ఆదివారం 09 ఆగస్టు 2020
Devotional - Jul 06, 2020 , 00:15:55

గురుదక్షిణ

గురుదక్షిణ

ఒకప్పుడు నిమి వంశంలో ఖాండిక్యుడు, కేశిధ్వజుడు రాజ్యకాంక్షతో యుద్ధం చేశారు. కేశిధ్వజుడు విజయం సాధించాడు. దాంతో ఖాండిక్యుడు అరణ్యంలో తలదాచుకున్నాడు. కేశిధ్వజుడు ప్రజల అభీష్టం మేరకు న్యాయంగా రాజ్యపాలన చేయసాగాడు. యజ్ఞయాగాదులు జరిపి, దేవతలను సంతృప్తి పరచడం వల్ల రాజ్యంలో మంచి వర్షాలు కురవడంతో పంటలు పండి సంపద ఉత్పన్నమైంది. రాజ్యం సుభిక్షంగా, సుస్థిరమైంది. ప్రజలూ సుఖశాంతులతో జీవించారు. అతని యశస్సు పరివ్యాప్తమైంది.

కేశిధ్వజుడు ఒకసారి యజ్ఞదీక్షలో ఉన్నాడు. అనుకోకుండా ఆతని యజ్ఞపశువును పులి తిని వేసింది. ‘యజ్ఞం భంగమవుతున్న సంకటస్థితిలో ఆ సమస్యకు పరిష్కారం చెప్పగలిగినవాడు ఖాండిక్యుడొక్కడేనని, ఆతనిని ఆశ్రయించమని’ ఋత్విజులు సూచించారు. ‘శత్రువును సహాయం కోరాలా? యజ్ఞాన్ని మధ్యలో ఆపాలా?’ అనే ధర్మసంకటస్థితిలో ‘అతనిని కలవాలనే’ నిర్ణయించాడు. ఒంటరిగా ఖాండిక్యుని ఆశ్రమానికి వెళ్ళాడు. చేతులు జోడించి విషయం చెప్పాడు. ఖాండిక్యుడు కూడా కేశిధ్వజుని సగౌరవంగా ఆహ్వానించి ప్రాయశ్చిత్తాదులను వివరించి పంపిస్తాడు. కేశిధ్వజుడు తన పట్టణానికి తిరిగి వెళ్ళి యజ్ఞాన్ని యథావిధిగా పూర్తి చేసి, అవబృథ స్నానం (యజ్ఞం సమాప్తమయ్యాక మంత్రబద్ధంగా భార్యాభర్తలు చేసేది) తర్వాత ముఖ్య పరివారంతో కలిసి ఖాండిక్యుని ఆశ్రమానికి వస్తాడు. కేశిధ్వజుని తిరిగి సాదరంగా ఆహ్వానించిన ఖాండిక్యుడు ‘వచ్చిన కార్యమేమిటని’ అనడిగాడు. దానికి కేశిధ్వజుడు, ‘మీ సూచన మేరకు యజ్ఞం సమాప్తమైంది. మీకు గురుదక్షిణ చెల్లించాలని వచ్చాను’ అన్నాడు మనస్ఫూర్తిగా. ఖాండిక్యుడు మంత్రులను పిలిచి సంప్రదించాడు. దానికి వారు, ‘అవకాశం వచ్చింది కదా, మొత్తం రాజ్యాన్ని కోరుకొమ్మని’ సలహా ఇచ్చారు. 

అప్పటికి ఖాండిక్యుని మానసిక స్థితి రాజ్యభోగాలపై లేకుండా పోయింది. ఆయన పొందాలనుకున్నది జ్ఞాన సంపద మాత్రమే. అందుకే, యోగవిద్యా సాధకుడు, జ్ఞానమార్గంలో పరిణతి చెందిన కేశిధ్వజునితో, ‘అయ్యా! యుద్ధంలో జయించి రాజ్యాన్ని పొందడం, సుస్థిరం చేసుకోవడం రాజధర్మం. మీ చేతిలో నేను ఓడిపోయి రాజ్యాన్ని పోగొట్టుకున్నాను. క్షాత్రం చూపి సాధించలేని రాజ్యాన్ని గురుదక్షణగా తీసుకుంటే అది నాలోని లోభత్వాన్ని పట్టిస్తుంది. అందువల్ల, గురుదక్షిణగా నాకు యోగవిద్యా రహస్యాలను ప్రసాదించండి’ అని ప్రార్థిస్తాడు. దానికి సంతోషించిన కేశిధ్వజుడు, ఖాండిక్యునికి ఆధ్యాత్మిక విద్యను, యోగవిద్యను ఉపదేశిస్తాడు. “అలాగే, బంధనాలకైనా, మోక్షానికైనా కారణమైంది మనస్సే కనుక, చంచలమైన మనసును మాలిమి చేస్తూ నీ వశం చేసుకో. ఇంద్రియాలు, మనసు ఎవరి ఆధీనంలో ఉంటాయో వారే యోగి కాగలరు’ అంటూ ఆధ్యాత్మిక రహస్యాలన్నీ వివరిస్తాడు. అంతేకాక, తాను గెలిచిన ఖాండిక్యుని రాజ్యాన్నికూడా తిరిగి ఇచ్చేస్తాడు. తానూ తన రాజ్యాన్ని తన కుమారునికి ఇచ్చేసి తాపసిగా జీవితం సాగిస్తాడు. 


logo