శనివారం 08 ఆగస్టు 2020
Devotional - Jul 06, 2020 , 00:15:53

‘త్రిజ్యేష్ఠ’ నిషేధమా?

‘త్రిజ్యేష్ఠ’ నిషేధమా?

వధువు-వరుడు ఇద్దరు ఇంటికి పెద్దవాళ్లయినప్పుడు, జ్యేష్ఠమాసంలో వివాహం చేయకూడదంటారు. ఎందుకని? 

- చైత్ర, గజ్వేలు, సిద్దిపేట జిల్లా

జ్యేష్ఠాంగనా కరతల గ్రహణం నకుర్యాత్‌

జ్యేష్ఠర్జస్య పురుషస్యచ శుక్ర మాసే

చేదర్థ హాని కలహ ప్రథమాశు తద్వ

జ్జ్యేష్ఠాంగనా పురుషయోశ్చ పరస్పరంచ॥

ఇది ‘కాలామృతం’ తృతీయ బిందువులోని శ్లోకం. ఈ ప్రామాణికమైన నియమాన్ని అనుసరించి చూస్తే, శుక్రమాసం అంటే జ్యేష్ఠమాసంలో, జ్యేష్ఠా నక్షత్రంలో పుట్టిన పురుషునికి (వరునికీ), తొలిచూలుగా పుట్టిన అమ్మాయితో (వధువుతో) పాణిగ్రహణం (పెండ్లి) జరుపగూడదు. అలా జరిపినట్లయితే ఆ జంట ఎప్పుడూ పరస్పరం కలహించుకుంటూ ఉండి, ఆర్థికంగా కూడా నష్టపోతుంటారనేది ఈ శ్లోకంలోని భావం.

పెండ్లి అంటేనే నూరేండ్ల పంట. వధూవరులు ఉభయులకూ ఎల్లప్పుడూ శుభప్రదంగా ఉండాలనేదే వివాహ మహోత్సవం పరమార్థం. శాస్త్రం చెప్పిన ఈ సాంప్రదాయాన్ని అనుసరించి వధువు-వరుడు ఇద్దరూ ఇంటికి పెద్దవాళ్లయినప్పుడు, జ్యేష్ఠమాసంలో వివాహం జరపక పోవడమనేది ఓ సంప్రదాయంగా మారింది. వివాహంలో వధూవరులకు ‘త్రిజ్యేష్ఠ’ శబ్దం రాకూడదనేది ఒక నియమం. అంటే, వధూవరులు ఇద్దరూ తల్లిదండ్రులకు మొదటి సంతానంగా పుట్టిన వాళ్లయినప్పుడు జ్యేష్ఠమాసంలోగానీ లేదా జ్యేష్ఠా నక్షత్రంలోగానీ వివాహం జరుపగూడదన్నమాట.

వధూవరులిద్దరిదీ జ్యేష్ఠా జన్మనక్షత్రమైనప్పుడు, వాళ్ళలో ఒకళ్ళు తొలిచూలు వాళ్లయినా లేదా ఒకళ్ళది జ్యేష్ఠా జన్మనక్షత్రమై వధూవరులిద్దరు మొదటి సంతానమైనా లేదా వాళ్ళిద్దరిలో ఒకరిది జ్యేష్ఠా నక్షత్రమై, ఒకరు మొదటి సంతానమైనప్పుడు కూడా వారి పెండ్లిని జ్యేష్ఠమాసంలో చేయడం.. అంత శుభకరం కాదని శాస్ర్తాలు చెబుతున్నాయి. ఇలా, ‘త్రిజ్యేష్ఠ’ అనే మాటను వివాహ సుముహూర్త సందర్భాలలో నిషేధశబ్దంగా పరిగణిస్తున్నారు.


logo