శుక్రవారం 14 ఆగస్టు 2020
Devotional - Jul 04, 2020 , 00:53:29

యాదేవీ సర్వ భూతేషు!

యాదేవీ సర్వ భూతేషు!

భగవంతుణ్ణి అనేక రూపాలలో భావన చేస్తాం. ఏ రూపం లేని సృష్టి, స్థితి, ప్రళయకర్తగా అనుకున్నా మానవుడు ఆరాధన చేయడానికి తేలిక మార్గం భగవంతున్ని ‘భగవతి’గా భావించడమే. ఎందుకంటే, పోషకత్వం కలిగిన ఏ విషయాన్ని చెప్పాలన్నా దాన్ని ‘అమ్మ రూపకం’గానే భావిస్తాం. అన్నపూర్ణ అంటే స్త్రీ రూపం తప్ప, పురుషరూప భావన రాదు. ఎవరైనా ‘అమ్మా.. అన్నం పెట్టు’ అనే అడుగుతాడు. అది అన్నానికి, అమ్మకు వున్న సంబంధం. బిడ్డకు అమ్మకు ఉన్న పేగు బంధం. కనుకే, అమ్మను ‘బహ్మస్వరూపం’ అంటాం. అందుకేనేమో అన్నాన్ని ‘పరబహ్మ స్వరూపం’గానే తలుస్తాం.

యాదేవీ సర్వ భూతేషు  క్షుదా రూపేణ సంస్థితా

నమస్తస్తై నమస్తస్తై నమస్తస్తై నమో నమః

శంకర భగవత్పాదులంతటి వారు కాశీ పట్టణంలోని అన్నపూర్ణమ్మ దగ్గరికెళ్ళి ‘నాతోపాటు మూడు లోకాల ప్రాణులకు అన్నం పెట్టు తల్లీ’ అని అర్థించాడు. అందరినీ పోషిస్తూ నామరూపాత్మకమై ఎటువంటి ప్రయాస లేకుండా కనపడేదే మాతృ స్వరూపంగా వున్న పరదేవతా స్వరూపం. ‘ప్రకృతిం వికృతిం విద్యాం’ అని అమ్మవారి నామాలు ప్రకృతితో మొదలవుతాయి. అందుకే, ప్రకృతి స్వరూపిణియే అమ్మవారు.

శివాలయానికి వెళితే లింగం ఉంటుంది. అది ఒక రూపం. దాన్ని తత్వంతో మాత్రమే తెలుసుకోగలుగుతాం. కానీ, పక్కనే ఉన్న అమ్మవారు కరచరణాదులతో స్పష్టంగా దర్శనమిస్తుంది. ప్రకృతి విషయంలో అయోమయం, అస్పష్టత ఉండదు. ప్రకృతి అంటే గుట్టలు, చెట్లు మాత్రమే కాదు. పంచభూతాలు, గుణత్రయం, శరీరం, జన్మ, బుద్ధి, అవస్థ, మరణం.. చివరకు ప్రళయం వరకూ ఉండేదంతా ప్రకృతి. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఈ సృష్టి అనే నాటకంలో పరమాత్మ తెర వంటివాడైతే దానిపై ఎప్పటికప్పుడు మారే దృశ్యాలే ప్రకృతి.

ఏ భావ వికారం లేకుండా, ఏ మార్పు చెందకుండా, ఏది సత్యమో అది పరమాత్మ. దాన్ని ఆధారం చేసుకుని మార్పు చెందుతున్నదేదో అది ప్రకృతి. ఇది అసత్యాన్ని సత్యంగా భావింపచేసే మాయాతత్వం కలిగి దానితోపాటు పోషకత్వం వహిస్తూ, సమస్త జీవరాశినీ పోషిస్తున్నది. నామరూప విశేషాలతో స్పష్టంగా ఉండేదే ప్రకృతి. మన భారతీయ తత్వంలో ఋషి.. చెట్టును చెట్టుగా, భూమిని భూమిగా, నీటిని నీటిగా మాత్రమే చూడకుండా దానిలోని పోషకత్వమైన పరదేవతను దర్శించాడు. అందుకే, మనదీ అదే భావన. దాన్నే మనమూ అనుసరించాలి.      

నీటిని భవ స్వరూపంగా శివుడని చెప్పినా, భవాని అని అమ్మగానే తలుస్తాం. అందుకే గోదావరమ్మ, గంగమ్మ, కృష్ణవేణమ్మ అంటాం. ‘నీరే సమస్త దేవతలని’ వేదవాక్కు. అమ్మ కడుపులో పడుకొని వచ్చిన బిడ్డ శరీరం తల్లి శరీరంలో అంతర్భాగమే. అమ్మ శరీరం వెళ్లిపోయినా, అందులో ఒక భాగమైన బిడ్డ శరీరం తిరుగుతుంది కాబట్టి, అమ్మ వెళ్ళిపోయిందనేదే ఉండదు. అటువంటి అమ్మ నీటిలోనూ ఉంది. నీరు సృష్టి, స్థితి, ప్రళయ కర్త. ఆ నీటిని పవిత్రంగా, ప్రేమగా చూడాలి. లేకుంటే అమ్మ మనసు బాధ పెట్టడం ఎంత ప్రమాదకరమో ఇదీ అంతే. logo