సోమవారం 06 జూలై 2020
Devotional - Jun 30, 2020 , 00:05:51

ధీరులే మహానాయకులు!

ధీరులే మహానాయకులు!

‘ప్రత్యర్థి భూతామపి తాం సమాధేః

శుశ్రూషమాణాం గిరిశో ను మేనే

వికారహేతౌ సతి విక్రయంతే

యేషాం న చేతాం సి త ఏవ దీరాః’

- మహాకవి కాళిదాసు (కుమార సంభవం)’

శివుడు తపస్సమాధిలో ఉండి, పార్వతి పరిచర్యకు అంగీకరించిన సందర్భంలోనిది ఈ శ్లోకం. తపస్సు (ధ్యానం)వేళ సాధకునికి ముఖ్యంగా కావలసింది ఏకాంతం. అంటే, మరెవరితోనూ సంబంధం లేని ప్రదేశం. ‘ఏకస్తపః ద్విరధ్యాయీ’ అనే సూక్తి ప్రకారం ‘తపస్సును ఒంటరిగా సాగించాలి. విద్యాభ్యాసం మాత్రం మరొక సహాధ్యాయితోకూడి జరపాలి’. గురుముఖతః విన్న పాఠాన్ని ఒక తోటి విద్యార్థితో కలిసి నెమరు వేసుకోవడం వల్ల అది మనసులో గట్టి పడుతుంది. కనుక, చదువును ఒంటరిగా సాగించరాదు. కానీ, తపస్సు అలా కాదు. సాధకునికి మరొకరు పక్కనుంటే నిష్ఠాభంగం కలుగుతుంది. అందువల్ల, తపస్వి ఒంటరిగా, ఏకాంతంలోనే సాధన చేయాలని మన పూర్వీకులు నిర్దేశించారు.

కానీ, పరిపక్వతను సాధించిన సాధకులకు ఈ సూత్రం వర్తించదు. ఎందుకంటే, వారు అందరితో మామూలుగా ఉంటూనే మానసికంగా స్థిరచిత్తులై ఉంటారు. సతీదేవి తండ్రినుండి తనకు లభించిన శరీరాన్ని యోగాగ్నితో భస్మం చేసుకోవడంతో ‘దక్షయజ్ఞం’ భగ్నమైంది. శివుడు హిమాలయంలో ఏకాంతంలో తపస్సుకు పూనుకొన్నాడు. ఆమె తర్వాతి జన్మలో పార్వతిగా హిమవంతునికి కూతురైంది. యుక్తవయసుకు వచ్చాక నారదమహర్షి, హిమవంతునితో ‘పార్వతి శివునికి భార్య కానున్నదని’ చెప్పాడు. హిమవంతుడు తన భూభాగంలో తపస్సు చేస్తున్న శివుని పరిచర్యకు కన్యకగా ఉన్న తన కూతురు పార్వతిని నియోగించాలని భావించాడు. అతిథేయుల కన్యల పరిచర్యలను అంగీకరించడంలో దోషమూ లేకపోగా, అది ఆచారం కూడా. హిమవంతుడు పార్వతిని వెంట బెట్టుకొని వెళ్లి, ఈ విషయాన్ని శివునికి తెలియజేశాడు. శివుడు ‘అది ధర్మమని’ భావించి అంగీకరించాడు.

ఏకాంతంగా మరొక మనిషి పొడ కానరాని విధంగా తపస్సుకు పూనుకొన్న శివుడు పార్వతి సాన్నిధ్యస్థితిని అంగీకరించవచ్చా? రెండవ వ్యక్తి, పురుషుడు కూడా తోడుగా ఉండని ఏకాంతంలో కదా శివుని తపస్సు సాగాలె? పార్వతి లోకోత్తర సౌందర్యవతి, యువతి. అయినా, ఆమె పరిచర్యను శివుడు అంగీకరించాడు. ఆ విధంగా ఆమె శివారాధనం ప్రారంభమైందన్నమాట. ఆమె రాకవల్ల శివుని తపస్సుకు ఏ విధమైన ఆటంకమూ కలుగలేదు. దీనికి కారణం, శివుని మనోనిష్ఠ, పార్వతి భక్తి. ఈ సందర్భంలో కాళిదాసుని బంధించిన లోకోక్తికి నిదర్శనమే పై శ్లోకం.

ఏకాంతవాసులకు ప్రపంచంతో సంబంధమే ఉండదు. కనుక, వారు తమ మనసును కట్టడి చేసి, తపస్సు సాగించడం సులభమవుతుంది. కానీ, అది ధీరుల లక్షణం కాదు. ధీరులైన వారు ఎటువంటి అవాంతరాలున్నా, మనోనిబ్బరంతో ధైర్యంగా తమ తపస్సును సాగిస్తారు. శివుడు ధీరుడు కనుక, పార్వతి ఉనికి ఆయన సాధనకు అడ్డు కాలేదు. కాంతా కనకాలకు లొంగకుండా, వికార హేతువులు ప్రబలమైనా సరే, నియమభంగానికి పూనుకోకుండా జీవితాంతం సాగినవారు అసలైన ధీరులవుతారు. వారినే చరిత్ర మరిచిపోదు. వారే మహానాయకులు.logo