ఆదివారం 09 ఆగస్టు 2020
Devotional - Jun 22, 2020 , 01:50:19

పంచభూతాత్మక శక్తినిచ్చే.. నమః శివాయ!

పంచభూతాత్మక శక్తినిచ్చే.. నమః శివాయ!

ఇహపర మోక్షాలను కలిగించే మంత్రంగా ప్రసిద్ధికెక్కింది పంచాక్షరి. భూమి తత్త్వానికి ప్రతీకగా కనిపించే శివుని మంత్రరాజమిది. భూమే మనకు శివలింగం. శివం అంటే ‘మంగళప్రదం’ అని అర్థం. నిఘంటువుల అర్థాలను చూస్తే, ‘అరిష్టం తనూ కరోతీతి శివం’. అరిష్టాన్ని స్వల్పంగా చేసేది శివం అనీ, ‘శామ్యతి పరమానంద రూపత్వా న్నిర్వికారో భవతీతి శివః’.. బ్రహ్మానంద స్వరూపుడు, నిర్వికారుడు కనుక శమించి ఉండేవాడు శివుడనీ చెప్పబడింది. ఈ భూమిలోనూ, భూమిచుట్టూకూడా ఉన్నది పాంచభౌతిక శక్తి మాత్రమే. భూమిలో భూమి మాత్రమే ఉండదు. భూతత్త్వం 50 శాతం ఉంటే మిగిలిన 50 శాతంలో జల, అగ్ని, వాయు, ఆకాశ తత్త్వాలుంటాయి. 

శివునికి సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశానమనే ఐదు ముఖాలున్నాయి. నాలుగు దిక్కులు ఆకాశానికి చెందిన ముఖాలుగా ప్రత్యేకించి చెప్పబడ్డాయి. ‘నమః శివాయ’ అనే ఐదు అక్షరాల ఈ మంత్రానికి ‘మంగళకరుడైన, బ్రహ్మానంద ప్రదుడైన, ప్రశాంతతను ఇచ్చే, ఐశ్వర్యాన్ని సమకూర్చే శివునికి నమస్కారం’ అని అర్థం. మంత్రోచ్ఛారణ చేయడంలో కేవలం సాధారణమైన అర్థమే స్వీకరించకూడదు. ఆయా నామాదులు ఉచ్ఛరిస్తున్న సందర్భంలో ఆ శబ్దం ద్వారా శరీరం, మనసు పొందే వేర్వేరు శక్తులను  కూడా గమనించాల్సి ఉంటుంది. ఆ విధంగా శరీరానికి, మనసుకు ప్రశాంతత ఇచ్చేది, వ్యతిరేకతలను తగ్గించేది, పంచభూతాలకు చెందిన శక్తిని  అందించేది, అందులోనూ భూసంబంధమైన శక్తినిచ్చి ఐశ్వర్యాలను సమకూర్చేదైన మంత్రం.. ‘నమః శివాయ’. దీనికి ‘ఓం’ కారాన్ని కలిపి మంత్రంగా ఉపాసకులు జపించడం సంప్రదాయం. 

‘అభిషేక ప్రియః శివః’ అంటారు. భూమిపైన వర్షం పడితే భూమికి ఆనందం. శివాలయాల్లో శివలింగానికి అభిషేకం చేయడమంటే భూమిపై కురిసే వర్షం ద్వారా పంటలు పండించుకొని, చైతన్యాన్ని పెంచుకోవడమే. శివలింగాభిషేకం చేసే సందర్భంలో యజుర్వేద రుద్రాధ్యాయంలోని ‘నమక చమకాల’ను పఠిస్తారు. వానిలో ‘నమకం’లోని ‘నమ శ్శంభవేచ మయో భవేచ నమశ్శంకరాయచ మయస్కరాయచ నమ శ్శివాయచ శివతరాయచ’.. అనే వాక్యం నుండి ఈ మంత్రాన్ని స్వీకరించడం జరిగింది.

- సాగి కమలాకరశర్మ, 97042 27744


logo