ఆదివారం 09 ఆగస్టు 2020
Devotional - Jun 25, 2020 , 00:06:05

‘తపస్సు’ అంటే ఏమిటి?

 ‘తపస్సు’ అంటే ఏమిటి?

‘ఈ జగత్తు అంతా తపోమూలం. తపస్సు చేయని వ్యక్తి తాను చేసే ఏ సత్కర్మ ఫలితాన్ని కూడా సంపూర్ణంగా పొందలేడు. సమస్త సాధనలకు తపస్సే మూలం’.. ఇది అంపశయ్యపై భీష్ముడు ధర్మరాజుకు చేసిన బోధ. అసలు ‘తపస్సు’ అంటే ఏమిటి? అదీ భీష్ముడే చెప్పాడని ‘వ్యాసభారతం’లోని ‘శాంతిపర్వం’ చెబుతున్నది. కేవలం అన్నపానాదులు త్యజించి, శరీరాన్ని శుష్కింపచేసి, అందరి సాంగత్యాన్ని వదిలేసి చేసేది మాత్రమే తపస్సు కాదు. ‘తపస్సు’ అంటే.. అహింసను ప్రేరేపించడం, పాటించడం, సత్యాన్ని మాట్లాడటం, దానగుణం కలిగి ఉండటం, క్రూరత్వం లేక దయతో మెలగడం, ఇంద్రియ నిగ్రహంతో ధర్మబద్ధంగా జీవించడం.. అన్నది పండిత వాక్కు. 

‘ధర్మజా! ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం తపస్సుకు మరీ ముఖ్యమైన రెండు సాధనాలు. తపస్సుతోనే సర్వసంపదలు, అపారమైన జ్ఞానసంపదనూ మానవుడు సాధించగలడు. అదే తపస్సుకున్న శక్తి. తపస్సు పరమార్థం త్రికరణ శుద్ధియే. దేహంతో అంటే భౌతికంగా జరిపే పూజ, వాక్కుతో జపం, మనస్సుతో ఆలోచన, దైవస్మరణ ద్వారా దేహ, మనో, ఇంద్రియ నిగ్రహాలు అలవడుతాయి.

‘తపస్సు అనేక రకాలు. అహింస, సత్యవాక్కు, మనో ఇంద్రియ నిగ్రహాలను మించిన తపస్సు లేదు. దానాన్ని మించిన గొప్ప ధర్మం లేదు. మాతృసేవను మించిన ఆశ్రయం లేదు. నిష్ఠతో, నిశ్చలమైన, నిర్మలమైన, ఫలాపేక్ష లేని తపస్సుతో దైవత్వం కూడా సిద్ధిస్తుంది. ‘నివృత్తి మార్గానికి ఉపవాసం కూడా ఒక గొప్ప సాధనం’ అని కురువృద్ధుడైన భీష్ముడు, ధర్మజుడికి ఉపదేశించాడు. అయితే, అధికారం, ఐశ్వర్యం, భోగాలు, రాగద్వేషాలు, హింసాప్రవృత్తితో, కఠోర నియమాలను పాటిస్తూ దేవతలను ప్రసన్నం చేసే ప్రాచీనకాలం నాటి తపస్సులను ఎక్కువగా దానవ ప్రవృత్తిగల వాళ్లు, రాక్షసులు చేసేవారు. కాబట్టి, ‘అటువంటి తపస్సుని అసురం’ అంటారు. ఇతిహాసాల్లో ఇటువంటి అసురులు ఎందరో.

తపస్సుకు దాదాపు సమానమైన నిష్ఠగా ‘ధ్యానాన్ని’ చెప్పాలి. ‘తపోధ్యానాలు మానవుని మనస్సును నిర్మలం చేసి, శాంతిని అందిస్తాయి. శాంతిద్వారా రాగద్వేషాలు తొలుగుతాయి. అరిషడ్వర్గాలు నశిస్తాయి’ అన్నది యోగవాసిష్ఠంలో చెప్పబడింది. ‘ధ్యానం’ అంటే ఏకాగ్రతయే. ఏ పనైనా ఏకాగ్రతతో చేసినప్పుడు దాని ఫలితం కూడా అద్భుతంగా ఉంటుంది. పూజ, జపం కన్నా ఒక మెట్టు పైనున్న ప్రక్రియ ధ్యానం. దైవాన్ని మనకు దగ్గర చేసే మార్గం. ఈ ఏకాగ్రత అంత సులువుగా లభించదు. మనసును నియంత్రించడం, విషయవాంఛలకు అతీతంగా చంచలమైన ఆలోచనలను కట్టడి చేయడం ధ్యాన సాధనకు కావాల్సిన ముఖ్యమైన అంశాలు. ధ్యానం ద్వారా పరిపూర్ణత పొందాలంటే సంకల్పం ఉన్న సాధకుడు, ముందు ఏదో ఒక రూపాన్ని లేదా ఇష్ట దైవాన్ని మనసులో నిలుపుకుంటాడు. మానసిక ప్రశాంతతను ముందుగా సాధించి, నిశ్చలమైన ఏకాగ్రతతో ధ్యానం చేస్తాడు. దీనివల్ల ఒక రకమైన సమాధి స్థితిని సాధించి, పరిపూర్ణమైన ఫలితాన్ని పొందవచ్చునని పెద్దలమాట. అది సాధించటానికి నిరంతర సాధన అవసరం. మానవుడి మనసు గాలిలాగా అతిచంచలమైంది. గాలి లేని చోట దీపం నిశ్చలంగా ఉన్నట్టు, ధ్యానంలో మనస్సు నిశ్చలంగా ఉంటుందన్నది భగవద్గీత వాక్యసారం.

‘జ్ఞానకర్మేంద్రియాలపై నియంత్రణ’ ధ్యానంలో ప్రథమ ప్రాధాన్యాన్ని కలిగి ఉంటుంది. ఆ సమాధి స్థితిలో లౌకికమైన వాసనల మీదినుండి దృష్టి మరలి, ఒక తాదాత్మ్య స్థితికి సాధకుడు చేరుకుంటాడు. మనసును అదుపులో పెట్టి, సమాధిస్థాయిలో ధ్యానం చేసిన మానవుడి ముఖం నిర్మలంగా ఉంటుంది. బాహ్యప్రపంచంలోనే ఉన్నాకూడా ఏదీ అంటనట్టు, ఎవరితో సంబంధం లేనట్టు ఒక అలౌకిక స్థితిలో కనిపిస్తారు. అష్టాంగయోగంలో ధ్యానం, సమాధి అన్నవి అత్యంత ఉన్నతమైన స్థాయి సాధనా ప్రక్రియలు. సాధనకు ప్రాతః సాయంసంధ్యా కాలాలూ అనుకూలం. ఇంతటి ప్రాధాన్యం గల తపస్సుతోపాటు ధ్యాన, యోగ, జప, పూజా ప్రక్రియలన్నీ మానవ జీవన సౌభాగ్యానికి ఉపయోగపడేవే.logo