ఆదివారం 09 ఆగస్టు 2020
Devotional - Jun 19, 2020 , 00:04:30

జీవన్ముక్తి ఇలా సాధ్యం!

జీవన్ముక్తి ఇలా సాధ్యం!

చరాచరాత్మకమైన ఈ జగత్తులో క్రిమి కీటకాలు మొదలుకొని మానవుల వరకు 84 లక్షల జాతుల జీవులు జన్మిస్తున్నాయి. ఈ జన్మలకు జీవుడు చేసిన కర్మలే కారణం. అన్ని జన్మలకన్నా మానవజన్మ గొప్పది. ఇతర జన్మలతో పోలిస్తే మానవజన్మలోనే బుద్ధి వికాసం ఎక్కువ. మిగిలిన జన్మలన్నీ భోగ్యజన్మలే. కర్మఫలాలను అనుభవించడానికి మాత్రమే అవి ఏర్పడుతాయి. మానవజన్మలో మాత్రమే కర్మఫలాలను అనుభవిస్తూ కూడా కొత్త కర్మలు చేయడానికి, వివేకబుద్ధితో కర్మగతిని మార్చుకొని, పరమాత్మను చేరడానికి అద్భుత అవకాశం ఉంటుంది. మానవజన్మ రావడం అంత సులభం కాదు. అనేక జన్మలలో చేసిన పుణ్యకర్మల ఫలితంగా మాత్రమే ఇది సంభవమవుతుంది. అందుకే, ‘జన్తూనాం నరజన్మ దుర్లభమ్‌' అన్నారు పెద్దలు.

‘యథాకర్మ తథాఫలమ్‌'. కర్మ ఎటువంటిదో ఫలం కూడా అలాంటిదే. జీవుడే తాను చేసిన కర్మలను బట్టి ఫలితాలను అనుభవించవలసి ఉంటుంది. పుణ్యకర్మలకు సుఖాలను, పాపకర్మలకు దుఃఖాన్ని పొందుతాడు. అనేక జన్మలలో చేసిన సంచిత కర్మలలో ముందుగా చేసిన కర్మల ఫలభాగం ‘ప్రారబ్ధం’. దీనిని ఈ జన్మలోనే అనుభవిస్తాం. ‘ప్రారబ్ధమ్‌ భోగతో నశ్యేత్‌'. అనుభవించడం వల్ల మాత్రమే ప్రారబ్ధం నశిస్తుంది. మనం అనుభవిస్తున్న సుఖదుఃఖాలకు ప్రారబ్ధకర్మలే కారణం. ఈ జన్మలో చేసే కర్మలు తర్వాత వచ్చే జన్మలకు ప్రారబ్ధం అవుతుంది. ఈ విధంగా జీవుడు కర్మబంధంలో చిక్కుపడి జన్మ పరంపరలను పొందుతుంటాడు.

జీవుడు ఒక్క క్షణం కూడా కర్మ చేయకుండా ఉండలేడు. ప్రకృతి గుణాల (సత్తం, రజస్సు, తమస్సు)తో అవశుడై కర్మలు చేస్తాడు. ఇంద్రియాలు కూడా కర్మలను ప్రేరేపిస్తాయి. ‘నహి కశ్చిత్‌ క్షణమపి జాతు తిష్ఠత్య కర్మకృత్‌/ కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతి జైర్గుణైః॥’ అని భగవద్గీతలో చెప్పడం జరిగింది. కర్మలు చేయకుండా శరీర పోషణ, మనుగడ కూడా సాధ్యం కాదు. ఆకలి దప్పులు తీర్చుకోవడం, నిద్ర మొదలైనవి.. అవసరమైన కర్మలు. వీటితోపాటు లౌకికసుఖాల పట్ల ఆసక్తి, అనుభవించినా కూడా తీరని కామం కర్మలను ప్రేరేపిస్తాయి. కోరికలు తీరనప్పుడు క్రోధం (కోపం) కలుగుతుంది. కోపం వల్ల వివేకబుద్ధి నశిస్తుంది. దాంతో జీవుడు వ్యర్థమైన పనులు చేస్తుంటాడు. ఫలితంగా శ్రేయస్సును కోల్పోతాడు. ఫలితంగా మానవజన్మ నిరర్థకమవుతుంది. ‘కోరికలే అన్ని అనర్థాలకు మూలం’ అని బుద్ధ భగవానుడు కూడా ఉద్ఘాటించాడు.

మన కర్మలకు మనమే బాధ్యులం. మనకు మనమే బంధువులం. మనకు మనమే శత్రువులం కూడా. జీవుడు తనకు తాను అధోగతి పాలు కాకుండా చూసుకోవాలి. తనను తానే ఉద్ధరించుకోవాలి. దీనినే భగవద్గీత, ‘ఉద్ధరే దాత్మనాత్మానం నాత్మాన మవసాదయేత్‌/ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవరి పురాత్మనః॥’ అన్నది. ఫలాపేక్ష సకామకర్మలను ప్రేరేపిస్తుంది. సకామకర్మలు తాత్కాలిక సుఖాన్నే కలిగిస్తాయి. కానీ, శాశ్వతసుఖాన్ని ఇవ్వవు. శాశ్వతసుఖమే మోక్షం, మోక్షాన్ని పొందడమే మానవజన్మ ప్రధాన పురుషార్థం. మోక్షప్రాప్తికి నిష్కామకర్మ మార్గమే సరైందని గీతాచార్యుని అభిప్రాయం. ఫలాపేక్ష లేని వేదవిహిత కర్మలు కర్మసంగాన్ని (బంధాన్ని) తొలిగిస్తాయి. కర్మసంగం లేకపోవడమే ‘నైష్కర్మ్యం’ అంటే కర్మ రహిత స్థితి.

‘నేను, నాది’ అనే భావన లేకుండా చేయవలసిన పనులను చేయాలి. ‘చేయవలసింది కాబట్టి చేస్తున్నాను’ అనే ఫలాపేక్ష లేకుండా అన్ని కర్మలనూ పరమాత్మ పట్ల సమర్పణ బుద్ధితో చేయాలి. ఫలాపేక్ష లేని కర్మల వల్ల పరమాత్మ అనుగ్రహం కలుగుతుంది. ఇలా ‘కర్మలు చేసేవారు కర్మలు చేయనివారే’ అవుతారు. ఇలాంటి వారిని పరమాత్మ స్వయంగా ఉద్ధరించి భవసాగరాన్ని దాటించే జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అందువల్ల, ఈ నిష్కామ కర్మయోగమే జీవన్ముక్తికి రాచమార్గం.


logo