బుధవారం 05 ఆగస్టు 2020
Devotional - Jun 26, 2020 , 00:12:38

అరిషడ్వర్గాలతో అనర్థం

అరిషడ్వర్గాలతో అనర్థం

కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలుగా పిలిచే అరిషడ్వర్గాలను జయించకపోతే ఎంతటి వారైనా అధఃపాతాలానికి పడిపోతారనడానికి ఎన్నో ఉదాహరణలున్నాయి. మహా శివభక్తుడు రావణాసురుడు కామమోహంతోప్రాణాలు కోల్పోయాడు. వాలికూడా తమ్ముని భార్యను చెరపట్టటమే అసువులు బాయటానికి హేతువైంది. మోహినీ రూపంలో వున్న విష్ణుమూర్తిని చూసి చలించిన శివునికీ తిప్పలు తప్పలేదు. పర స్త్రీని తల్లిలాగా, చెల్లిలాగా గౌరవించే సంప్రదాయం భారతీయ సంస్కృతిది. నిరంతరం ‘నారాయణ’ నామస్మరణతో విష్ణుమూర్తికి మహాభక్తుడైన నారదమహర్షికీ కామపూరిత ఆలోచన వచ్చినందుకే అవమానం పొందాల్సి వచ్చింది. 

ఒకసారి నారదుడు శ్రీహరికోసం ఘోర తపస్సు చేస్తుంటాడు. అది దేవేంద్రునికి ఆందోళన కలిగించడంతో తపోభంగం చేయమని మన్మథుని ప్రేరేపించి, అప్సరసలను పంపుతాడు. నారదుని నిగ్రహశక్తి ముందు మన్మథుడూ విఫలమవుతాడు. దాంతో ‘కామాన్ని జయించాననే’ గర్వం నారదుని మనసులో స్థిరపడుతుంది. తొలుత శివుని ఎదుట, తర్వాత శ్రీహరి ముందు నారదుడు స్వోత్కర్షను ప్రదర్శిస్తాడు. నారదునికి ‘గర్వభంగం చేయాలని’ జగన్నాటక సూత్రధారి తలుస్తాడు. నాటకం ఆరంభిస్తాడు. నారదుడు వెళ్ళేదారిలో ‘అందమైన నగరం, ఉద్యానవనం, స్త్రీ పురుషులను’ సృష్టిస్తాడు. శీలనిధి అనే రాజునూ నియమిస్తాడు. ఆయన బిడ్డ విశ్వమోహిని. ఆమె పెండ్లికోసం స్వయంవరం ప్రకటిస్తారు. ఇది తెలిసిన నారదుడు ‘ఆమెను తానే పెండ్లాడాలని’ ఉవ్విళ్ళూరుతాడు. ‘కామాతురాణాం నభయం, న లజ్జ’ అన్నట్లు తనకు ‘నీ అంతటి రూపలావణ్యం కావాలని’ శ్రీమహావిష్ణువునే కోర రాని కోరిక కోరుతాడు. ‘నారదుడు తనకు తానుగా సర్వాంగ సుందరునిలా, పరులకు మాత్రం కోతివలె కనిపించేలా’ విష్ణుమూర్తి వరమిస్తాడు. 

ఇదేమీ తెలియక ఆనందంగా స్వయంవరానికి వెళతాడు నారదుడు. విశ్వమోహినిగా లక్ష్మీదేవియే ఉంటుంది. రాజు వేషంలో కేశవుడు! అందరూ నమస్కారాలు పెడుతుంటే, ‘తన అందానికి మెచ్చారని’ భ్రమపడతాడు నారదుడు. శివదూతలు పరిహాసానికి నారదుని అందాలను పొగుడుతారు. దాంతో తనకు ‘విశ్వమోహిని భార్య కావటం ఖాయమని’ నారదుడు ఆరాటపడుతాడు. తీరా రాజు మెడలో దండవేస్తుంది విశ్వమోహిని. శివదూతలు నారదుని భంగపాటుకు నవ్వి ‘అద్దంలో ముఖం చూసుకో’ మంటారు. అద్దంలో ‘కోతిమూతి’ చూసుకున్న తర్వాత ఆగ్రహంతో విష్ణుమూర్తికోసం పరుగెత్తుతాడు. మధ్యలోనే లక్ష్మీనారాయణులు ఎదురవుతారు. 

నారదుడు శ్రీహరిని ‘మోసగాడి’గా నిందిస్తాడు. ‘తనకు వానరాకారం కల్పించినందుకు నువ్వూ కొంతకాలం వానరులతో సహవాసం చేస్తావనీ, తనకు స్త్రీ సంగమం దూరం చేసినందున నువ్వూ కొన్నాళ్లు స్త్రీ వియోగంతో బాధపడతావని’ శ్రీహరినే నారదుడు శపిస్తాడు. అప్పుడు విష్ణుమూర్తి నాటకానికి తెర తీసి, నారదుని మాయను తొలగిస్తాడు. తన తప్పు తెలుసుకున్న నారదుడు పశ్చాత్తాప పడి అనేక విధాలుగా ప్రార్థనలు చేసి మహావిష్ణువును ప్రసన్నం చేసుకొంటాడు. నారదుని ఈ శాప ప్రభావంగానే శ్రీ రాముడు వానరులతో సహవాసం చేయడం, సుగ్రీవుడు, హనుమంతునితో సహకారం పొందటమే కాక భార్యా వియోగాన్ని అనుభవిస్తాడు. అందరి గర్వభంగం అణచే నారదునికి సైతం ఈ రీతిన గర్వభంగం తప్పలేదు. అందుకే ‘అతి సర్వత్ర వర్జయేత్‌' అన్నారు పెద్దలు.logo