శనివారం 15 ఆగస్టు 2020
Devotional - Jun 28, 2020 , 00:06:15

దేవుళ్లను మేల్కొల్పిన కవి

దేవుళ్లను మేల్కొల్పిన కవి

  • జాగృహిత్వం మహాదేవ! 
  • జాగృహిత్వం వృషధ్వజ!

జాగృహిత్వం ముమానాధ! జగతాం మంగళం కురు!... అంటూ వేములవాడ రాజేశ్వరుని మేల్కొలిపే సుప్రభాతం ఆ పుర వీధుల్లో మారు మోగుతున్నది. భక్తి పారవశ్యానికి కవితా ఒరవడి జోడిస్తూ దశాబ్దాలుగా సాహితీవేత్తలనూ, భక్తులనూ, విమర్శకులను ఆకట్టుకుంటున్నది.  

సాంబ కవి గురువుల వద్ద నేర్చున్నది తక్కువ... స్వీయ అధ్యయనం ద్వారా నేర్చుకున్నదే అధికం. పుట్టి పెరిగింది వేములవాడలోనే కనుక శివభక్తితో అనేక రచనలు చేసినప్పటికీ ఆ తర్వాతి కాలంలో సాంబ కవి అద్వైత సిద్ధాంతాన్ని పాటిస్తూ సకల దేవతా సంబంధ రచనలు చేశారు. ముక్తేశ్వర సుప్రభాతం, ‘ఆది శంకరాచార్య సుప్రభాతం’, బాసర ‘సరస్వతీ సుప్రభాతం’, కరీంనగర్‌ ‘గౌరీ శంకర సుప్రభాతం’, ముక్తాహారం, కుంజ విహారం, లాంటి అనేక రచనలు చేసారు. అలాగని కేవలం సాంప్రదాయ కవిత్వం మాత్రమే కాకుండా గేయకవిత్వం, జానపద కవిత్వం, మాత్రా ఛందస్సులో పాటలూ గేయాలూ రాశారు. జానపద కళారూపాలయిన బుర్రకథ, హరికథలు కూడా రాశారు. ఆయన రచనల్లో 51 పద్యాల అధిక్షేప కావ్యం ‘లోభ సంహారం’ ప్రధానమైందిగా చెప్పుకోవచ్చు. వేదనను రంగరించి కన్నీటితో ఈ రచన చేసినట్టు కనిపిస్తుంది. ఆ పుస్తకానికి  ప్రస్తావన రాస్తూ ‘దంభమను రావణుని  హృదయమున లోభమను అమృత ముండినంత కాలం పాపమను శిరమును ఎన్నిసార్లు ఖండించిననూ అన్నిసార్లు పుట్టుచునే వుండును. పాప పరిహారము కావలయునన్న లోభసంహారమే కావలయును..’ అంటూ లోభత్వమే మానవత్వానికి శత్రువు అని తేల్చేస్తారు. అందులోని తొలి పద్యంలోనే

‘మధుర ఫలముల  నొసగెడు మ్రాకులుండు

ఖండవము  గాల్చే నరుడు బంగారు నేల

క్రాలు లంకను హనుమన్న గాల్చి విడిచే

కాని యొకడైన  లేమిని గాల్పడయ్యే’

అంటూ లేమిని (పేదరికాన్ని) కాల్చే వాడి కోసం ఆరాట పడతాడు. ఆయన గొప్ప సాంఘిక  బాధ్యతతో కవితా ప్రస్థానాన్ని కొనసాగించారు అనేందుకు ఇలాంటి పంక్తులే నిదర్శనం.1920 జూన్‌ 28 న జన్మించిన మామిడిపల్లి సాంబశివ శర్మ 1988  జనవరి 9 న దివంగతులయ్యారు. సంస్కృత తెలుగు భాషల్లో సమాన ప్రతిభతో కవిత్వం చెప్పిన సాంబ కవి అష్టావధానిగానూ ఖ్యాతి గడించారు. అంతే కాదు! వేదిక మీద నాటకాల్లో ఆయన అయిదు భాషలలో పాత్ర పోషణ చేసేవారు. సాంబ కవి నటిస్తే నక్షత్రాలు కను రెప్పలార్పుతూ చూసేవి, గళ మెత్తితే  శ్రావణ జలధారలు  వేములవాడ వీధుల్లోకి దిగి వచ్చేవి అని డాక్టర్‌ సి. నారాయణ రెడ్డి  సాంబ కవికి కితాబు నిచ్చిన సందర్భం  కూడా వుంది. రాజ రాజేశ్వర నాట్యమండలి పౌరాణిక నాటక ప్రదర్శనల్లో సాంబ కవి పౌరాణిక పాత్రల్ని పోషించడంతో పాటు దర్శకత్వం సంగీత బాధ్యతల్ని కూడా నిర్వహించే వారు. ఆ రోజుల్లోనే కరీంనగర్‌ జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడిగా కూడా వున్నారు. ప్రభుత్వ  పట్టాలేవీ లేకున్నా 1950 నుంచి  అనేక ఏండ్ల పాటు సాంబ కవి ఆకాశవాణి లో కార్యక్రమాలు ఇచ్చారు. కొంత కాలం కాకతీయ పత్రికకు విలేఖరిగా కూడా పనిచేశారు. అయితే ఎన్ని చేసినా ఎన్ని రాసినా ఆయన పేదరికం పోలేదు.

ఒకానొక దశలో వేములవాడ దేవాలయం వారు ఏర్పాటు చేసిన భోజనంతోనే కాలం గడిపిన సమయాన్ని కూడా అనుభవించారు. అది చూసి వేములవాడలోని సాహిత్య అభిమానులు మౌనంగా చూస్తూ ఉండలేకపోయారు. ఆయన కోసం వేములవాడ పోచమ్మ వీధిలో రెండు షట్టరశతో కూడిన భవనాన్ని నిర్మించి తమ సాహితీ అభిమానాన్ని చాటుకున్నారు. ఒక చిన్న ఊరిలో... తమ క్షేత్ర దేవతను నమ్ముకున్న మహాకవి కోసం అక్కడి ప్రజలు చొరవ చూపి... ఆయన జీవితంలో గౌరవంగా నిలబడటం కోసం ఇల్లు నిర్మించి ఇవ్వడం... తెలంగాణ ప్రజల సహృదయాన్ని నిరూపిస్తున్నది.

(నేడు మధురకవి మామిడిపల్లి సాంబకవి జయంతి )- వారాల ఆనంద్‌, 9440501281  logo