శుక్రవారం 14 ఆగస్టు 2020
Devotional - Jun 24, 2020 , 00:28:11

ఆధ్యాత్మిక పరిణతి ఎలాగంటే..

ఆధ్యాత్మిక పరిణతి ఎలాగంటే..

యోగ సాధనలు ఎంతో సరళమైనవి, భౌతికమైనవి. వాటిలో అర్థం కాని ఆధ్యాత్మికత ఏమీ లేదు. ప్రస్తుతం, ‘మీరు-నేను’ అనుకొనేదంతా 4 అంశాలే- శరీరం, మనసు, భావాలూ, వీటికి మూలమైన జీవశక్తి. ఏదైనా ఒక పెద్ద విషయం జరుగాలంటే ఈ నాలుగూ సమన్వయంతో ఉండాలి. యోగా అన్నది వీటన్నింటి కలయిక. అసలు ఉన్నది నాలుగు యోగాలే. అవి జ్ఞాన, భక్తి, కర్మ, క్రియా. 

‘జ్ఞానయోగం’ అంటే.. ముక్తి పొందేందుకు బుద్ధిని ఉపయోగించడం. మన భావాలను పరమోన్నత స్వభావానికి చేరుకోవడానికి వాడితే అది ‘భక్తియోగం’. శరీరంతో ముక్తిని లేదా పరమోన్నత గుణాన్ని చేరుకోవాలనుకొంటే ‘కర్మయోగం’. అంతఃశక్తుల ద్వారా పరమోన్నత స్థితిని చేరుకోవాలని అనుకుంటే ‘క్రియాయోగం’. ప్రతి ఒక్కరూ వీటన్నింటి సమ్మేళనంగా ఉండాలి. ప్రతీ దానిని సరైన పాళ్ళల్లో వినియోగించుకోవాలి. ఒకరికి, వారి తర్కం ఎంతో ప్రగాఢంగా ఉండవచ్చు. కొందరికి శరీరం అలా ఉండవచ్చు. మొత్తం మీద వాటన్నిటి సరైన కలయిక అవసరం. లేదంటే, ఆధ్యాత్మిక ప్రక్రియ జరుగదు.

యోగ సాంప్రదాయంలో ఓ కథ ఉంది. పై నాలుగు యోగాలకు చెందిన నలుగురు మనుషులు ఒకరోజు అడవిలో వెళుతున్నారు. వీళ్లు ఎప్పుడూ కలిసి ఉండలేరు. పైగా, ఒకరంటే ఒకరికి పడదు. ‘జ్ఞానయోగి’ బుద్ధితో ఆలోచిస్తుంటాడు. ఈయనకు మిగతా వారంటే చిన్నచూపు. భక్తులు పైకి చూస్తూ ‘రామ్‌.. రామ్‌..’ అంటారని పరిహసిస్తాడు. వీళ్ళు వాళ్ళని భరించలేరు. భక్తిలో ఉన్న ప్రజలకు ‘అందరిపైనా సానుభూతి’. ‘చక్కగా దేవుడి చెయ్యి పట్టుకొని నడవక, ఈ జుట్టు పీక్కోవడం ఎందుకూ? తలమీద నుంచోవడం, శ్వాసను బిగబట్టడం, శరీరాన్ని వంచడం.. ఇదంతా చెత్త. కేవలం భగవంతుడి నామం ఉచ్ఛరిస్తే చాలు, జరగాల్సిందంతా జరుగుతుంది’ అనుకొంటారు. ‘వీళ్ళంతా బద్ధకస్తులు. దానిని కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి పిచ్చి యోగాలన్నీ’ అంటాడు కర్మయోగి. ఇక, క్రియాయోగికీ వీరెవరూ పట్టరు. ఎందుకంటే, వారు శక్తే ప్రధానమనుకుంటారు. ‘శక్తిని పరిణామం చెందించుకోకపోతే అసలు మార్గమేదీ’ అనుకుంటారు. ఇలాంటి నలుగురూ ఆ రోజున కలిసి నడుస్తున్నారు. 

ఉన్నట్లుండి పెద్ద గాలివాన మొదలైంది. ఎక్కడైనా తలదాచుకోవడానికి ‘ఒక నీడ దొరుకుతుందేమో’ అని చూశారు. భక్తియోగి ‘ఇటువైపు ఓ పాడుబడ్డ గుడి ఉంది’ అన్నాడు. అంతా అటువైపు పరుగెత్తారు. ఆ ఆలయం కూలిపోయే స్థితిలో ఉంది. కేవలం కొద్దిగా పైకప్పు, నాలుగు స్తంభాలే వున్నాయి. గోడలు లేవు. తుపాను మరింత ఉధృతమైంది. వాన అన్ని దిక్కులనుంచీ విసిరి విసిరి కొడుతున్నది. దాంతో తడబకుండా ఉండేలా, నలుగురూ దగ్గరగా, మరింత దగ్గరగా వచ్చారు. గుడిమధ్యలో ఒక శివలింగం మినహా అక్కడ మరే చోటూ లేదు. అందరూ ఆ శివలింగాన్ని హత్తుకున్నారు. ఇది భగవంతుడిమీద ప్రేమతోనో, మరొక దానివల్లో కాదు. కేవలం ఆ తుపానునుంచి తప్పించుకోవడానికే..! 

హఠాత్తుగా అక్కడ ‘శివుడు ప్రత్యక్షం’ అయ్యాడు. ఆ నలుగురి మనసులలోనూ ఒకటే ప్రశ్న. ఎవరికి వారు ‘తమ ఇన్నాళ్ల యోగసాధనలో దైవదర్శనం కాలేదు. కానీ, ఇప్పుడిలా దేవుడు కనిపించడమేమిటి?’. ఇదే సందేహం ఆయన్నే అడిగారు. దానికాయన, ‘ఇప్పటికి  మీరంతా ఒక్కటయ్యారు. నేను ఈ క్షణం కోసమే ఇంత కాలంగా ఎదురుచూస్తున్నాను’. అప్పుడు కానీ, ఆ నలుగురికీ అర్థం కాలేదు. మనం కారు నడపాలనుకొన్నప్పుడు ఓ చక్రం ఒకవైపు, మరో చక్రం మరోవైపు వెళితే ప్రయాణం సాగదు కదా. అదే విధంగా, ప్రస్తుతం అనేకమంది అనుభవిస్తున్న ‘నరకం’ ఇలాంటిదే. వాళ్ళ మనసు ఒకవైపు, హృదయం మరోవైపు, శరీరం వేరొకవైపు, అంతర్గత శక్తులు ఇంకెక్కడో. ఇలాగైతే పారవశ్య స్థితి ఎలా సాధ్యమవుతుంది? అందుకే, యోగాను ‘ఇన్నర్‌ ఇంజినీరింగ్‌"గా అవగాహన పరచుకోవాలి. ఇప్పటికైనా ఎవరికీ మించిపోయిందేమీ లేదు. వెంటనే కావలసిన ‘యు-టర్న్‌' తీసుకోండి.


logo