శనివారం 08 ఆగస్టు 2020
Devotional - Jul 06, 2020 , 00:15:55

ఉద్యోగ సిద్ధికి, పదోన్నతికి, అనుకూలతకు ...శ్రీ రాజమాతంగి నమ:

ఉద్యోగ సిద్ధికి, పదోన్నతికి, అనుకూలతకు ...శ్రీ రాజమాతంగి నమ:

భారతీయ జీవన విధానం అంతా కర్మ సిద్ధాంతంతో ముడిపడి ఉంది. కర్మ చేసేవారంతా కార్మికులే. మనం చేసే ప్రతి పనినీ కర్మ అనే పిలుస్తాం.  ఈ కర్మల నిర్వహణ ఒక ప్రత్యేక స్థాయికి చెందినదైతే దానిని ఉద్యోగం (ఉత్‌+యోగం) అంటాం. ‘ఉద్యోగం’ అంటే ఒక శ్రేష్ఠమైన యోగం. ఇది సామాజిక గౌరవంతో కూడుకున్న ఒక కార్యం. దీనివల్ల ధన సంపాదన, సామాజిక ఉన్నత జీవన విధానం ఉంటాయి. అందుకే, ప్రతి వ్యక్తి తాను ఉద్యోగం సంపాదించాలని కోరుకుంటాడు. 

మనం చేసే పనికంటే ఉన్నతమైన పని నిర్వహణ ద్వారా మరింత గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలోని ప్రమోషన్‌లు కూడా అటువంటివే. అవి సాధిస్తున్న కొద్దీ జీవన ప్రమాణాన్ని ఇంకా మెరుగుపరచుకోవచ్చు. కొందరికి తాము ఉద్యోగం చేసే ప్రదేశంలో తమ చుట్టూ ఉన్న వాతావరణం, సహచర ఉద్యోగులు, అధికారులు సహకరించక పోవచ్చు. అటువంటి వాతావరణం ధనాన్నిచ్చినా మానసికమైన ప్రశాంతతను అందించదు. ఉద్యోగం చేయడం, ఆ ప్రదేశంలో ప్రశాంతతను పొందడం, సామాజికమైన గౌరవాన్ని క్రమానుగతంగా పెంచుకోవడం ఎప్పటికీ అవసరమే. తాము ప్రభావవంతగా పనిచేయడమూ అవసరం. తక్కువ శ్రమతో ఎక్కువ సాధించడం కూడా అవసరమే. రాజకీయంగా పదవులలో ఉండేవారు కూడా తమ స్థాయిని పెంచుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు. తమ పైవాళ్ళ చుట్టూ తాము తిరుగుతూనే ఉంటారు. అదే విధంగా మన మనసు కూడా మనకన్నా గొప్పశక్తి చుట్టూ తిరుగుతుంటే ఈ లోకంలో మన స్థాయికూడా పెరుగుతుంది. 

తమలోని నిగూఢమైన చైతన్యంతో తాము నిరంతరం కలిసి ఉండాలి. ఆ చైతన్యాన్నే మనకు నిజమైన అధికారిగా గుర్తించాలి. సర్వవ్యాపి అయిన ఆ చైతన్యంతో మనం కలిసి ఉంటే మన ఉద్యోగ స్థానంలో మనం కూడా అందరిలోనూ విస్తరించి ఆనందంగా కాలం గడిపే అవకాశం కలుగుతుంది. ఆ చైతన్యాన్ని ‘మాతంగి’ రూపంలో ఆరాధిస్తుంటారు. ‘రాజ’ శబ్దం శ్రేష్ఠత్వానికి సంకేతం. ‘రాజు’ అంటే ‘శ్రేష్ఠుడు’ అనే అర్థం. రాజయోగాలంటే గొప్పవైన యోగాలే. అందుకే శ్రేష్ఠమైన చైతన్య భావనలో ‘రాజ మాతంగి’ అమ్మవారి ఉపాసనవల్ల మనకు కావలసినవి సాధించుకోవచ్చు. నిరంతరం ‘శ్రీరాజమాతంగి నమ:’ అనే జపాన్ని చేస్తూ ఉంటే, ఆ చైతన్యంతో మనసు నిరంతరం కలసిపోయి మన స్థాయిని, గౌరవాన్ని పెంచుతుంది. 


logo