సోమవారం 06 జూలై 2020
Devotional - Jun 28, 2020 , 23:12:34

శ్రీదత్త శరణం మమ!

శ్రీదత్త శరణం మమ!

నమస్తే భగవన్‌ దేవ దత్తాత్రేయ జగత్‌ ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్ఛమే॥

దత్త శబ్దానికి ‘ఇవ్వడం’ అని అర్థం. దత్తాత్రేయ అవతారం ‘అన్నీ అందరికీ అందించిన భావానికి’ ప్రతిరూపం. ఈ ప్రకృతి అంతా దత్తునికి ప్రతిరూపం. త్రిమూర్త్యాత్మక స్వరూపం దత్త స్వరూపం. సృష్టి స్థితి లయలకు సంకేతమైంది. భూత వర్తమాన భవిష్యత్‌ కాలాలకు సూచిక ఈ తత్త్వం. జ్ఞానానికి ప్రతీక. ప్రకృతిలో ప్రతి అంశంలో చేరి దాని స్వరూపాన్ని మనకు తెలియజేసే శక్తి ‘దత్తాత్రేయుడు’. జ్ఞాన భావనతో మార్గదర్శనం చేసే స్వరూపం కావడం వల్ల దత్తుడు గురువులకే గురువు అయ్యాడు.   ఈ లోకంలోకి వ్యక్తి వచ్చినప్పటి నుండి ప్రతి విషయాన్నీ నేర్చుకోక తప్పదు. తల్లినుండి, తండ్రినుండి, బోధకులనుండి, స్నేహితులనుండి, పంచభూతాల నుండి, చుట్టూ వున్న సమస్త జీవ, నిర్జీవ రాశులనుండి, ఈ విశ్వం నుండి నిరంతరం కొత్త విషయాలను నేర్చుకుంటూనే ఉంటాం. నేర్పు ద్వారా జ్ఞానం కలుగుతుంది. 

దాన్నే మనం ‘నైపుణ్యం’ అంటాం. దీనిని సాధించిన వారు తరువాతి తరాల వారికి మార్గదర్శనం వహిస్తారు. ఇది ఒక పారంపర్య ప్రక్రియ. దీనికి స్వరూపమైన తత్త్వమే ‘దత్తతత్త్వం’. అందుకే దత్తాత్రేయ స్వామిని గురువుగా భావిస్తుంటాం. మనకు సమస్యలు ఏర్పడినప్పుడు పరిష్కార శక్తికోసం, మార్గదర్శనం కోసం, సరైన నిర్ణయం కోసం కొంతసేపు ‘శ్రీదత్త శ్శరణం మమ’ అనే జపం చేస్తూ ఉంటే, అన్ని సమస్యలకూ మంచి పరిష్కారం లభిస్తుంది. ప్రకృతి ఏదో రూపంలో సహకరించి మనల్ని కాపాడుతుంది. 


logo