సోమవారం 06 జూలై 2020
Devotional - Jun 28, 2020 , 23:12:34

‘సుగ్రీవాజ్ఞ’లోని మతలబు?

‘సుగ్రీవాజ్ఞ’లోని మతలబు?

ప్రశ్న: ‘సుగ్రీవాజ్ఞ’ అని ఎందుకంటారు?

- మైరా, గచ్చిబౌలి

రామాయణంలో ‘మధువనం’ ధ్వంసం చేసే ఘట్టం ఉంది. నిజానికి ఆ వనమెంతో సుందరమైంది. పై ప్రశ్నకు ఈ వన ధ్వంసానికి ఒకింత సంబంధం ఉంది. ‘ఎవరి మానసిక పరిస్థితికి తగినట్టుగా వారు ప్రవర్తిస్తారని’ మనోధర్మాన్ని చక్కగా తెలియజేసే ఘట్టంగా దీనిని చెప్పాలి. ‘సుగ్రీవాజ్ఞ’ అనేది ప్రజల నోళ్లలో నానే ఒక ‘జాతీయం’. రామ-సుగ్రీవులు ఒక ఒప్పందం కుదుర్చుకుంటారు. దాని ప్రకారం, వాలిని రాముడు హతమార్చి సుగ్రీవుడికి రాజ్యం ఇవ్వడం, సుగ్రీవుడు తన వానర సైన్యంతో సీతమ్మను వెదికి పెట్టడం. ఈ మేరకు సుగ్రీవుడు ‘వానర వీరులందరినీ పిలిపించమని’ హనుమంతుడిని ఆజ్ఞాపిస్తాడు. 

‘పది రోజులలోగా వారంతా తిరిగి రాకుంటే వాళ్లకు మరణదండన విధిస్తాననీ’ చెప్తాడు.  హనుమంతుడు ఈ విషయం వానరులందరికీ చెప్తాడు. వారంతా కిష్కింధకు చేరుకున్నారు. ఎందుకంటే, అది సుగ్రీవుని ఆజ్ఞ! ఆ ఆదేశానికి తిరుగులేదు. కారణం, సుగ్రీవుడు అంత చండశాసనుడు. క్రమశిక్షణకు మారు పేరు. ఈ సంగతి హనుమంతునితోసహా అందరికీ తెలుసు. అయినా, ‘ఆ మధువనాన్ని అలా ఎలా పాడు చేశారు?’ అన్న సందేహానికి ‘రాజు పంపిన పనిలో అసాధారణ విజయం సాధించి, ఆ ఆనందం తట్టుకోలేక అలా చేసి ఉంటారని’ సుగ్రీవుడు గ్రహిస్తాడు. ఎందుకంటే, అంతులేని క్రమశిక్షణ పాటించే వానర సైన్యం, సీతమ్మను వెదకడంలో విజయం సాధించి, ఆటవిడుపుగా ఇటువంటి పనులు చేశారని సుగ్రీవునికి అర్థమైంది. సుగ్రీవుని పాలనలో క్రమశిక్షణ, పరేంగిత జ్ఞానం, పట్టు విడుపులు ఉంటాయి.

‘పరేంగిత’ అంటే మానవులకు, పశుపక్ష్యాదులకు ఆహారం, నిద్ర, భయం, కామం సమాన ధర్మాలు. అయితే, పండితులకు ఇతరుల మనసులో ఏముందో తెలుసుకునే బుద్ధికుశలత ఉంటుంది. సుగ్రీవుడు పండితుడు. అతనికి ఇతరుల మనస్సులలోని భావాలు తెలుస్తాయి. ఈ జ్ఞానం పరిపాలనకు ముఖ్యం. అందుకే, వానరులు మధువనం ధ్వంసం చేసినప్పుడు, ‘వారు సీతమ్మ జాడ కనుక్కొని ఆ విజయంతో అలా చేశారని గ్రహించగలిగాడు. ఇన్ని సుగుణాలున్న సుగ్రీవుడు ఆజ్ఞాపిస్తే దానిని అందరూ శిరసావహిస్తారు. అలా ‘సుగ్రీవాజ్ఞ’ అన్నది పలుకుబడిగా ఏర్పడింది. 


logo