శనివారం 15 ఆగస్టు 2020
Devotional - Jun 23, 2020 , 00:04:21

సమ్మోహనుడు శ్రీకృష్ణుడు

సమ్మోహనుడు శ్రీకృష్ణుడు

ఒక వ్యక్తిత్వాన్ని ఏది ఆకర్షిస్తుంది? భగవంతుడంటే అందరికీ ఎందుకంత ఆకర్షణ? వేదవ్యాసుల తండ్రి పరాశర ముని ఈ ‘ఆకర్షణీయత’కు గల ఒక నిర్వచనాన్ని అందించారు: ‘ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశసః శ్రియః/ జ్ఞాన వైరాగ్యయో శ్రీవషణ్ణాం భగ ఇతీంగన’ (విష్ణు పురాణం, 6.5.47). ‘జ్ఞాన, బల, ఐశ్వర్య, కీర్తి, సౌందర్య, వైరాగ్యాలనేవే ఒక వ్యక్తి లేదా వ్యక్తిత్వంలోని ఆకర్షణీయతకు గల కారణాలు. ఈ ఆరు విభూతుల సంపూర్ణ స్వరూపమే భగవంతుడు’ అని దీని భావం. ‘భగవాన్‌' (భగ+వాన్‌)లోని ‘భగ’ అంటే ‘విభూతి’, ‘వాన్‌' అంటే ‘వాటిని కలిగివున్నవాడు’ అనర్థం. ఈ ప్రపంచంలో ఎందరో ఐశ్వర్యవంతులు, బలవంతులు, జ్ఞానులు, గొప్ప కీర్తిమంతులు, సౌందర్యవంతులు, వైరాగ్యులు ఉన్నారు. కానీ, వారిలో ఏ ఒక్కరూ వాటిని మొత్తంగా ‘తాము మాత్రమే కలిగి వున్నామని’ చెప్పుకోలేరు. ఇది ఒక్క భగవంతునికి మాత్రమే సాధ్యం! 

ఈ ప్రపంచంలో ఎవరైనా సరే, పైన తెలిపిన ఆరు విభూతులలోని ఏ ఒక్కదాన్ని తాము కలిగున్నా, తమకున్న ఆ విభూతితో ఇతరులను ఆకర్షించగలరు. అలాంటప్పుడు, ఈ విభూతులన్నింటినీ సంపూర్ణంగా కలిగివున్న భగవంతుడు సహజంగానే ‘సర్వాకర్షకుడై’ ఉంటాడు కదా! ‘సర్వాకర్షకుడు’ అనే పదానికి సంస్కృత పరిభాషలో సమానార్థం వచ్చే పదమే ‘కృష్ణ’. కాబట్టి, భగవత్‌ తత్త్వాన్ని సంపూర్ణంగా సంక్షిప్తరీతిలో తెలిపే నామమే ‘కృష్ణ’. ఆ పరిపూర్ణ అవతార పురుషుడిని సకల వేద వేదాంగాలు ‘శ్రీ కృష్ణ’ అని సంబోధించాయి.

సమస్త వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, వేదాంత సూత్రాలను రచించిన వ్యాసదేవులకే మనసులో ఇంకా ఏదో తెలియని వెలితి. ఆ అసంతృప్తితో తన శోకానికిగల కారణాన్ని శోధిస్తూ నారద మునిని సంప్రదించాడు. ‘వేదాంత సూత్రాలపై సహజ భాష్యాన్ని రచించవలసింది’గా వ్యాసుల వారికి నారదులు సూచించారు. అప్పుడు ఆయన లోకానికందించిన గ్రంథమే శ్రీమద్భాగవతం. అందులో, వేదవ్యాసుల వారు దేవదేవుని అవతారాలు ఎన్నైనా, అంశలు అసంఖ్యాకమైనా, ‘శ్రీకృష్ణుడే స్వయం భగవంతుడని’ ప్రబోధించారు.

 ‘ఏతే చాంశకలాః పుంసః 

కృష్ణస్తు భగవాన్‌ స్వయమ్‌

ఇంద్రారి వ్యాకులం 

లోకం మృడయన్తి యుగేయుగే..’

- శ్రీమద్భాగవతం, (1.3.28)

‘సకల జీవరాశులలో ఉన్నతమైన వానినే మనం భగవంతుడు’ అంటున్నాం. ‘ఉన్నతం’ అంటే ఏ గుణంలోనైనా, ఏ లక్షణంలోనైనా, ఏ విభూతిలోనైనా, తనతో సమానమైన జీవికాని లేదా తనకన్నా ఉత్తమమైన జీవికాని, మరొకటి లేదని, ఉండదని అర్థం. ఆ భగవంతుని అనంత కళ్యాణగుణాలనుబట్టే అనంతమైన నామాలతో పిలుస్తున్నాం, కొలుస్తున్నాం. ఉదాహరణకు గోవర్ధన పర్వతాన్ని చిటికెన వేలుతో ఎత్తిపట్టి అద్భుతశక్తిని ప్రదర్శించిన శ్రీకృష్ణుడిని ‘గోవర్ధన గిరిధారి’ అన్నాం. అందరి మనసులనూ దోచి మోహింపజేసేవాడు మన్మథుడైతే, ఆ మన్మథుని మదినిసైతం దోచగల శ్రీకృష్ణుడినే ‘మదన మోహనుడు’ అంటున్నాం. అత్యంత సమున్నతమైన విజ్ఞానాన్ని భగవద్గీతగా లోకానికందించాడు శ్రీకృష్ణుడు. ఐదువేల ఏండ్లు గడిచినా, ప్రపంచంలోని కోట్లమందికి ఆ జ్ఞానదీపం వెలుగులను ప్రసరిస్తూనే వుంది. లోకం ఈ గొప్పదనాన్ని స్మరిస్తూనే వుంది. ఆ యశస్సుకు, ప్రభావశీలతకు ఇదే నిదర్శనం.

సకల బ్రహ్మాండాలలో ఎవరు ఎంత గొప్పవారైనా, దేవతామూర్తులైనా.. వారెవరూ శ్రీకృష్ణునితో సాటి రారన్నదే సమస్త వేద సారాంశం. అటువంటి దేవాదిదేవుడైన శ్రీకృష్ణునిపట్ల ఆకర్షితులవటమన్నది నిజంగా జీవుని భాగ్యం. అదే మానవ జీవిత పరమార్థం కూడా. ఎప్పుడైతే జీవుడు శ్రీకృష్ణునిపట్ల ఆకర్షితుడవుతాడో, అటువంటి జీవుడిని ఇక ప్రాపంచిక వ్యామోహాలు మోహింపజాలవు. అదే క్రమంగా శ్రీకృష్ణునిపట్ల ప్రేమగా రూపాంతరం చెందుతుంది. ప్రస్తుత యుగంలో శ్రీకృష్ణునిపట్ల విశుద్ధ ప్రేమను పెంపొందించగలిగే అత్యంత సరళతరమైన మార్గమే ‘హరే కృష్ణ’ మహామంత్రం.

హరే కృష్ణ హరే కృష్ణ.. కృష్ణ కృష్ణ హరే హరే!

హరే రామ హరే రామ.. రామ రామ హరే హరే!!

ప్రతిరోజూ ఈ మహామంత్రాన్ని అందరం జపిద్దాం. ఆనందంగా జీవిద్దాం. ఓం తత్‌ సత్‌.


logo