మంగళవారం 14 జూలై 2020
Devotional - Jun 28, 2020 , 23:19:27

పరమగురువు..పరమాత్మ స్వరూపం!

పరమగురువు..పరమాత్మ స్వరూపం!

తల్లి జన్మనిస్తుంది. గురువు పునర్జన్మనిస్తాడు. తండ్రి జీవితాన్నిస్తాడు. గురువు జీవన్ముక్తికి తోవచూపుతాడు.  జీవితభాగస్వామి ఆనందాన్ని పంచుతుంది. గురువు అలౌకికానందాన్ని అనుగ్రహిస్తాడు. దేవుడు ఎంతో సాధన చేస్తే కానీ కటాక్షించడు. గురువు మాత్రం.. చేతులు జోడించగానే కరిగిపోతాడు. కరుణిస్తాడు. అతడి ఆశీస్సులు చాలు - భవసాగరాల్ని ఈదేయవచ్చు, ఈతిబాధల్ని  భరించవచ్చు. మరణభయాన్ని అధిగమించవచ్చు. ఆ  గురువులకు, సద్గురువులకు, జగద్గురువులకు,  పరమగురువులకు పాదాభివందనాలతో ‘గురుపూర్ణిమ’ ప్రత్యేక వ్యాసం.

-మనోజ్ఞ,  9391133249

మహోన్నతుడు పరమాచార్యుడు


అది కాంచీపురం. కామాక్షి దేవాలయం. శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి పూజామందిరం సమీపంలో ఆసీనులై ఉన్నారు.  మెడలో పూలమాలను ధరించి కూర్చున్నారు. సాధారణంగా భక్తులు సమర్పించిన మాలను ఒక్కక్షణం తలపై ఉంచుకొని తీసి, పక్కన పెడతారు. ధరించడం అరుదు. ఎదురుగా అమాయకంగా కనిపిస్తున్న ఓ యువకుడు ‘వినాయకుని వలెను బ్రోవవే’ అన్న త్యాగరాజ కృతిని ఆలపిస్తున్నాడు. అన్నీ అపశ్రుతులే! కానీ పరమాచార్యులు మాత్రం ఎంతో తాదాత్మ్యతతో ఆలకిస్తున్నారు. కీర్తన ముగిశాక ఆ యువకుడు అంతే అమాయకంగా ‘స్వామీ! నేను సరిగానే పాడానా?’ అని కుతూహలంతో అడిగాడు. అక్కడున్న భక్తులకు సంగీతంలో ఎంతోకొంత ప్రావీణ్యం ఉంది. అందుకే, స్వామి ఎలా స్పందిస్తారా అని ఆశ్చర్యంగా చూస్తున్నారు. అప్పుడు ఆ ‘నడిచే దేవుడు’ ఎంతో కరుణతో ‘నాకు బాగానే ఉంది. అదేగా నీకు కావలసింది’ అన్నారు. ఆ యువకుడు సంబరపడిపోయాడు. 

ఆ మహానుభావుడికి భక్తివైరాగ్యాలు తప్పితే సంగీతసాహిత్యాలు ప్రధానం కాదు! ఆ యువకుడితో ‘ఈ కీర్తన నా ముందు పాడాలని ఎందుకు అనిపించింది?’ అని అడిగారు. అప్పుడా యువకుడు  ‘స్వామీ! పాటలో అనాథ రక్షక శ్రీకామాక్షి’ అని వస్తుంది. ఈ అనాథను కాపాడే కామాక్షి స్వరూపులు మీరే కదా!’ అని జవాబిచ్చాడు. ఆ  మాటకు కదిలిపోయారు పరమాచార్యులు. ‘ఈ యువకుడు నాపై ప్రేమతో ఎన్నో మైళ్ళ దూరం నుంచీ వచ్చాడు. దారి ఖర్చులకు కూడా డబ్బులు లేవు. అతని పాట కన్నా అతని ప్రేమ నన్ను కదిలించింది’ అని భక్తులను ఉద్దేశించి చెప్పారు. అందరి సందేహాలూ తొలగిపోయాయి, కొందరి అజ్ఞానమూ.

పరుసవేది పరమహంస

అతడు బెంగాల్‌ నాటక రంగానికి కొత్త ఒరవడిని సృష్టించిన రచయిత, నాటకప్రయోక్త, దర్శకుడు. కానీ వ్యసనాలకు బానిస. యాదృచ్ఛికంగా ఓ రోజు దక్షిణేశ్వర కాళీ మందిరానికి వెళతాడు. మిత్రుల ప్రోద్బలంతో అక్కడి  పూజారిని కలుస్తాడు. ఆ పరిచయంతో మనోసీమలో సంచలనం రేగుతుంది. ఆ తరువాత పదేపదే అతడిని చూడాలనిపిస్తుంది. కొన్నాళ్ళకు ఆ పూజారినే తన గురువుగా భావించాడు. తన జీవనగతినే మార్చుకున్నాడు. ఆ నాటక ప్రయోక్తే గిరీష్‌ చంద్రఘోష్‌. ఇనుములాంటి ఆయనను బంగారంగా మార్చిన ఆ పరుసవేది... రామకృష్ణ పరమహంస. గిరీష్‌ చంద్రఘోష్‌ పశ్చాత్తాపంగా ఆ పరమహంసతో ‘బాబా! నేను మహాపాపిని. నాలాంటి దుష్టాత్ముడిపై మీకెందుకు ఇంత కరుణ?’ అని ప్రశ్నిస్తారు. అప్పుడు రామకృష్ణులు ‘ఒక గదిలో వేయి సంవత్సరాలుగా ఉన్న చీకటిని పారదోలటానికి  చిన్న దీపం వెలిగిస్తే  చాలు. 

అందుకు వేయి సంవత్సరాలు పట్టదు కదా!’ అని ఉత్తేజపరిచారు. గురువు  తన శిష్యుడిలో ఎంతటి మార్పును తీసుకురాగలడో చెప్పడానికి  గిరీష్‌ జీవితమే నిదర్శనం. అందుకే రామకృష్ణులు ‘సద్గురువు సాంగత్యంలో శిష్యుడి బతుకే మారిపోతుంది. గొప్పగురువు నాగుపాములాంటి వాడు. కపటమైన గురువు నీటిపాము లాంటివాడు. కప్ప నాగుపాము నోటిలో పడితే, ఒక్క క్షణంలో దాని పని అయిపోతుంది. నీటిపాము నోటిలో పడితే మాత్రం, అటు మింగ లేక ఇటు కక్కలేక.. రెంటికీ ఇబ్బందే. అలాగే సద్గురువు చేతిలో పడితేనే ఆ శిష్యుడికి సద్గతి. కపటగురువు పాలిన పడితే ఇద్దరికీ అపాయమే’ అంటాడు.

మలయాళ యతీంద్రులు

వేదాంత తమోభాస్కరులు మలయాళస్వామి. ఒకసారి ఆయన శిష్యులలో ఒకరు మౌనవ్రతం చేపట్టాలని సంకల్పించారు. దానికి స్వామి అంగీకరించారు. ఆశ్రమంలోనే  శిష్యుడికి అనువైన ఏర్పాట్లు చేశారు. రెండు రోజులు గడిచిపోయాయి. ఆ శిష్యుడు మౌన వ్రతంలోనే ఉంటున్నాడు. కానీ దినచర్యలో మార్పు లేదు. ఏదో ఒక రకంగా ఆశ్రమంలో నిత్య వ్యవహారాలు కొనసాగిస్తూనే ఉన్నాడు. తను చెప్పాలనుకుంటున్న ప్రతి విషయాన్ని కాగితం మీద రాసి చూపిస్తూ పనులు చక్కబెడుతున్నాడు. కొన్నిసార్లు సైగలతో  ఆదేశాలు ఇస్తున్నాడు. ఆ శిష్యుడి వైఖరిని గమనించిన స్వామి ‘మౌనవ్రతమంటే ఇది కాదు. మాటలనే కాదు మనసునూ కట్టడి చేయాలి. అదే మౌనదీక్ష. మనోశరీరాలను నిలకడగా ఉంచాలి. నియమనిష్టలలో రాజీపడకూడదు’ అని సూచించారు. జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల ‘భజ

గోవిందం’లోని...

ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యానిత్య వివేకవిచారం జాప్యసమేత సమాధి విధానం కుర్వవధానం మహదవధానం ॥

-ప్రాణాయామం చేయాలి. ప్రత్యాహారాన్ని పాటించాలి. నిత్యానిత్య వస్తు విచారణ చేస్తూ, నామజపంతోపాటు ధ్యానం చేయాలి. సమాధిస్థితిని పొందే విధానాన్ని అతి మెలకువతో అభ్యసించటమే కాదు. జాగ్రత్తగా అనుసరించాలి’ అన్న శ్లోకాన్ని గుర్తుచేశారు. మలయాళస్వాములు జన్మతః ధ్యానసిద్ధులు. సంస్కృత భాషపై అపారమైన మక్కువ. గురుకులంలో వేదవేదాంగాలను అధ్యయనం చేశారు. తిరుమల గోగర్భ క్షేత్రంలో పన్నెండు సంవత్సరాలు కఠిన తపమాచరించి నిరతిశయానంద ప్రాప్తిని పొందారు. తరువాత చిత్తూరు జిల్లా ఏర్పేడులో శ్రీవ్యాసభగవానుని పేరుతో ఆశ్రమం స్థాపించి, ధర్మప్రచారం చేశారు. గీతాసారాన్ని సరళంగా బోధించారు. 

‘ఆత్మజ్ఞానం’ షిర్డీసాయి తత్వం 

సాయిబాబా గురించి ఆ నోటా ఈ నోటా విన్న ఓ శ్రీమంతుడు షిరిడీకి వచ్చాడు. సాయి పాదాలకు సాష్టాంగ ప్రణామం చేసి ‘బాబా! ఇక్కడకు వచ్చిన వారి కోర్కెలన్నీ మీరు తీరుస్తారట కదా! నాకు అన్నీ ఉన్నాయి. కానీ ఆత్మజ్ఞానమే కొరవడింది. అదేదో త్వరగా ఇప్పిస్తే మీ సాయం మరచిపోను’ అన్నాడు. అప్పుడు బాబా ‘చాలా మంచిది. తప్పకుండా ప్రసాదిస్తాను’ అంటూ పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఓ బాలుడిని పిలిచి ‘బాబూ! మార్వాడీ వద్దకుపోయి నేను అడిగానని చెప్పి ఓ అయిదు రూపాయలు చేబదులు తీసుకురా?’ అని పంపారు. కుర్రవాడు తిరిగి వచ్చి, మార్వాడీ ఇంటికి తాళం వేసి ఉందని చెప్పాడు. రెండుమూడు చోట్లకు పంపినా  ఎక్కడా అయిదు రూపాయలు పుట్టలేదు. ఆ వ్యాపారి మాత్రం జేబులో నుంచి ఒక్క నోటు కూడా తీయలేదు. అప్పుడు బాబా నవ్వుతూ ‘నాయనా! నాపై నమ్మకం లేక, అయిదు రూపాయలు తీసి ఇవ్వటానికి నువ్వు ఇంతగా ఆలోచిస్తున్నావు. ఇలాంటి నిన్ను నమ్మి ఆత్మజ్ఞానాన్ని ఇవ్వగలనా? వ్యామోహాలు వదులుకోనిదే ఏ ఆత్మ జ్ఞానమూ సాధ్యం కాదు’ అన్నాడు.

అద్వైతమూర్తి రమణ మహర్షి

ఒకసారి, మైసూరు మహారాజు రమణ మహర్షి ఆశ్రమానికి వచ్చారు. పది నిమిషాల పాటు మహారాజు భగవాన్‌ వైపు చూసి చివరకు సాష్టాంగ ప్రణామం చేశారు. గురువు పాదాలపై జలజలా కన్నీళ్లు రాల్చారు.  ‘నన్నొక మహారాజుని చేసి సింహాసనానికి బంధింపచేశారు. రాజుగా పుట్టిన పాపానికి మీ పాదాల వద్ద కూర్చొని, వీళ్లందరిలా మీ దివ్యసన్నిధిలో శిష్యుడిగా సేవ చేసుకునే అవకాశాన్ని పోగొట్టుకున్నాను. మళ్ళీ నేను వస్తానో లేదో కూడా తెలియదు.  ఈ కొద్ది నిమిషాలే నా సొంతం. మీ అనుగ్రహాన్ని వేడుకుంటున్నాను’ అని ప్రార్థించారు. అప్పుడు రమణుల సమాధానం.. ‘ప్రతివాళ్లూ నేను ఇక్కడ ఉండే భక్తులకి, శిష్యులకి ఏదో ప్రత్యేకమైన అనుగ్రహాన్ని ఇస్తున్నానని అనుకుంటారు. అటువంటి పక్షపాతమే ఉంటే ఎవరైనా గురువు ఎలా అవుతారు?  శరణు జొచ్చిన శిష్యుడు ఏదీ అడగనూ అవసరం లేదు. ఎక్కడున్నా అన్నీ అందుతూనే ఉంటాయి. కప్ప తామరపువ్వుకి దగ్గరగానే ఉంటుంది. అయినా ఏం లాభం? మకరందాన్ని ఆస్వాదించేది ఎక్కన్నుంచో వచ్చిన తేనెటీగ కదా!’ అన్నారు.


logo