గురువారం 06 ఆగస్టు 2020
Devotional - Jun 28, 2020 , 23:12:31

రాజా ప్రజానామ్‌ హృదయమ్‌

రాజా ప్రజానామ్‌ హృదయమ్‌

భారతీయుల జీవన విధానాన్ని ఒక ప్రామాణికమైన మూసలో ఇమడ్చడం కోసం నాలుగు వేదాలతో సమానమైన ఐదవ వేదం మహాభారత గాథను వేదవ్యాస మహర్షి అందించిన విధానం అద్భుతం. సామాజిక వ్యవస్థ గతి తప్పకుండా, పాలకునికి- ప్రజలకు మధ్య ఏ అపోహలకూ తావు లేకుండా వుండేలా ఒక పటిష్ఠమైన ‘పాలనా వ్యవస్థ’ ఆ కాలం నాటికే ఏర్పడింది. పాలకుడు, ప్రజలు ఏయే నియమాలను పాటించాలో, వాస్తవిక దృక్పథంతో, నిర్దిష్టంగా సూచించింది. ఇతివృత్తంలో భాగంగా నిర్దేశితమైన రాజధర్మాలలో చాలావరకు అన్ని కాలాలకూ పనికి వచ్చేవే ఉండటం విశేషం. వ్యాస మహాభారతంలోని శాంతిపర్వంలో భీష్ముడు ధర్మరాజుకు, ఆదిపర్వంలో కణికుడు దుర్యోధనునికీ, సభాపర్వంలో నారదుడు ధర్మజునికీ ఉద్బోధించిన అంశాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోదగ్గవి.

పాలకునికి ప్రజలు శరీరమైతే, వారికి పాలకుడు ఆత్మవంటి వాడు. ‘రాజా ప్రజానామ్‌ హృదయమ్‌ గరీయో గతిః ప్రతిష్ఠా సుఖముత్తమంచ॥’ (శాంతిపర్వం, అధ్యాయం: 68). పాలకుడు ప్రజలకు రక్షగా నిలుస్తుంటే ప్రజలు అతనిని అభిమానిస్తూ, ఆరాధిస్తూ వుంటారు. పాలకుడు, ప్రజలూ ఎల్లప్పుడూ పరస్పర అభిమానులై మెలుగుతుండాలి. పాలకుడు ముందుగా తన అంతశ్శత్రువులైన ‘కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాల’ను అధిగమించాలి. అప్పుడే శత్రుపక్షాలను సమర్థవంతంగా జయించగలుగుతాడు. ‘ఆత్మా జ్ఞేయః సదా రాజ్ఞా తతో జేయాశ్చ శత్రవః’. దేశానికైనా, రాష్ర్టానికైనా సమర్థుడైన పాలకుడు లేకపోతే, ‘నీళ్ళింకి పోయిన మడుగులోని చేపలకు పట్టిన గతే ఆ ప్రజలకూ పడుతుంది’. అసమర్థ పాలకునివల్ల ప్రజలు అనాథలవుతారు.

పాలకుణ్ని ప్రజలు తమ గురువుగా, దైవంగా భావించాలి. వారు ఆ గురువు ఆజ్ఞలను తు.చ. తప్పక పాటించాలి. అప్పుడే యావన్మందికీ మేలు జరుగుతుంది. అలాగే, ప్రభుత్వ భద్రత అన్నది లేకపోతే ప్రజాధనానికి రక్షణ ఉండదు. ఏ వ్యక్తి అయినా సరే, అత్యున్నత పదవిలో ఉన్నప్పుడే ‘తనకా పదవి అస్థిరమైందనీ, అశాశ్వతమైందనే’ సత్యాన్ని గుర్తెరగాలి. అప్పుడు వారు ఒకవేళ ఆ పదవికి దూరమైనా వ్యక్తిగతంగా ఏ బాధ/దుఃఖం ఉండవు. పాలకుడు ఎల్లవేళలా ఆత్మరక్షాపరునిగా ఉండాలి. కేవలం ‘కార్యసాధనా దృష్టితో మాత్రమే’ మెలగాలి. కార్యనిర్వహణను కాలోచితంగా, సమయం వచ్చినప్పుడే తత్ఫలితాలను ఆశిస్తుండాలి. తనకు ఇష్టం లేని పనిని చేయవలసి వచ్చినప్పుడు.. పరిస్థితులు అనుకూలించేంత దాక ఆ పనిని వాయిదా వేయడం ఉత్తమం. పరిపాలనా వ్యవహార దక్షుడైన పాలకునికి వార్తా సేకరణ చాలా ముఖ్యం. 

‘వార్త యందు జగము వర్ధిల్లు చుండును..’. ఎల్లవేళలా అతడు జనానురంజకమైన విధానాలను అవలంబిస్తూ, వారి సంపదలను ఆశించకుండా, ప్రజలతో సఖ్యతగా ఉండాలి. తన మేలునూ, కీడునూ స్వయంగా యోచించుకుంటూ హితుల మాటలను పాటిస్తుండాలి. ముఖస్తుతులకు తలొగ్గకూడదు. అక్రమార్జనాపరుల సంపదలను స్వాధీనం చేసికొని, వాటిని సద్వినియోగ పరుస్తుండాలి. తన ఆరోగ్య విషయాలలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. దైవకార్యాలలో ఆసక్తిని కనపరుస్తుండాలి. అన్ని కాలాలకూ పనికి వచ్చే, వర్తించే ఇలాంటి ధార్మిక విషయాలెన్నో మహాభారత కథలలో అంతర్లీనంగా మనకు కనిపిస్తాయి.

తాజావార్తలు


logo