బుధవారం 05 ఆగస్టు 2020
Devotional - Jul 06, 2020 , 00:14:36

విశ్వమే సంపూర్ణ ఆత్మ!

విశ్వమే సంపూర్ణ ఆత్మ!

ఒక తాతయ్య తన మనవన్ని ఓ తిరకాసు ప్రశ్న అడిగాడు. ‘బాబూ! ఒక కొలనులో ఒక పడవ ఉంది. దానిలో ఓ కోడి ఉంది. ఆ పడవలో ఒక గ్రాము బరువు అధికంగా ఉంచినా అది నీళ్లలో మునిగిపోతుంది. అలాంటి సందర్భంలో ఆ కోడి ఒక గుడ్డు పెట్టింది. అప్పుడు పడవ మునిగిపోతుందా? లేదా?’. ఇదీ ప్రశ్న. ఆ మనవడు మహాఘటికుడు. తాత ప్రశ్నను సులువుగా అర్థం చేసుకున్నాడు. ‘పడవ మునగదు తాతయ్యా’ అని బదులిచ్చాడు. ‘ఆహా! భలే సమాధానం ఇచ్చావు. ఎందుకో చెప్ప’మన్నాడు తాతయ్య. ‘అందులో ఏముంది తాతయ్యా! కోడి కడుపుతో ఉన్నప్పుడే ఆ పడవలో ఉందంటే ఆ కోడి, గుడ్డు రెండూ అంతకు ముందే పడవలో ఉన్నాయి. గుడ్డు కోడిని వదిలి బయటకు వచ్చిందంతే. పడవలో కొత్తగా ఏ బరువూ చేరలేదు కదా!’ అన్నాడు. తాతయ్య సంతోషంతో ‘శభాష్‌!’ అని మనవన్ని మెచ్చుకున్నాడు.

విశ్వం ఒక బ్రహ్మ పదార్థం. అది ఓ పట్టాన అర్థం కాదు. అయితే, ఉపనిషత్తుల్లో వేల ఏండ్ల క్రితమే విశ్వాన్ని విశ్లేషించారు. ‘ఆత్మనే విశ్వ స్వరూపాన్ని పొందుతుందని, తిరిగి విశ్వం ఆత్మ రూపాన్ని పొందుతుందని’ మన ఋషులు వివరించారు. పై ప్రశ్నలో పడవను మనం విశ్వంతో పోల్చవచ్చు. ఖగోళ పదార్థాలన్నీ ఆత్మలోనే దాగి ఉన్నాయి. ఆత్మనే పరిణమించి ఖగోళ పదార్థాలుగా మారుతున్నది. అలాంటి ఖగోళ పదార్థాలు ఆత్మలోనే ఉన్నా, ఒక దానితో ఒకటి ఆధారపడుతున్నా, వేటికవే స్వతంత్రంగా పనిచేస్తున్నాయి. ఎందుకంటే, అవి ఆత్మలోనే ఉండికూడా విభిన్న ఆకృతులను దాల్చి ఉండటమే. ఈ ఖగోళ వ్యవస్థలో భూమండలమంతా ఒక యూనిట్‌. ఈ యూనిట్‌లో ఎన్ని జీవులు ఉద్భవించినా భూమి తిరిగే వేగంలోగాని, దిశలోగాని మార్పు ఉండదు. ఎందుకంటే, అవి ఈ యూనిట్‌ ద్వారానే ఉద్భవించి, ఇందులోనే జీవించి, దీనిలోనే అంతరిస్తున్న జీవులు.

భూమండలంలో ఉత్పన్నమయ్యే పంచభూతాలేవీ భూమికి భారం కావు. ఎంత వర్షించినా భూమి భారంలో తేడా ఉండదు. ఎన్ని కోట్ల పిడుగులు పడినా భూమి స్వీకరిస్తూనే ఉంటుంది. అంతేగాక, దాని విద్యుదావేశం ‘సున్నా’గనే ఉంటుంది. సౌరకుటుంబమూ ఒక యూనిట్‌. ఇందులో ఒక గ్రహం పుట్టినా, నశించినా మొత్తం పదార్థంలోగానీ, భారంలోగానీ తేడా ఉండదు. మన పాలపుంతకూడా ఇలాగే ఒక యూనిటే. ఇలాంటి కోటానుకోట్ల గెలాక్సీలు స్వతంత్రంగానే ఉన్నాయి. ఇలా విశ్వంలో కోటానుకోట్ల గెలాక్సీలు స్వతంత్రంగానే ఉంటున్నాయి కూడా. ఈ ఖగోళ పదార్థాలన్నిటికీ మాతృకైన ఆత్మకూడా ఒక యూనిటే. ఇందులో ఎన్ని చర్యలు జరిగినా, ఎన్ని ఆకృతులు రూపొందినా, ఎన్ని నశించినా ఏ మార్పూ జరగదని మనం అర్థం చేసుకోవాలి.

ఈ అద్భుత విషయాన్ని మన పూర్వీకులు ఒక్క శ్లోకంలో నిక్షిప్తం చేశారు. ‘ఆత్మ ఒక సంపూర్ణమైన వ్యవస్థ. అందులోనే అన్నీ జరుగుతున్నాయి. ఆ సంపూర్ణ వ్యవస్థలోనుండి అంతే వ్యవస్థను తీసి వేసినా, కలిపినా ఆ సంపూర్ణ వ్యవస్థే మిగిలి ఉంటుంది’ అని ‘ఈశావాస్యోపనిషత్తు’లోని ‘శాంతిమంత్రం’ మనకు బోధిస్తున్నది. ‘పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్‌ పూర్ణముదచ్యతే / పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే॥’. ఇంత గొప్పసృష్టి వాస్తవికతను వేలఏండ్ల క్రితమే రెండు చిన్న వాక్యాలలో ఎలా గుదిగుచ్చారో అని ఆలోచిస్తే ఆశ్చర్యమేస్తుంది. అందుకే, భగవంతుడనీ, నామరూపాలను వల్లె వేయడం ద్వారా భగవతత్త్వం అర్థం కాదు, జ్ఞానం రాదు. భగవంతుని హృదయంలో నిక్షిప్తం చేసుకుని, తీక్షణతతో ఆలోచిస్తేనే ఆత్మ చిక్కుతుంది. అప్పుడు ఆత్మజ్ఞానం మన ఆలోచనలలో నిండిపోతుంది.


logo