ఆదివారం 09 ఆగస్టు 2020
Devotional - Jun 20, 2020 , 00:07:28

దైవ స్మరణే జీవితం కావాలి!

దైవ స్మరణే జీవితం కావాలి!

శ్రవణం కీర్తనం విష్ణో: స్మరణం పాద సేవనం 

అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం ॥

నవవిధ భక్తిమార్గాలలో ‘స్మరణం’ అతి ముఖ్యమైంది. దైవంతో నిరంతరం ఉండేందుకు ఇది చక్కగా దోహదం చేస్తుంది. ఆలోచనలన్నీ మన చుట్టూ ఉండే బంధనాలతోనే. అవి కుటుంబం, బంధువులు, ఉద్యోగం, ఆస్తిపాస్తులు, శరీరం, బలాలు, బలహీనతలు, కోరికలు, సంకల్పాలు, సంఘటనలు వంటివి ఏవైనా కావచ్చు. మనసు ఎక్కడో ఒక దగ్గర ఎప్పటికప్పుడు తిరుగుతూనే ఉంటుంది. దీనివల్ల మనలోని శక్తి ఎప్పటికప్పుడూ నశిస్తూ వస్తుంది. క్రమంగా బలహీనమవుతుంటాం. నిజానికి మనం పూర్ణశక్తిమంతులమే. బంధనాలవల్ల కలిగే ఆలోచనలే మనల్ని ఇలా బలహీనులను చేస్తుంటాయి.

మనకు నిజమైన శక్తి ఆహారం వల్ల రాదు. ఆలోచనలు తగ్గించడం వల్ల వస్తుంది. ఆ అంశాలన్నింటిపైనా ఒక అవగాహన ఉండాలి. ‘ఆలోచించినా అన్ని పనులూ జరగడం లేదు. ఆలోచించకపోతే ఏమీ ఆగడం లేదు’ అనే జ్ఞానం ఏర్పడాలి. ఈ సృష్టిలో మనిషి పాత్ర చాలా కొంచెమే. అతి తక్కువ సమయమే. కనుక, ఈ శరీరంతో ‘తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాలను’ సాధించాలి. ఇదే ‘జీవన కళ’. దీనిని సాధిస్తే దైవమిచ్చే స్ఫురణతోనే జీవితం అతి సులువుగా కొనసాగుతుంది. ఐతే, ఆలోచనలను తగ్గించడం అనేది చెప్పినంత సులువేమీ కాదు. మనసు ఇంద్రియాదుల ద్వారా చేస్తున్న పనులను, ఆలోచనలను తగ్గించి దానికి మరొక మార్గాన్ని చెప్పడమే ‘జపం’ లేదా ‘నామస్మరణం’.

మన నిర్ణయాలు, ప్రణాళికలు, దైవ ప్రణాళికలకు అనుకూలంగా ఉండటం లేదు. కనుకే, నిరంతరం మనం దైవనామ స్మరణ చేస్తూండాలి. దైవనామాన్ని స్మరించడమంటే చైతన్యాన్ని స్మరించడమే. సూర్యునిచుట్టూ తిరుగుతున్నందువల్ల భూమికి గొప్పశక్తి వస్తుంది. గొప్పశక్తి చుట్టూ తిరగడం వల్ల తమకూ శక్తి వస్తుందన్నది ప్రకృతి సూత్రం. మనసుకూడా నిరంతరం మనలోని శక్తిచుట్టూగాని, ప్రకృతి శక్తిచుట్టూగాని తిరుగుతుండాలి. బంధాలు, బంధనాలు, సమస్యలు, కోరికలు, బాధలచుట్టూ తిరగకూడదు. శక్తికి ఏ రూపం పెట్టుకున్నా అభ్యంతరం లేదు. భారతీయ దేవతా స్వరూపాలన్నీ వివిధ శక్తుల సంకేతాలే. గణపతి గురుత్వాకర్షణ, కుమారస్వామి విద్యుదయస్కాంతత్వం, శివుడు భూమి, పార్వతి పాంచభౌతిక, విష్ణువు విశ్వానికి, బ్రహ్మ ప్రకృతి.. శక్తులకు సంకేతాలు.

చాలామందిలోని పెద్ద అపోహ ఏమిటంటే దైవస్మరణ కోసం చేసే జపం ఎన్నిసార్లు చేయాలని! 11 లేదా 21 సార్లు లేదా 108 సార్లు చేస్తే చాలా? ఇన్నిసార్లు చేసిన తర్వాత మనసు ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ సమస్యలు, సుఖాలు, బంధాలు, బంధనాల వైపేనా? అప్పుడు మళ్ళీ సాధించిన శక్తిని మనం కోల్పోకుండా ఉంటామా? దైవం నిరంతరం మనకు సంతోషాన్నిస్తూ కోరికలు తీర్చడానికి సిద్ధంగానే ఉంటుంది. సూర్యుని వెలుగు నిరంతరం ప్రసరిస్తూ ఉన్నట్లు భగవంతుని శక్తి ఎప్పుడూ మనపై ప్రసరింపబడాలంటే మనం మన పనులన్నీ చేస్తూనే నిరంతరం దైవంతో అనుబంధం పెంచుకోవాలి. కనుకే, దైవనామాన్ని నిరంతరం స్మరించాలి.

‘పానీయంబులు త్రావుచున్‌, కుడుచుచున్‌, లక్షించుచున్‌, హాసలీలా నిద్రాదులు చేయుచున్‌...’ అని ప్రహ్లాదుడు చెప్పినట్లు అన్ని పనులు చేస్తూ కూడా దైవనామాన్ని జపిస్తూనే ఉండాలి. ఏదో పనిగా దైవనామ స్మరణ చేయకుండా, దైవనామ స్మరణ చేస్తూనే మిగిలిన పనులు చేస్తూ ఉండాలి. అంటే, నామస్మరణ మాత్రమే జీవితం కావాలి. అయితే, దీనికి భక్తి, శ్రద్ధ అత్యంత ప్రధానం సుమా!



logo