బుధవారం 12 ఆగస్టు 2020
Devotional - Jun 21, 2020 , 23:13:49

కర్మ సిద్ధాంత సారం!

కర్మ సిద్ధాంత సారం!

జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చతస్మా దపరి హార్యార్థే న త్వం శోచితుమర్హసి॥

శ్రీకృష్ణ భగవానుడు లోకహితార్థం అందించిన ‘శ్రీమద్భగవద్గీత’లోని ప్రసిద్ధ శ్లోకాలలో ఇదొకటి. ఎందరికో కనువిప్పు కలిగించే గొప్ప భావన ఇది. ‘జన్మించిన ప్రతి ప్రాణికీ మృత్యువు అనివార్యం. అదెలా, మరణించిన ప్రతి జీవికీ మళ్లీ పుట్టడం కూడా తప్పదు. కాబట్టి, నిస్సంశయమైన ఈ జనన- మరణాలను గురించి మనం దుఃఖించడం తగదు’. పుట్టిన ప్రతి జీవి కూడా మరణిస్తాడన్న సత్యాన్ని చెబుతూనే, దానికోసం అనవసరంగా దుఃఖించరాదన్న విషయంలోని మర్మం తెలిస్తే మనలోని అనేక సంశయాలు పటాపంచలవుతాయి.

మరణమనేది లేనప్పుడు జీవితం ఎంత దుర్భరమో. మనిషికి బాల్యం తెలియకుండానే గడిచిపోతుంది. కౌమారం విద్యార్జనాదుల్లో కరిగిపోతుంది. యౌవనం సుఖభోగాల్లో సాగిపోతుంది. మరణానికి ముందుదే వార్థక్యం. ఇది ప్రతి ప్రాణికీ చివరి దశ. చాలా భీతికరం. కంటిచూపు తగ్గి ఇతరులపై ఆధారపడవలసి వస్తుంది. జ్ఞాపకశక్తి సన్నగిల్లుతుంది. జీర్ణక్రియ సరిగా ఉండదు. దానితో అనారోగ్య బాధలు పెరుగుతాయి. ఏ అధికారమూ, సంపాదనా ఉండదు. మన మాట వినేవాళ్లు కూడా ఉండరు. యువశక్తి ముందు మన వృద్ధాప్యం చిన్నబోతుంది. మన అనుభవాలను కొత్తతరం గుర్తించకపోవచ్చు, ఇష్టపడకపోవచ్చు. ఫలితంగా మానసిక ప్రశాంతతా ఉండదు. తానొక నిరుపయోగమైన వ్యక్తిలా భావించుకోవడమే ఒక దుర్భరం.

ఒక్కోసారి మనసు దైన్యాన్ని పొందే అవకాశమూ ఉంటుంది. అప్పుడు ఆ మనిషి మరణాన్నే కోరుకుంటాడు. నిస్సహాయత, నిరాశ, నిరాసక్తత వంటివాటి వల్ల తాను మరణిస్తే బాగుంటుండనుకుంటాడు. కానీ, అది సాధ్యమా? మనం కోరుకొన్నప్పుడు మరణం రాదు. జనన-మరణాలు మన చేతుల్లో లేవు. ఈ రెండూ సహజధర్మాలు. రావలసినప్పుడే వస్తాయి. ఒకరకంగా మరణం ఆలస్యమవడమూ నరకయాతనే. వ్యక్తిగతంగా తనకూ, తనను ఆశ్రయించినవారికి, పరిచర్యలు చేసిన వారికి కూడా అది యాతనే తప్ప మరొకటి కాదు. అప్పటిదాకా ఆప్తులుగా కనిపించి, పొగడ్తలు, ఆదరాభిమానాలు చూపినవారే.. ఎప్పుడైతే మనం మరణానికి చేరువై వృద్ధాప్యంలోకి వస్తామో ‘ఛీత్కారాలు, చీదరింపులు’ ఎదురుకావచ్చు.  దేహాంతర ప్రాప్తి కోసం ఎదురుచూపులు తప్ప ఏమీ చెయ్యలేని నిస్సహాయ పరిస్థితి అది.

‘ఇది తెలుసుకొని ప్రతి వ్యక్తి తనను శరణు వేడాలన్నది’ భగవంతుని మాట. ఈ అనిశ్చితాలైన ‘జనన-మరణ’ సహజధర్మాల పట్ల మనిషి దుఃఖించడమో, ఆనందించడమో, ఏవైనా క్రియలు చేసి వీటి నుంచి తప్పించుకోవాలని చూడటమో అనవసరం. దీనికి బదులుగా జన్మరాహిత్యం పొందాలనీ, మోక్షసాధన దిశగా సాధన చెయ్యాలని శ్రీకృష్ణ పరమాత్మ గీతలో ప్రబోధించాడు. భారతీయ సనాతన ధర్మమూ ఈ సహజధర్మాల పట్ల ప్రత్యేక దృష్టిని నిలిపింది. ప్రతి వ్యక్తీ జీవితకాల పర్యంతం నిర్మోహియై తన విధులు నిర్వహించాలని సూచించింది.

దైవాన్ని సందర్శించినప్పడు గాని, దైవం ముందు మోకరిల్లినప్పుడుగాని-

‘అనాయాసేన మరణం వినాదైన్యేన జీవనం దేహం తే తవ సాయుజ్యం దేహిమే పార్వతీ పతే॥

అని ప్రార్థించాలి. ‘లౌకికమైన కోరికలకు దూరంగా, పారమార్థిక సత్యాన్ని గ్రహించి ఏ యాతనా లేని మరణాన్ని, ఎలాంటి దైన్యం లేని జీవితాన్ని ఇవ్వడమే గాక, మరణానంతరం పునర్జన్మ లేకుండా ఐక్యం చేసుకొమ్మని’ దైవాన్ని వేడుకోవాలి. మన చేతుల్లో లేని జనన మరణాలు మనకు ఏ ఇబ్బందీ లేకుండా సాగి, మోక్షం పొందడమే మానవ ప్రధాన కర్తవ్యం.


logo