సోమవారం 03 ఆగస్టు 2020
Devotional - Jun 15, 2020 , 23:14:10

సుగాత్రి పాతివ్రత్య ధర్మం!

సుగాత్రి పాతివ్రత్య ధర్మం!

‘దాంపత్య జీవనంలో భర్తకు ఏది ప్రియమో దానిని ఆచరించడమే పాతివ్రత్య ధర్మమని, అది లోక విరుద్ధమైనా సరే పాటించవలసిందే’ అని ‘సుగాత్రి-శాలీనుల’ కథ వెల్లడిస్తున్నది. శాలీనుడు ఎంత సాత్వికుడో అంత సహజాతుడు. భార్య సుగాత్రి కృత్రిమ అలంకరణలు అతన్ని ఏ మాత్రం ఆకట్టుకోలేదు. ఇది తెలియని సుగాత్రి, ఆమె తల్లి, తోటి పరివారమంతా అతనినే తప్పు పడితే, సరస్వతీ దేవి జోక్యంతో వారు సత్యాన్ని తెలుసుకుంటారు.

శారదా పీఠమైన కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణ పూజారి దంపతుల కుమార్తె సుగాత్రి. చక్కని అందగత్తె. యుక్త వయసులో యోగ్యుడైన శాలీనునికిచ్చి వివాహం చేస్తారు. ప్రథమ సంగమ వేళ ముత్తయిదువలు సుగాత్రిని సర్వాభరణాలతో అలంకరించి భర్త గదిలోకి పంపుతారు. కానీ, చిత్రంగా శాలీనుడు ఆమె వైపు కన్నెత్తి చూడడు. అలా రోజుల తరబడి ఎలా అలంకరించిన వధువు అలానే ఉదయం గది నుంచి వస్తుండటంతో అందరూ విస్తుపోయారు. శాలీనుణ్ణి గురించి సుగాత్రితో పలురకాలుగా పరిహాసాలాడారు. పైగా సుగాత్రికే బుద్ధి చెప్ప చూస్తారు.

కాంతు డుచితజ్ఞు డైనను కాంతకు సిగ్గుపడ జెల్లుగాక, కటకటా!

కాంతుడు సిబ్బితికాడై కాంతయు నట్లయిన నెట్లు కాపురమింకన్‌?

‘చొరవ చూపే భర్త ముందు కాంతలు సిగ్గు పడటంలో అర్థం ఉంటుంది. కానీ, భర్త ముందుకు రానప్పుడు భార్య కూడా సిగ్గుపడితే వారి కాపురం సాగేదెట్లా?’ సుగాత్రిని తల్లి దగ్గరకు పిలిచి, ‘నీవెంత వెర్రిబాగుల దానివే, నీ బంగారు ప్రాయాన్ని అలా శయ్యకు అంకితం చేస్తావా?’ అని మందలించింది. సుగాత్రి ఎన్ని ప్రయత్నాలు చేసినా భర్త ధోరణిలో మార్పు రాలేదు. ఇల్లరికం తెచ్చుకొన్న శాలీనుని ఈ వింత ప్రవర్తనతో సుగాత్రి తల్లి విసిగిపోయింది.

ఓనాడు ఉండబట్టలేక, ‘అలా ఊరికే ఖాళీగా ఉండకపోతే తోటపనికి వెళ్లవచ్చు కదా! పూలు తెచ్చి శారదాదేవికి మాలలు అల్లవచ్చు కదా’ అంటుంది. అంతే! అతనిలో ఆత్మాభిమానం మేల్కొని, మర్నాటి నుంచి రోజూ తోటకు వెళ్లి మొక్కలకు నీళ్లు పెడుతూ, పాదులు తవ్వుతూ, పూలు తెచ్చి సరస్వతీ పూజకు మాలలు అల్లుతుంటాడు. రాత్రిళ్లూ ఎప్పటిలా తల్లి, సుగాత్రిని అనేక ఆభరణాలతో అలంకరించి గదిలోకి పంపుతున్నా.. శాలీనునిది అదే వింత ధోరణి!

ఒకరోజు ఉన్నట్టుండి పెద్ద వర్షం మొదలైంది. సుగాత్రికి భర్త గురించిన ఆందోళన కలిగి, వెంటనే ఆభరణాలన్నీ తీసేసి, ఒక సామాన్యురాలిగా తోటలోకి వెళ్లింది. అక్కడ భర్త శారీరక శ్రమను చూసి, తానూ సహాయ పడుదామనుకుంది. కొంగు నడుముకు చుట్టుకొని, మోకాళ్లపైకి చీరను ఎత్తి గోచీ పెట్టి, పారతో నీళ్ల కాలువను సరిచేయ సాగింది. కాసేపటికి ముఖానికి పట్టిన చెమటను చేతితో తుడుచుకో బోగా, తలవెంట్రుకలు అడ్డు వస్తాయి. సరిగ్గా, అప్పుడే సుగాత్రి ఆ ‘శ్రమ సౌందర్యానికి’ శాలీనుడు ఆకర్షితుడవుతాడు. ఆ తోటలోని ఒక కుటీరంలోనే ఇద్దరూ ఒక్కటవుతారు. రోజూ తోటలో కలుసుకో సాగారు. చీకటిపడే వేళకు ఇల్లు చేరేవారు ఇద్దరూ. పడగ్గదిలోకి మళ్లీ ఆభరణాలతోనే అడుగిడే సుగాత్రిపట్ల శాలీనునిది అదే తిరస్కార ధోరణి. 

అప్పుడు సుగాత్రికి పతి హృదయం అర్థమైంది. దాంతో ఒక సాధారణ యువతిలా తోటలో కలుసుకోవడానికి ఆమె ఏ మాత్రం వెనుకాడలేదు. ‘పగటి పూట వేళకాని వేళ.. అలా భార్యాభర్తలు కలుసుకొంటే, ‘సుగుణవంతులు కాని సంతానం కలుగదా?’ అని సుగాత్రి తల్లి అభ్యంతరం చెబుతుంది. కానీ, వయసులో చిన్నదైనా సుగాత్రి మాత్రం ‘భర్తకు ఏది ప్రియమో అదే భార్య ధర్మం’ అని తీర్మానిస్తుంది. సనాతన భారతీయతలోని ఈ సూక్ష్మ సూత్రాన్ని ఆమె లోకానికి చాటిచెప్పింది. సాక్షాత్తు సరస్వతీ దేవియే సుగాత్రి తల్లికి కలలో కనిపించి ‘ఆమెది అసలైన పాతివ్రత్యమని’ ప్రశంసించడం కొసమెరుపు.


logo