శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
Devotional - Jul 01, 2020 , 23:57:16

అన్నం పరబ్రహ్మ స్వరూపం!

అన్నం పరబ్రహ్మ స్వరూపం!

‘అన్నాద్వైప్రజాః ప్రజాయంతే 

అధో అన్నే నైవజీవంతి 

అన్నాద్భూతాని జాయన్తే 

జాత్యాన్నన్నేన వర్ధంతే....’ 

అంటుంది అన్నసూక్తం. ‘అన్నం ననింద్యాత్‌'. తినే అన్నాన్ని నిందించకూడదు. ‘తద్వ్రతమ్‌' అది నియమం. ఎందుకంటే, మన పూర్వీకులు అన్నాన్ని ‘పరబ్రహ్మ స్వరూపం’గా భావించారు, అర్చించారు. ‘అన్నం’ అంటే కేవలం తినే పదార్థమే కాదు. ప్రాణి పుట్టుకకు, ఎదుగుదలకు కారణం అన్నమే. మన శరీరంలోని ప్రతి భాగం ఒకప్పుడు మన తల్లిదండ్రులు తీసుకొన్న అన్నం వల్ల తయారైందే.

తల్లి గర్భంలో ఏకకణ మాత్రంగా పిండోత్పత్తి జరిగింది మొదలు ఈరోజు మనమున్న స్థితివరకు జరిగే పరిణామ క్రమానికి అంతటికీ మనం తీసుకొనే ఆహారమే మూలకారణం. ఆహారం వల్లే శారీరక నిర్మాణం సజావుగా జరుగుతుంది. ప్రాణం ఉన్నంత వరకు జరుగుతూనే ఉంటుంది. చర్మ మాంస రక్త మూత్ర పురీషాదులతో రాశీభూతమైన ఈ దేహం అన్నం నుండి ఉద్భవించింది. కనుకే, స్థూలదేహాన్ని ‘అన్నమయ కోశం’ అంటాం. అన్నం లేకపోతే ఇది నశిస్తుంది. ఉంటే జీవిస్తుంది. మెదడు, కండరాలు, రక్తం, ఎముకలు వంటివన్నీ ఆహారం వల్ల నిర్మితమైనవే. శరీరయంత్రాన్ని అలసిపోనివ్వక, క్రమం తప్పకుండా పని చేయించగల శక్తిని అందించి, నడిపించేది ఆహారమే. మానసిక స్థయిర్యాన్ని, భద్రతనీ కలిగించేది, రూపాన్ని, తేజస్సును ఇచ్చేది అన్నమే.

‘విశ్వంలోని సమస్త ప్రాణికోటికి శక్తిని, తేజస్సును, ధైర్యాన్ని ఇచ్చేది, సస్యసంపదలను వృద్ధి చేసే ఆహారాన్ని సృష్టించేది పరమాత్ముడే’ అని భగవద్గీత చెబుతున్నది. అంతేకాదు, ‘ఆ అన్నాన్ని నేనే. జీవులలో జఠరాగ్నిగా మారి జీర్ణం చేస్తున్నాను’ అనే శ్రీకృష్ణ భగవానుని వాక్యం మనకు ఆదర్శం. అహం వైశ్వానరో భూత్వా.. (భగవద్గీత. 15-14). జఠరాగ్నిలో జీర్ణం కాని ఆహారం ‘శక్తి’గా మారదు. ‘జీవించడం కోసమే తిండికానీ తినడానికే జీవించ కూడదు’ అన్నది ఛాందోగ్యోపనిషత్తు. ఆహారశుద్ధి వల్లనే సత్వశుద్ధి, దానివల్లే జ్ఞానసిద్ధి లభిస్తాయని ఉపనిషద్వాణి. ఆతిథ్య మర్యాదలలో భోజనాన్ని అందించడమూ ఒక భగవత్సేవ. ఆహారాన్ని భగవంతునికి నివేదించాకే స్వీకరించాలి. ‘అన్నదాతా సుఖీభవ!’ అన్న అతిథి అభ్యాగతుల దీవెనలో ప్రత్యక్షంగా భోజనప్రదాతకు, పరోక్షంగా భగవంతునికి, తోడుగా పంట పండించిన రైతుకు కృతజ్ఞతలు అందుతాయి. 

అన్నం తామసిక, రాజసిక, సాత్విక తత్త్వాలనుబట్టి ఎలా ఉంటుందో భగవద్గీత స్పష్టంగా చెప్పింది. అన్నాన్ని అమృతాయమానంగా స్వీకరించాలే తప్ప, ఎట్టి పరిస్థితులలోనూ నిందించరాదని మన సనాతన ధర్మం స్పష్టం చేసింది. దొరికిందల్లా, శుచీ శుభ్రత లేకుండా తినడం ఎంతటి అనర్థహేతువో, ప్రపంచానికి ‘కరోనా’ ఋజువు చేస్తున్నది. అప్పట్లో నిత్యాగ్నిహోత్రులకు, నిరతాన్నదాతలకు లోకంలో కరువే లేదు. డొక్కా సీతమ్మ, జిల్లెళ్లమూడి అమ్మలు ఇంటింటా కనబడేవారు. మన తెలంగాణలోని సిద్దిపేట జిల్లా మరుకూకు ‘శ్రీపాండురంగాశ్రమం’ వ్యవస్థాపకులు శ్రీభావానంద భారతీస్వామి తమ ఆశ్రమంలో నాదం (నిరంతర నామస్మరణం), సాదం (నిత్యాన్నదానం)లను ఒక కఠోరవ్రతం వలె అనుష్ఠించారు. అపర పండరీపురమన దగిన ఈ ఆశ్రమంలో ఆషాఢశుద్ధ ఏకాదశీ ఉపవాసం చేసి, ద్వాదశి రోజున వేలాదిమంది భక్తులు సహపంక్తిలో భుజించే సంప్రదాయం నేటికీ కొనసాగుతున్నది. 


logo