మంగళవారం 04 ఆగస్టు 2020
Devotional - Jul 02, 2020 , 23:20:35

జగతః పితరౌ వందే!

జగతః పితరౌ వందే!

‘వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే

జగతః పితరౌ వందే పార్వతి పరమేశ్వరౌ!’

శబ్దం భావానికి ప్రతీక కాగా, భావం శబ్దం ద్వారా వెల్లడవుతుంది. రెండూ పరస్పరాధారితాలు. ఒకటి లేకుండా మరొక దానికి ఉనికి లేదు. అలా వాక్కు అర్థాల వలె ఒకే రూపంగా, సకల చరాచర జగత్తుకు తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులను భావిస్తూ నమస్కరించాడు కాళిదాసు మహాకవి! ‘పితరౌ’ అనడం ద్వారా ‘శివపార్వతులిద్దరిదీ ఏకరూపమే’ అని చెపుతున్నాడు.ఏకాకృతిలో ఒకరు దృశ్యమైనపుడు మరొకరు అదృశ్యంగా ఉంటారు. ‘ఈ దృశ్యా దృశ్యత వల్ల ఎవరిని ప్రధానంగా చెప్పలేమని’ అంటారు శంకరాచార్యులు.

ఈ అర్ధనారీశ్వరత్వంలో ఒకటి ప్రకృతి, రెండు పురుషుడు. ఈ రెంటి సంగమం లేదా కలయికయే సృష్టి. పార్వతిని ‘శివా’ అనీ అంటారు. పరమేశ్వరుని ‘శివ’ అంటారు. ‘శివం’ అంటే మంగళం, శుభం, ఆనందం. శరీరాలు వేరైనా భార్యాభర్తలు ప్రకృతి పురుషుల వలె ‘ఒకే మాటగా-ఒకే బాటగా’ ఆనందంగా జీవించాలని ప్రబోధిస్తున్నది అర్ధనారీశ్వర తత్త్వం. అలాగే, సృష్టికి ముందు అంతటా వ్యాపించిన ‘శక్తి’ ఒక్కటే. అదే ఈశ్వరత్వం. దానికి తన లాంటి మరికొన్ని ఆకృతులను సృజించాలనే సంకల్పం కలిగిందట. ఫలితంగా ఆ ఒక శక్తియే రెండుగా (స్త్రీ, పురుష శక్తులుగా) విభజితమైందట. ఈ రెంటి కలయికయే బహుళమైంది. ఒకటిగా ఉన్నప్పుడది ఏకం, సంకల్పం కారణంగా రెండుగా మారడం ద్వైతం. అనేకమైనప్పుడది బహుళం. ఏకత్వంలో ప్రకాశించే శివమే అనేకంలోనూ ప్రకాశిస్తున్నది. అదే సృష్టిలోని ప్రతి అణువులోనూ భాసించే ఈశ్వరత్వం.

ఏ పనినైనా, చిన్న-పెద్ద అనే భేద భావన లేకుండా, చిత్తశుద్ధితో నిర్వహించడమే సేవ. చేసే పనిలో ఆ పరమేశ్వర తత్త్వాన్ని దర్శిస్తూ ఉపాసనాభావనతో పూర్తి చేయడం సమర్పణ. సూర్యుడు అస్తమిస్తూ .. ‘నేను అస్తమిస్తే ఈ జగత్తుకు వెలుగును ఎవరిస్తారని’ అనుకున్నాడట. గుడిలోని చిన్న దీపం ‘నేనా బాధ్యత తీసుకుంటా’ అన్నదట. అర్చకుడు హారతి పడుతున్నాడు. గాలికా చిన్న దీపం రెపరెపలాడింది. భగవంతుడడిగాడట, ‘ఆరిపోయే ఈ హారతి వెలుగు బాధ్యతను ఎవరు తీసుకుంటారు?’ అని. ‘ఆ బాధ్యత నేను తీసుకుంటా’ అన్నాడు సూర్యుడు. దీపం సూర్యునికి కృతజ్ఞతలు తెలిపింది. సూర్యుడన్నాడు, ‘విశ్వమయుడైన విశ్వేశ్వరుని ప్రేమే నీలో నాలో వెలుగుగా ప్రకాశిస్తున్నది. నా బాధ్యత నీవు, నీ బాధ్యత నేను తీసుకోవడం ఆ ఈశ్వరుని సంకల్పంతోనే! పరస్పరాధారిత ప్రేమతత్త్వమే ఆ పార్వతీ పరమేశ్వర తత్త్వం’.

ఈ సృష్టిలో ఈశ్వర సంకల్పమే సామాన్యులు చేయదగిన పనిని అసమాన్యులతో, అసమాన్యుల కర్తవ్యాన్ని సామాన్యులతో చేయిస్తుంది. ‘చిరం యాచే శంభో, శివ తవ పదాంభోజ భజనం’ అంటూ ఆ పరమశివుని పాదాలను ఆశ్రయించడంతోనే ప్రగతియైనా, సుగతియైనా కలుగుతుంది. ‘సేవాభావనతో పరమేశ్వరుని ఏకాగ్రచిత్తంలో నిలిపి సమర్పణా భావనతో హృదయాన్ని అర్పించిన వారిని అనుగ్రహించమని’ ఆ అమ్మవారు అయ్యవారికి చెపుతుందట. ఆయన అనుగ్రహిస్తారట. అంతటి అనుగ్రహం మనందరికీ కలుగాలని ఆ పార్వతీ పరమేశ్వరులను ప్రార్థిస్తూ స్వస్తి.


logo