ఈ చాతుర్మాస్య వ్రతాన్ని స్త్రీ పురుష భేదం లేకుండా అన్ని జాతులవారు, అన్ని ఆశ్రమాలవారూ ఆచరించవచ్చునని మహాభారతంలో భీష్ముడు చెప్పాడు. ఈ చాతుర్మాస్య వ్రత ప్రాశస్త్యాన్ని పలు పురాణాలు ప్రముఖంగా పేర్కొనగా, వ్రత విధానాన్ని స్కంథ, భవిష్యోత్తర పురాణాలు వివరించాయి. ఆషాఢశుద్ధ ఏకాదశి రోజు ఉపవాసం ఉండి, వ్రతాన్ని ప్రారంభించాలని శ్రీకృష్ణుడే స్వయంగా ధర్మరాజుతో చెప్పినట్లు బ్రహ్మవైవర్త పురాణంలో ఉన్నది. ఆషాఢ పౌర్ణమినుండి శ్రావణ పౌర్ణమివరకు ‘శాక‘వ్రతాన్ని ఆచరించాలి. ఇందులో ఏ విధమైన ఆకుకూరలు తినకూడదు. శ్రావణ పౌర్ణమినుండి భాద్రపద పౌర్ణమివరకు ‘దధి‘ వ్రతాన్ని పాటించాలి. అంటే ఈ కాలంలో పెరుగు తినకూడదు. భాద్రపద పౌర్ణమి నుండి ఆశ్వీయుజ పౌర్ణమివరకు ‘క్షీర‘వ్రతాన్ని ఆచరించాలి. అప్పుడు పాలు, పాల పదార్థాలు తినకూడదు. చివరగా, ఆశ్వీయుజ పౌర్ణమినుండి కార్తీక పౌర్ణమి వరకు ‘ద్విదళ‘ వ్రతం (పప్పు పదార్థాలను తినకుండా ఉండటం) పాటించాలని శాస్ర్తాలు చెబుతున్నాయి.

దీక్షలో ఉన్నవారు ఈ నాలుగు మాసాలు తాము నివసించే గ్రామం ఎల్లలు దాటరాదు. కఠిన బ్రహ్మచర్యం పాటించాలి. సూర్యోదయం కన్నా ముందు నిద్ర లేచి యోగసాధన చేయాలి. స్నానాదులు ముగించడం, ఒక్కపూట (అదీ సాత్వికమైన) నియమిత ఆహారం భుజించడం, నేలపై నిద్రించడం, నిరంతర జపసాధన, ఇష్టదేవతోపాసన, అనుష్ఠానాదులు, దానధర్మాలు చేయడం, అహింసను పాటించడం, తపస్సాధన, హోమాదులు నిర్వహించడం, వేద పారాయణం వంటివి అత్యంత శ్రద్ధానిష్ఠలతో ఆచరించవలసి ఉంటుంది. ఇన్ని కఠిన నియమ నిష్ఠలతో కూడిన ఈ వ్రతదీక్ష సామాన్యులకు సాధ్యమా!


logo