గురువారం 13 ఆగస్టు 2020
Devotional - Jun 22, 2020 , 01:50:18

శాశ్వత కీర్తి

శాశ్వత కీర్తి

ప్రాచీనకాలంలో ఇంద్రద్యుమ్నుడనే మహారాజు అనేక పుణ్యకార్యాలు, యజ్ఞయాగాదులను చేసి స్వర్గానికి వెళ్లాడు. చాలాకాలం స్వర్గసుఖాలను అనుభవించాడు. ఒకనాడు అతనిని స్వర్గాధిపతి ఇంద్రుడు పిలిచి, “నీ పుణ్యం క్షీణించింది. మానవజన్మ ఎత్తడానికి సిద్ధంగా ఉండు” 

అని చెప్పాడు. దానికి ఇంద్రద్యుమ్నుడు “నేను శాశ్వత పుణ్యలోక ప్రాప్తిని 

పొందేంత పుణ్యం చేశాను. కనుక, 

ఇక్కడే వుంటాను” అన్నాడు. “సరే! నీ 

వెంట నా భటులు వస్తారు. భూలోకంలో 

నీ పేరు ఎవరికైనా జ్ఞాపకం వుందేమో చూద్దాం” అన్నాడు ఇంద్రుడు. 

భూలోకానికి వచ్చి మార్కండేయ మహర్షిని కలిశాడు ఇంద్రద్యుమ్నుడు. అప్పటి జనం ఎరుకలో మార్కండేయ మహర్షిని మించిన పెద్దవాళ్లు లేరు. మార్కండేయుడు చిరంజీవి కదా. విషయం చెప్పి “నువు నన్నెరుగుదువా?” అడిగాడు ఇంద్రద్యుమ్నుడు. “నీ పేరెప్పుడూ నేను వినలేదు” చెప్పాడు మార్కండేయుడు. నిరాశపడ్డాడు ఇంద్రద్యుమ్నుడు. “నిరాశపడకు. హిమాలయ పర్వతశ్రేణుల్లో వుండే ప్రావారకర్ణుడు అనే గుడ్లగూబ నాకన్నా వయస్సులో పెద్దది. అతడిని అడిగి చూడు” అన్నాడు మార్కండేయుడు.  మార్కండేయుణ్ణి వెంట రమ్మన్నాడు ఇంద్రద్యుమ్నుడు.‘రసఘటిక సేకరించి వున్నాను కనుక రాలే”నన్నాడు మార్కండేయుడు. 

అప్పుడు ఇంద్రద్యుమ్నుడు గుర్రంగా మారి, ‘తన వీపుమీద ఎక్కమన్నాడు మార్కండేయుడిని’. గగనమార్గంలో ఇంద్రద్యుమ్నుడు, మార్కండేయుడు ప్రావారికర్ణుడిని చేరుకొన్నారు. “నేనుకూడా నీ పేరు విని వుండలేదు. ఇక్కడికి దగ్గరలో ఇంద్రద్యుమ్నమనే సరస్సు ఉన్నది. నాళీకజంఘుడనే కొంగలరాజు ఆ సరస్సులో విహరిస్తుంటాడు. నా కన్నా పెద్దవాడు. అతడిని కనుక్కోండి” అన్నాడు ప్రావారకర్ణుడు. ప్రావారికర్ణుడిని కూడా వీపుమీద ఎక్కించుకొని నాళీకజంఘుని వద్దకు వచ్చాడు ఇంద్రద్యుమ్నుడు. నాళీకజంఘుడుకూడా “ఇంద్రద్యుమ్న మహారాజు పేరును నేను విని వుండలేదు” అన్నాడు. “కానీ, నాకన్నా వృద్ధుడైన అనూపారుడు అనే తాబేళ్ల రాజు ఈ సరస్సు అడుగున జీవిస్తున్నాడు. అతడిని కనుక్కుందాం” అంటూ అనూపారుడిని పైకి పిలిచాడు నాళీజంఘుడు.

విషయం తెలుసుకొన్న అనూపారుడు కొద్దిసేపు ధ్యానించి పాతజ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకొన్నాడు. “అయ్యో! ఇంద్రద్యుమ్న మహారాజును నేనెలా మరచిపోగలను? ఆయన నాకు చాలా సాయం చేశాడు. ఆపదలనుండి కాపాడాడు. వేలకొలది యజ్ఞాలు చేశాడు. ప్రతిరోజూ లెక్కలేనన్ని గోవులను బ్రాహ్మణులకు దానంగా ఇస్తుండేవాడు. ఆ ఆవుల గిట్టల తాకిడివల్ల ఏర్పడిన పల్లంలో వర్షపు నీరు చేరింది. ఆయన పేరుమీదుగానే ఇది ఇంద్రద్యుమ్న సరస్సు అయ్యింది. మీ కనుచూపు మేరకు విస్తరించిన ఈ జలరాశి అంతా ఇంద్రద్యుమ్న సరస్సుకు సంబంధించిందే!’ ఆనందబాష్పాలు రాలుస్తూ చెప్పాడు అనూపారుడు. అనూపారుడలా చెప్తుండగానే దేవదూతలు విమానం తెచ్చి ఇంద్రద్యుమ్నుడిని అందులోకి ఎక్కమన్నారు. ఇంద్రద్యుమ్నుడు ఆ దివ్యరథంలో నాళీకజంఘుడిని, ప్రావారికర్ణుడిని, మార్కండేయుడిని వారివారి స్థానాలలో దింపి, స్వర్గానికి వెళ్లిపోయాడు. ఇంద్రుడు అతనికి శాశ్వత స్వర్గంలోక ప్రాప్తిని కలిగించాడు. 

మనం చేసిన మంచిపనులు భూలోకవాసులకు గుర్తున్నంత కాలం మనం స్వర్గంలో వుంటాం. భూలోకవాసులు మనలను మరచిపోతే మన పుణ్యం క్షీణించినట్లన్నమాట. జనులు తరతరాలుగా శాశ్వతంగా గుర్తుంచుకొనేంత మంచిని చేయడమే ఇందుకు తగిన ఉపాయం. ఈ సూత్రం చెడుకు కూడా వర్తిస్తుంది సుమా! మనం చేసిన చెడ్డ పనులు జనాలకు గుర్తున్నంత కాలం మన నివాస స్థానం నరకలోకమే. అందువల్ల, తస్మాత్‌ జాగ్రత్త!

- వరిగొండ కాంతారావు, 94418 86824


logo